శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయుపిఐ మోసం

8 గంటల క్రితం

upi charges.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 05:56 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

యుపిఐ చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండిఆర్) విధించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం డిజిటల్‌ చెల్లింపుల భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అక్టోబర్‌ 15 నుంచి రూ.2,000కు మించిన యుపిఐ వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం ఎండిఆర్‌ విధించనున్నారు. ఇది వినియోగదారులపై భారం కాబోదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా - అది అటు తిరిగి ఇటు తిరిగి జనం నెత్తినే పడడం ఖాయం. ఇప్పటికైతే వ్యక్తుల మధ్య చెల్లింపులకు ఈ ఛార్జీలు విధించటం లేదని, వస్తు కొనుగోళ్లపైనే రూ.2 వేలలోపు ఈ ఛార్జీలు ఉండవని చెబుతున్నా- తరువాతి కాలంలో అది మరిన్ని విధింపులకు దారి తీయొచ్చు. మోడీ ప్రభుత్వం గత ఆచరణలు చూసిన తరువాత ఇప్పటి మాటలను నమ్మలేమని వినియోగదారులు ఆందోళన చెందటం సహజం.

​గత ఆగస్టులో పార్లమెంటు ‘టాక్సేషన్‌ అండ్‌ అదర్‌ లాస్‌ (అమెండ్‌మెంట్‌) బిల్‌–2026’ను మోడీ ప్రభుత్వం ఆమోదించింది. పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ యాక్ట్‌లో మార్పు చేసి, భవిష్యత్తులో నిర్దిష్ట ఎలక్ట్రానిక్‌ చెల్లింపులపై రుసుము విధించేందుకు చట్టపరమైన అవకాశం కల్పించింది. అప్పుడే పార్లమెంటులో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రాజ్యసభలో సిపిఎం సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ ... యుపిఐని ఉచిత ప్రజా మౌలిక సదుపాయంగా అభివర్ణించిన మోడీ ప్రభుత్వపు గత వాదనల గురించి ప్రస్తావించారు. వ్యాపారులపై పడే ఎండిఆర్‌ చివరికి వినియోగదారులపై భారంగా పడదనే మాటలకు గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. దీనికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానమిస్తూ, ఆ చట్ట సవరణతో తక్షణం ఎలాంటి యుపిఐ ఛార్జీ విధించడం లేదని, ఎండిఆర్‌ విధానం ఇంకా నిర్ణయించలేదని, వినియోగదారులు, చిన్న వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. భవిష్యత్తులో అవసరమైతే రుసుము విధించేందుకు వీలు కల్పించే ‘ఎనేబ్లింగ్‌ ప్రొవిజన్‌’ కోసమే చట్టసవరణ అంటూ చెప్పుకొచ్చారు. చిత్రమేమిటంటే నెల వ్యవధిలోనే ఆ ‘భవిష్యత్తు’ వినియోగదారుల ముందుకు వచ్చేసింది! పార్లమెంటులో చెప్పిన మాటలన్నీ అబద్ధాలని, భారాలు మోపటానికి సిద్ధమయ్యాకే అందుకు వీలుగా బిల్లును తీసుకొచ్చారని పరిశీలకులకు అప్పుడే అర్థమైపోయింది. కానీ, తప్పించుకోవటానికి మోడీ ప్రభుత్వం ఇప్పటికీ డొంక తిరుగుడు కబుర్లు చెబుతోంది. సరుకులపై ఒక భారం అంటూ వేశాక దానిని వినియోగదారుడి తరఫున ఏ వ్యాపారీ మోయడని, ఏదో ఒక రూపంలో కొనుగోలుదారుల మీదనే పడుతుందని వ్యాపార తీరు తెలిసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. మోడీ ప్రభుత్వం మాత్రం భారం వేస్తూనే - అబ్బే.. అలా జరగదంటూ బుకాయింపులకు దిగుతోంది.

2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రధాని మోడీ కల్పించిన ఆశలూ, అంచనాలూ అన్నీ ఇన్నీ కావు. నల్లధనం బయటికి వచ్చేయటం మొదలుకొని, టెర్రరిస్టు కార్యకలాపాలు ఆగిపోవటం దాకా వల్లించిన లక్ష్యాల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. డిజిటల్‌ లావాదేవీల్లోకి జనాలను ఒక్కుమ్మడిగా దించటమే ప్రభుత్వ అప్రకటిత ఉద్దేశమని ఆ తరువాతి కాలంలో దేశానికి అర్థమైంది. జనాన్ని ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన నోట్ల రద్దు నిర్ణయంతో దేశం నానా అగచాట్లూ చవిచూసింది. ఉన్న పెద్ద నోట్లను మార్చుకోవటానికి, తమ డబ్బు తాము పొందటానికి ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వచ్చింది. అదే సమయంలో యుపిఐ పేమెంట్‌ ‌యాప్‌ ‌ప్రచారం కోసం ప్రధాని ఫొటోతో ఫుల్‌ ‌పేజీ ప్రకటనలు వెలువడ్డాయి. డిజిటల్‌ లావాదేవీలకు సులభ మార్గమంటూ అంబానీ గారి జియోను పెద్ద ప్రచారంతో రంగంలోకి దించారు. ఉచిత డేటాను ఎరగా వేసి, కొద్ది రోజుల్లోనే కోట్ల మంది ఆ కంపెనీ వినియోగదారులుగా చేరేలా వ్యూహరచన చేశారు. తరువాత ఏమైంది? ఉన్న ఫళాన జియో ఛార్జీలను పెంచి తన లాభాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకొంది. ఆ విధంగానే యుపిఐ వాడకం గురించి, డిజిటల్‌ మనీ గురించి ఉపన్యాసాలు దంచిన మోడీ ... ప్రజలు దాని వినియోగానికి అలవాటు పడ్డాక ఇప్పుడు ఛార్జీల కొరడా బయటికి తీశారు. ఈ వంచనాశిల్పం బిజెపి ప్రభుత్వానికి కొత్తది కాదు.

​ఎండిఆర్‌ ప్రభుత్వ పన్ను కాదని, చెల్లింపు వ్యవస్థలోని బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, యాప్‌ల మధ్య పంచుకునే రుసుమని ప్రభుత్వం వివరిస్తోంది. దాదాపు 96 శాతం కొనుగోలు (పి2ఎం) లావాదేవీలు ఈ నిర్ణయంతో ప్రభావితం కావని కూడా చెబుతోంది. కానీ రూ.2,000కు మించిన లావాదేవీలు సంఖ్యాపరంగా సుమారు 4 శాతమే అయినా, పి2ఎం లావాదేవీల మొత్తం విలువలో దాదాపు 67 శాతం వాటా కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ లావాదేవీల ద్వారా వేల కోట్లకు పైగానే జనం జేబుకు పరోక్షంగా గండి పడబోతోంది. యుపిఐ ద్వారా గత నెలలో 2,450 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. వాటి మొత్తం విలువ సుమారు రూ.29.82 లక్షల కోట్లు. ఇంత భారీ వ్యవస్థలో 0.4 శాతం రుసుము పరిమిత లావాదేవీలకే వర్తించినా, సంవత్సరానికి సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయం జమ కావొచ్చని అంచనా. యుపిఐని ఉచితంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.8,730 కోట్ల ప్రోత్సాహక మద్దతు ఇచ్చింది. ఇప్పుడు జనం నుంచి అంతకుమించిన సొమ్ము ఏటా వసూలు చేయటానికి గేట్లు తెరుస్తోంది. మోడీ ప్రభుత్వం ఎన్ని సమర్థనలు వినిపిస్తున్నా దాని మోసకారితనం ప్రజలకు అర్థమవుతుంది. అనుభవానికి మించిన పాఠం ఇంకేమీ ఉండదు! పాఠం నేర్చిన ప్రజలు తగు సమయంలో తగిన గుణపాఠం చెప్పకుండా ఉండరు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్