గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionశివ పురాణంలో కుమార కర్ణాటకం!

1 గంట క్రితం

Siddaramaiah-Moves-Court-to-Halt-Dissemination-of-Alleged-Sting-Operation-Material.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 05:11 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

రాజకీయాలలో దేన్ని ఎవరు ఎందుకు ముందుకు తెస్తారో, అది ఎవరు ఎలా ఉపయోగించుకోజూస్తారో చెప్పడం కష్టం. కొన్నిసార్లు అవి తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి. కొన్ని సార్లు టీ కప్పులో తుపానులా తేలిపోతాయి. ఇప్పుడు కర్ణాటక రాజకీయాల పరిస్థితి అలాగే వుంది. తనపైన, మంత్రులపైన స్ర్టింగ్‌ ఆపరేషన్‌ ‌జరుగుతున్నట్టు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కోర్టులో కేసు వేశారు. ఉన్నదేమో వారి కాంగ్రెస్‌ ప్రభుత్వమే. ‌మరి ఆయన తమ ముఖ్యమంత్రి శివ కుమార్‌‌పై ఆరోపణ చేస్తున్నారా లేక కేంద్రంలోని బిజెపి పైనా? గతంలో రామకృష్ణ హెగ్డే ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ఆరోపణలపై రాజీనామా చేయాల్సి వచ్చింది. తెలంగాణ లోనూ కెసిఆర్‌ ‌హయాంలో ట్యాపింగ్‌ ‌చేశారంటూ భారీ విచారణ జరుగుతున్నది. కనుక ఇలాంటివి కొత్తేమీ కాదు. అయితే విచిత్రంగా సిద్దరామయ్యను కేంద్ర మంత్రి, మాజీ సిఎం కూడా అయిన కుమారస్వామి బలపరిచారు. ఎనిమిదేళ్లు సిఎంగా చేసిన సిద్దూ పైనే నిఘా వేయడమేంటని కోప్పడిపోయారు. అయితే ఈ అనూహ్య మద్దతు ఏమిటో అర క్షణంలో బయిటపెట్టేశారు. కర్ణాటకలో ఇలాంటివి ఎప్పుడూ జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. తన మారుటి సోదరుడు మాజీ మంత్రి రేవణ్ణ కుమారుడైన హసన్‌ ఎం.పి ప్రజ్వల్‌ ‌రేవణ్ణను ఇలాగే అసత్యారోపణలలో ఇరికించి జైలుకు పంపించారని ట్విస్టు ఇచ్చారు. అప్పట్లో ప్రజ్వల్‌ ‌మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన ఘటన సంచలనం కలిగించింది. విచారణ తర్వాత తను జైలులో వున్నారు. ఇంతకూ వీరంతా మాజీ పి.ఎం దేవెగౌడ సంతతి అని చెప్పనవసరం లేదు. ఆ సమయంలో బయటకు వచ్చిన బూతు వీడియోలు కలవరం కలిగించాయి. ఇప్పుడు కుమారస్వామి అవన్నీ ఫేక్‌ అంటున్నారు. దీనిపై హోంమంత్రి అమిత్‌ ‌షా కు ఫిర్యాదు చేస్తానంటున్నారు. తమాషా ఏమంటే సదరు ప్రజ్వల్‌ ‌రేవణ్ణ జైలులోనూ ఇలాంటి వీడియోలే చూస్తూ పట్టు పడ్డారని మాత్రం మర్చిపోయారు!

రాజమౌళి రామారావునూ కాదంటారా?

దర్శక బాహుబలి రాజమౌళి తీరే వేరు. వ్యూహాత్మక కథలు, వందల కోట్ల బడ్జెట్టు, ఏళ్ల తరబడి షూటింగులూ గ్రాఫిక్కులతో తెలుగు సినిమాను గ్లోబల్‌ ‌వాణిజ్య వస్తువును చేసిన బుద్ధిశాలి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే కృత్రిమ ప్రశ్నతో సీక్వెన్స్‌ ‌నడిపించారు. వీర విధేయత తప్ప రాచరిక ధిక్కారం లేకుండా జానపదం తీసి విఠలాచార్య వరవడి అటూ ఇటూ చేశారు. ఇక ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌‌’ లో అల్లూరి సీతారామరాజుతో సంఘ పరివార్‌ ‌పతాకం పట్టించినంత పని చేశారు. రాముడి బాణాలు పట్టించి బట్టలు కట్టించారు. అంటే కృష్ణ తీసిన సీతారామరాజు సమధర్మం చెబితే రాజమౌళి సనాతనం బాట పట్టించారన్నమాట. వాళ్ల నాన్న, వీటి రచయిత విజయేంద్ర ప్రసాద్‌‌కు బిజెపి రాజ్యసభ సభ్యత్వమే ఇచ్చిందంటే ఆశ్చర్యమేముందిక? ఇలా జానపదం చరిత్ర అయ్యాక ఇప్పుడు జక్కన్న పౌరాణికం మీద పడ్డారు. మహేష్‌‌బాబుతో దీర్ఘకాలంగా తీస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల గానీ ముందే ఉచిత పబ్లిసిటీ రాజమౌళి టెక్నిక్‌. ‘వారణాసి’ మోడీగారి నియోజకవర్గం మాత్రమేగాక పౌరాణిక నగరం కూడా కదా. ఇందులో రామాయణం కూడా చూపిస్తారట కాస్సేపు. బానే వుంది. కానీ ఈ నేపథ్యంలో రాజమౌళి ఇస్తున్న ఇంటర్వ్యూ లో మన పాత పౌరాణికాలను తీసిపారేస్తూ మాట్లాడటమే వివాదంగా మారింది. మన పౌరాణికాలు బాగుంటాయి గానీ తనకెప్పుడూ సంతృప్తిని ఇవ్వలేదట, ఎన్టీఆర్‌ ‌వంటి నట దర్శక దిగ్గజాలు, కెవిరెడ్డి కమలాకర కామేశ్వరరావు, బాపు వంటి నిర్దేశకులు రూపొందించిన పౌరాణికాలు ప్రపంచ ప్రసిద్ధాలు కదా. ‘మాయాబజార్‌’ వంటివి జాతి జీవితంలోనే ప్రతీకలుగా నిలిచిపోయాయి కదా. ఆనాటికి వాటి సాంకేతిక నైపుణ్యం కూడా తక్కువేమీ కాదు కదా... మరి వాటిని తేలికచేయడం దేనికి? డెబ్బయి ఏళ్లనాటి ‘మాయాబజార్‌‌’లో ఘటోత్కజుడుగా ఎస్వీఆర్‌ అభినయం, వాచకం ఆ సన్నివేశాలను హత్తుకు పోయేలా చేసిన మార్కస్‌ బారట్లే పనితనం తక్కువా? ఈ నాడు సాంకేతికత పెరిగి వుండొచ్చు గనక కొత్త ప్రయోగాలు చేయడం వేరు. అవి సంతృప్తికరంగా లేవనడం వేరు. రాజమౌళి తన ‘వారణాసి’ ప్రచారం కోసం వేసిన ఎత్తుగడే ఈ మాటలనిపిస్తుంది. గతంలో పౌరాణికాలు మానవీయత జోడించి తీశారు. ఇప్పడు సనాతన బాటలో ‘బాహుబలి’ వాటిని మరో దారి పట్టిస్తున్నారా అని సందేహం కూడా కలుగుతుంది.

దళపతిపై వల వేస్తున్నారా?

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్‌ జోసఫ్‌‌ను ‌‘విజయవాడ ఉత్సవ్‌’ ‌కోసం తెలుగుదేశం నేతలు పనిగట్టుకుని ఆహ్వానించి హంగామా చేయడంలో రాజకీయ వ్యూహమేంటి? ఆయన కమ్యూనిస్టుల బయిట మద్దతుతో, కాంగ్రెస్‌‌ ప్రత్యక్ష భాగస్వామ్యంతో మిశ్రమ ప్రభుత్వం నడపడమే గాక- ఆయన పార్టీ టివికె ‘ఇండియా’ వేదిక సమావేశాలలోనూ పాల్గొంటున్నది. ‘సర్‌‌’ను వ్యతిరేకించింది. రాష్ర్టాల హక్కుల కోసం మాట్లాడుతుంది. మరి మాట్లాడితే మోడీ భజనలో మునిగి తేలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను కోరికోరి ఆహ్వానించడమేమిటి? దీనికి ముందు మోడీ తమిళనాడులో పర్యటించారు. పైగా విజయ్‌ ‌కి మాజీ ముఖ్యమంత్రి జగన్‌‌తో సన్నిహిత సంబంధాలున్నాయని టిడిపి అనుకూల మీడియా విపరీతంగా చెబుతుంది. ఎ.పి లిక్కర్‌ ‌లాబీనే అక్కడా వుందని సమాచారం. మరి విజయవాడ ఎం.పి కేశినేని చిన్ని కోరికోరి దళపతిని ఎందుకు తెచ్చారనే దానిపై చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. పైగా ఆ వేదికపై బాబు అసందర్భంగా విజయ్‌ ‌సమక్షంలోనూ మోడీనే కీర్తించడం మరో వింత. విజయ్‌ ‌మాత్రం తాను గోదావరి-కావేరి అనుసంధానం గురించి మాట్లాడేందుకే వచ్చానని చెప్పారు గనక ఇప్పటికింతే కావచ్చు.

- పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్