మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనిరంకుశత్వం దిశగా భారత్‌ ..!

1 గంట క్రితం

నిరంకుశత్వం దిశగా భారత్‌ ..!
- మోడీ ప్రభుత్వం స్వతంత్ర వ్యవస్థలను బలహీనపరిచింది
-  హ్యుమన్‌ రైట్స్‌ వాచ్‌ నివేదిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 01:37 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • మోడీ ప్రభుత్వం స్వతంత్ర వ్యవస్థలను బలహీనపరిచింది

  • హ్యుమన్‌ రైట్స్‌ వాచ్‌ నివేదిక

న్యూఢిల్లీ: మానవ హక్కులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను పరిరక్షించాల్సిన భారతదేశంలోని స్వతంత్ర సంస్థలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం క్రమంగా బలహీనపరిచిందని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హ్యూమన్ రైట్స్ వాచ్‌ (హెచ్‌ఆర్‌డబ్ల్యూ) సంస్థ పేర్కొంది. ఆ సంస్థ తాజాగా ‘సో వాట్స్‌ దిస్‌ డెమొక్రసీ వి ఆర్‌ టాకింగ్‌ ఎబౌట్‌?’ పేరుతో విడుదల చేసిన 95 పేజీల నివేదికలో భారత్‌ నిరంకుశ పాలన దిశగా సాగుతోందని హెచ్చరించింది. పార్లమెంటరీ ప్రక్రియ, ప్రతిపక్షాలపై ఒత్తిడి-కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు, రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రత, న్యాయవ్యవస్థ పాత్ర అనే నాలుగు అంశాల ఆధారంగా దేశంలోని పరిస్థితులను విశ్లేషించినట్లు ఆ సంస్థ తెలిపింది, 2025 జనవరి నుంచి 2026 సెప్టెంబరు మధ్య న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు, ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులు సహా అనేక మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసినట్లు హెచ్‌ఆర్‌డబ్ల్యూ తెలిపింది. “ప్రతి వ్యవస్థనూ లొంగదీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది” అని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌ వై ఖురేషీ గత ఏడాది చేసిన వ్యాఖ్యతో ఈ నివేదిక ప్రారంభం కావడం గమనార్హం.

​ఏకపక్షంగా ఎస్‌ఐఆర్‌..

ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ లోపభూయిష్టంగా, ఏకపక్షంగా, పారదర్శకత లేకుండా సాగిందని, మహిళలు, పేదలు, మైనారిటీలు నష్టపోయారని నివేదిక తెలిపింది. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల విషయంలో ప్రధాని మోడీ, బిజెపి సీనియర్‌ నేతలపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమైందని పేర్కొంది. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, పోలింగ్‌ డేటా వెల్లడించకపోవడం, ఓట్ల లెక్కింపులో అక్రమాలు, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో జోక్యం వంటి ఆరోపణలపై విశ్వసనీయ విచారణ జరగలేదని తెలిపింది. బెంగాల్‌, బిహార్‌లలో జాబితాల నుంచి పేర్లు తొలగించినవారికి ఆహార రాయితీలు సహా కొన్ని సంక్షేమ పథకాల అర్హత ఉండదని అక్కడి బిజెపి ప్రభుత్వాలు ప్రకటించినట్లు నివేదిక తెలిపింది ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఢిల్లీలో జరిగిన ఆందోళనలపై ప్రభుత్వం మోపిన నిర్బంధ కాండను కూడా నివేదిక ప్రస్తావించింది. 2023 డిసెంబరులో ఎన్నికల కమిషనర్ల నియామకంపై కార్యనిర్వాహక వర్గం నియంత్రణను బలపరిచే, విధుల నిర్వహణకు సంబంధించి వారికి విస్తృత చట్టపరమైన రక్షణ కల్పించే చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించిందని హెచ్‌ఆర్‌డబ్ల్యూ పేర్కొంది. ఆ సమయంలో లోక్‌సభ నుంచి 100 మంది, రాజ్యసభ నుంచి 46 మంది సభ్యులు సస్పెన్షన్‌లో ఉన్న విషయాన్ని కూడా నివేదిక ప్రస్తావించివంది.

నివేదిక లోని మరిన్ని అంశాలు :

2014–24 మధ్య లోక్‌సభలో బిజెపికి పూర్తి మెజారిటీ ఉన్న కాలంలో పార్లమెంటరీ కమిటీల పరిశీలనను ప్రభుత్వం పక్కనపెట్టిందని, ప్రతిపక్షాలకు కీలక పదవులు కల్పించకుండా ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచిందని నివేదిక ప్రస్తావించింది. పిఆర్ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ గణాంకాల ప్రకారం, 2014–19 మధ్య 28 శాతం, 2019–24 మధ్య 16 శాతం బిల్లులు మాత్రమే కమిటీలకు వెళ్లాయి. అంతకుముందు రెండు లోక్‌సభ కాలాల్లో ఈ శాతం వరుసగా 71, 60గా ఉన్నట్లు నివేదిక తెలిపింది.

రాజ్యసభ ఆమోదం అవసరం లేని “మనీ బిల్లులు”గా వర్గీకరించి, ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపే కొన్ని చట్టాలను ఆమోదించారని హెచ్‌ఆర్‌డబ్ల్యూ పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారాలను విస్తరించిన 2019 సవరణను ఉదాహరణగా చూపింది.

ఈ విధానాన్ని ‘రాజ్యాంగ ప్రక్రియ దుర్వినియోగం’ గా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ అభివర్ణించినట్లు నివేదిక ఉటంకించింది. ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా అదే ఏడాది ఉపా చట్టానికీ సవరణలు చేసినట్లు తెలిపింది.

193 మందిపై ఇడి కేసులు..శిక్ష పడింది ఇద్దరికే

సిబిఐ, ఇడి, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)లను కేంద్రం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించిందని హెచ్‌ఆర్‌డబ్ల్యూ పేర్కొంది. విదేశీ నిధులు, ఆర్థిక చట్టాల కింద హక్కులమోడీ ప్రభుత్వం స్వతంత్ర వ్యవస్థలను బలహీనపరిచింది సంస్థలు, మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. 2015 ఏప్రిల్‌ నుంచి 2025 ఫిబ్రవరి వరకు రాజకీయ నేతలపై ఇడి 193 కేసులు నమోదు చేయగా, వాటిలో రెండింటిలోనే శిక్షలు పడ్డాయని కేంద్ర ఆర్థిక శాఖ 2025 మార్చిలో పార్లమెంటుకు తెలిపిన వివరాలను నివేదిక ప్రస్తావించింది. రాజకీయ నేతలపై దర్యాప్తుల సంఖ్య 600 శాతానికి పైగా పెరిగిందని, లక్ష్యంగా మారినవారిలో చాలామంది ప్రభుత్వ ప్రత్యర్థులని హెచ్‌ఆర్‌డబ్ల్యూ పేర్కొంది. అయితే, ఇడి కేసులను రాజకీయ అనుబంధం ఆధారంగా విభజించదని, పార్టీల వారీ వివరాలు తమ వద్ద లేవని కేంద్ర మంత్రి, మంత్రిత్వ శాఖ తెలిపినట్లు నివేదిక గుర్తుచేసింది. దర్యాప్తులో ఉన్న కనీసం 23 మంది ప్రతిపక్ష నేతలు బిజెపిలో చేరిన తర్వాత ఊరట పొందారన్న వార్తా కథనాలనూ విశ్లేషించింది. మానవ హక్కుల కార్యకర్తలపై ఉపా చట్టాన్ని ఉపయోగించారని కూడా నివేదిక తెలిపింది. ఫ్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా, కస్టడీలో మరణించిన ‌స్టాన్‌ ‌స్వామి విషయాలను నివేదికలో పొందుపరిచింది.

​న్యాయవ్యవస్థలో జోక్యం

న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు, పదోన్నతుల్లో కార్యనిర్వాహక వర్గం జోక్యం పెరుగుతోందని న్యాయవాదులు, ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదిక తెలిపింది. పౌర స్వేచ్ఛల విషయంలో కార్యనిర్వాహక వర్గం హద్దులు దాటినప్పుడు న్యాయవ్యవస్థ గట్టిగా నిలబడలేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ లోకూర్‌ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.

భారత్‌ను “ప్రజాస్వామ్యానికి తల్లి”గా అభివర్ణిస్తున్నమోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలు, విమర్శకులపై రాజ్యాంగ సంస్థలను ప్రయోగించడం ఆపి, ప్రజల హక్కులను రక్షించేలా వాటి స్వతంత్రతను పునరుద్ధరించాలని హెచ్‌ఆర్‌డబ్ల్యూ కోరింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో, వాణిజ్య, భద్రతా చర్చల్లో భారత్‌ మిత్రదేశాలు ఈ ఆందోళనలను లేవనెత్తాలని సూచించింది. “భారత స్వతంత్ర సంస్థలను ప్రభుత్వం డొల్లగా చేస్తోంది” అని సంస్థ ఆసియా డైరెక్టర్‌ ఎలెయిన్‌ పియర్సన్‌ వ్యాఖ్యానించినట్లు నివేదిక పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్