ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను వాహన వినియోగదారులపై బలవంతంగా రుద్దడం ఆందోళనకరం. ప్రస్తుతానికి ఇ-20 పెట్రోల్‌ను అందిస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇథనాల్ శాతాన్ని మరింతగా పెంచుతూ ఇ - 85, ఇ - 100 కూడా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందన్న ప్రచారం వాహన వినియోగదారులకు కలవరపాటే. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో డాలర్ల వినియోగాన్ని తగ్గించడానికి, రైతులకు ప్రయోజనకరంగా ఉండటానికి ఈ విధానాన్ని తీసుకొచ్చామంటున్న కేంద్రం ప్రకటనలు.. వాస్తవంలో కోట్లాదిమంది సామాన్య వాహనదారుల ప్రయోజనాలకు, రవాణా రంగానికి ప్రాణ సంకటం. తాజా విధానం భవిష్యత్‌లో ఆహార సంక్షోభానికి దారితీసే ముప్పూ కాచుకుని వుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ వినియోగించడంపై దశాబ్దాలుగా చర్చ సాగినా, 2021లో నీతి ఆయోగ్ ఈ విధానాన్ని ఆమోదించింది. 2022లో నేషనల్ పాలసీ ఆఫ్ బయోఫ్యూయల్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇథనాల్‌ను క్రమంగా పెంచుతూ ప్రస్తుతానికి ఇ - 20 అమలులోకి తీసుకొచ్చారు. 2023 తరువాత తయారైన వాహనాలు వీటిని వినియోగించుకోగలవని, అంతకు ముందు తయారైన వాహనాల ఇంజన్లు, రబ్బరుతో తయారు చేసిన పరికరాలు దెబ్బ తింటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కొన్ని కంపెనీలు ద్విచక్ర వాహన కిట్లను రూ.12 వేలకు పైగా, కార్ల కిట్లను రూ.25 వేలకు పైగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి. పాత వాహనాలను నడుపుకుంటూ బతుకు బండి లాగుతున్న సామాన్యుడు ఈ పరిణామాలను తట్టుకోవడం కష్టం. ఇ -20 వల్ల 3 - 5 శాతం మైలేజి తగ్గుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖే అంగీకరించింది. పూర్తి స్థాయిలో ఇథనాల్ వినియోగిస్తే మైలేజిలో 65 శాతమే వస్తుంది. ఇదే విధానాన్ని అనుసరిస్తున్న బ్రెజిల్ వాహనాల్లో వినియోగించే ఇథనాల్ ధరను పెట్రోల్ ధర కంటే 30 శాతం తక్కువకు విక్రయించడంతోపాటు ఏ ఇంధనం కొనుక్కోవచ్చో ఎంపిక చేసుకునే స్వేచ్ఛను వినియోగదారులకిచ్చింది. ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనాలకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇథనాల్ తయారీకి ఎక్కువ ఖర్చు, తయారీదారులకు పోత్సాహకాలు ఇస్తున్నందున రాయితీలేవీ ఇవ్వలేమని మోడీ సర్కారు చేతులెత్తేయడం సరికాదు. ఇ-20తోపాటు ఇ-10 పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలన్న వినియోగదారుల విజ్ఞప్తిని పెడచెవినపెట్టడం అసమంజసం. ఎం.ఎస్. స్వామినాధన్ సిఫార్సులు అమలు చేయకుండా... ఇథనాల్‌తో రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నామన్నది వట్టిమాటే! వ్యవసాయ విధానంలో భాగంగా ఉండాల్సిన ఇథనాల్ తయారీని స్వతంత్రంగా చూపడం అసమంజసం. పెట్రోల్‌లో ఇథనాల్ శాతం పెంచడం వల్ల విదేశీ మారకద్రవ్యం మిగులుతుందని, పర్యావరణానికి అనుకూలమని కేంద్రం చేస్తున్న వాదనలు కూడా అర్థరహితమే. ఇథనాల్ తయారీలో 40 శాతం చెరకు, 50 శాతం మొక్కజొన్న, 10 శాతం ఎఫ్‌సిఐ గోడౌన్లలో నిల్వ చేసిన వాటిలో పాడైన ఆహార ధాన్యాలు, పంట వ్యర్థాలు వినియోగిస్తున్నారు. ఇవన్నీ అత్యధిక నీరు, ఎరువులు వినియోగించేవే. ఎరువులు, ఆహార ధాన్యాల దిగుమతులు పెరిగితే డాలర్ల మిగులేమీ ఉండదు. ఇథనాల్ శాతం పెరిగే కొద్దీ వీటి వినియోగం పెరుగుతుంది. ఒక లీటర్ ఇథనాల్ తయారీలో వినియోగించే చెరకుకు 3,630 లీటర్లు, మొక్కజొన్నకు 4,670 లీటర్లు, ధాన్యానికి 10,790 లీటర్లు నీరు అవసరం. ఎల్‌నినో వల్ల ఈ ఏడాది వర్షాభావం ఏర్పడుతుందన్న హెచ్చరికలు వచ్చాయి. ఇథనాల్ శాతం పెరగడం, అందుకోసం చెరకు, మొక్కజొన్న పంటల విస్తీర్ణం పెరగడం... నీటి అవసరాలను పెంచడంతోపాటు ఆహార సంక్షోభానికి కారణమయ్యే ప్రమాద ఘంటికలే. వ్యవసాయ వ్యర్థాలతో 2 జి ఇథనాల్ ఉత్పత్తి చేస్తామంటూ ప్రకటిస్తున్నా... అది ఖరీదైనది, సాంకేతికంగా మరింత క్లిష్టమైనది. సంక్షోభాలను ఎదుర్కొనే ముందు చూపులేకపోవడమే దేశానికి పెను ముప్పు. ఎన్‌డిఎ కు మద్దతిచ్చే ఓటర్లలో 50 శాతానికి పైగా ఇథనాల్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారన్న సి ఓటర్ తాజా సర్వే కేంద్రం విధానంపై ఆగ్రహాన్ని ఎత్తిచూపేదే. స్వచ్ఛమైన పెట్రోల్ కంటే తక్కువ మైలేజీ ఇచ్చే ఇంధనం కోసం వినియోగదారులు ఎక్కువ చెల్లించవలసి రావడానికి పశ్చిమాసియా సంక్షోభం, డాలర్ల సమస్య ఒక సాకు కాకూడదు.







కామెంట్‌లు (0)