తెలంగాణ మాజీ శాసన సభ్యులు గువ్వల బాలరాజు ఈ నెల 5వ తేదీన ఆంధ్రజ్యోతి పత్రికలో ‘బాధిత హిందూ దళితులకే రిజర్వేషన్లు దక్కాలి!’ అనే శీర్షికతో వ్యాసం రాశారు. రెండు సార్లు తెలంగాణలో టిఆర్ఎస్, బిఆర్ఎస్ పార్టీల నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. నేడు బిజెపిలో వున్నారు. దళిత ప్రజాప్రతినిధిగా వున్నవారు ఏ మతంలో వున్నా దళితులందరికీ న్యాయం జరగాలని కోరుకోవాలి. అలా కాకుండా దళితుల్ని మతం పేరుతో రిజర్వేషన్లు విడగొట్టి చూడటం సమంజసం కాదు. ఏ మతంలో వున్నా దళితుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.
భారత రాజ్యాంగంలో మౌలిక అంశాలకు సంబంధించి అనేక విషయాలు పొందుపర్చి వున్నాయి. అందులో భాగంగానే ఆర్టికల్ 340వ అధికరణం ప్రకారం ఎస్సీలను ఎలా గుర్తించాలనేది కూడా స్పష్టంగా పేర్కొనబడింది. ఒక రాష్ట్రంలోని చారిత్రకంగా అంటరానితనం, తీవ్రమైన సామాజిక వివక్ష, కుల అణిచివేతకు గురైన కులాలను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. దీనిని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. అందులో భాగంగానే 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం దళితులుగా వుండి వివక్షత అనుభవిస్తున్న వారందరికి ఎస్సీ హోదా కల్పించారు. 1956 సవరణ ఉత్తర్వుల ప్రకారం సిక్కుల్లో ఉన్న ఎస్సీలకు హోదా ఇచ్చారు. హిందూ సమాజంలోని కులవివక్షకు వ్యతిరేకంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పిలుపుతో బౌద్ధ మతాన్ని స్వీకరించిన దళితులను, వారి వారసులను నవ బౌద్ధులు (నియో బుద్ధిస్టులు) అని పిలుస్తారు. 1990 చట్ట సవరణ ద్వారా వీరికి కూడా ఎస్సీ హోదాను కల్పించారు. ముస్లింలు, క్రైస్తవుల్లోని ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజిందర్ సచార్, రంగనాథ్ మిశ్రా వంటి వివిధ కమిషన్లు సిఫార్సు చేసిన సందర్భాలున్నాయి. ఇవన్నీ భారత రాజ్యాంగం ప్రకారం నిర్దేశించబడినవే.
మతం మారినా వివక్ష మారడంలేదు. దళితులు క్రైస్తవంలోకి మారడానికి అనేక కారణాలున్నాయి. హిందూ మత సాంప్రదాయాలకు సంబంధించి దళితులను గుడిలోకి రానివ్వకపోవడం, కులం పేరుతో దూషించడం, కులాంతర వివాహాలు జరిగితే గ్రామ బహిష్కరణలు, కుల దురహంకార హత్యలు, దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది దళితులు ఆత్మాభిమానాన్ని చంపుకోలేక క్రైస్తవంలోకి చేరుతున్నారు. క్రైస్తవ మతంలో కూడా కుల వివక్ష లేదని చెప్పలేం. వారి మీద కూడా దాడులు నిరంతరం జరుగుతూనే వున్నాయి. కుల ఆధారంగానే చర్చిల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనిని గమనించకుండా బాలరాజు గారు హిందూ మతంలో వుండే దళితులకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని సంకుచిత దృష్టితో వ్యవహరించారు. హిందూ మతంలో దళితుల వివక్షను ఆయన గుర్తించడంలేదు. ఒకవైపున ప్రభుత్వ రంగం రోజు రోజుకీ నిర్వీర్యం అవుతున్న నేటి సమాజంలో రిజర్వేషన్లు పెద్ద ప్రశ్నార్ధకంగా మారిపోయాయి. ప్రైవేట్ రంగానికి భూములు, బ్యాంకుల నుండి రుణాలు, రాయితీలు, నీరు, విద్యుత్ వంటి సదుపాయాలు ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలకు భూముల సమీకరణలో దళితులు సాగు చేసుకుంటున్న భూములే అత్యధికంగా వుంటున్నాయి. దీనికి నష్టపరిహారం కూడా సక్రమమైన పద్ధతుల్లో ఇవ్వడం లేదు. బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీలకు దళితుల భూములు ధారాదత్తం చేస్తున్నది. ప్రైవేట్ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయటానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. దీని గురించి కనీసం బాలరాజు గారు ప్రస్తావించకపోవడం విస్మయం కలిగిస్తుంది. కేంద్ర బిజెపి ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (సులభతర వ్యాపారం) పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసి, బ్యాంకింగ్, రైల్వే, రక్షణ రంగం, గనులు, ఉక్కు పరిశ్రమలు వంటివి ప్రైవేటీకరణకు పూనుకుంటున్నది. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో కాంట్రాక్టు పద్ధతి వల్ల రిజర్వేషన్లకు ముప్పు వచ్చింది. కార్పొరేట్లకు సర్వస్వం ధారపోస్తున్నారు. వీటిని పరిశీలించకుండా బాలరాజుగారు సమర్ధిస్తున్నారా? ముస్లింలు, క్రైస్తవులు వుండడం వల్లనే నిజమైన దళితులకు రిజర్వేషన్లు దక్కడంలేదని వాపోయారు. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఆయన వాదనలు వున్నాయి. అగ్రవర్ణాల కుల అహంకారానికి గురైన హిందూ దళితులు నేడు మతం మారినా మతమౌఢ్యం వల్ల కష్టాల పాలవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అంటే నేడు అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతున్నదని అంగీకరిస్తూనే వింత వాదనలు పెట్టడం అణగారిన వర్గాలకు ద్రోహం చేయడమే. మతమౌఢ్యం అన్ని మతాల్లోనూ వుంది. అన్ని మతాల్లోనూ కొనసాగుతున్నది.
ఒక దళితుడు కేవలం ఒక మతం నుండి మరో మతంలోకి మారినంత మాత్రాన అతని ఆర్థిక స్థితి లేదా సమాజం అతని పట్ల చూసే వివక్ష ఒక్కరోజులో మారిపోదు. “క్రైస్తవంలో కులం లేదు కాబట్టి, క్రైస్తవుడిగా మారిన దళితుడికి కుల వివక్ష ఉండదు" అని భావించడం ఒక భ్రమ. క్షేత్ర స్థాయిలో దళిత క్రిస్టియన్లు ఇప్పటికీ అన్ని రకాల వివక్షలకు గురవుతున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడలేదు. ఇప్పటికీ భూమి లేని కూలీలుగా, శ్రామికులుగా తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు.
వెనుకబడిన కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ఉపయోగపడాలని రాజ్యాంగం పేర్కొంది. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పొరేషన్లతో పాటు మైనార్టీ, క్రైస్తవ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ఎంతోకొంత తోడ్పడుతున్నాయి. ఇటీవలి కాలంలో వీరితో పాటు అగ్రవర్ణాలైన బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, కాపు, ఇతర కులాలకు కూడా పాలక వర్గాలు ప్రభుత్వ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాయి. నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగ పరిధిలోనే జరిగిందని భావిస్తున్నారు. దీనిని బాలరాజు గారు కాదని చెప్పగలరా? కుల పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించాలని ఎవరైనా పూనుకుంటే అది విఫలంకాక తప్పదని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అన్నారు. హిందూ మతంలో వున్న కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. హిందూ మతంలో మాత్రమే కుల వ్యత్యాసాలు వున్నాయని భావించి ఆయన బౌద్ధ మతంలో చేరారు. ఇప్పుడు ఆ బౌద్ధ మతంలో చేరిన దళితులు కూడా వివక్షకు గురవుతున్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు నిండినా నేటికీ కుల వివక్ష కొనసాగుతూనే వుంది. మనుషులను గౌరవించే పరిస్థితి లేదు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగ మౌలిక సూత్రాలను పూర్తిగా మార్చివేసింది. దళితులపై దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. జాతీయ జెండాను, రాజ్యాంగాన్ని గౌరవించని బిజెపి, ఆర్ఎస్ఎస్ గురించి ఒక్క సారైనా బాలరాజు గారు ప్రస్తావించలేదు. మతాలు, కులాల మధ్య ఘర్షణ సృష్టించే విధంగా వుంది తప్ప దళితుల మౌలికమైన అంశాలు ఏవీ ప్రస్తావన లేదు. రిజర్వేషన్లతోనే మొత్తం సమస్యలన్నీ పరిష్కారం కావని, మన అనుభవం రుజువు చేస్తున్నది. ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. దళితులకు ఆత్మగౌరవం పెరగాలంటే ప్రతి కుటుంబానికి భూమి ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి వారి అభివృద్ధికి ఖర్చు చేయాలి. మతం ఏదైనా వివక్ష కొనసాగితే దానిని వ్యతిరేకించాలి. నేటికీ దళితులకు గౌరవప్రదంగా జీవించే హక్కు లేక ఇబ్బందులు పడుతున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మత, ప్రాంత, లింగ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా వివక్షకు గురౌతూనే వున్నారు. కులతత్వం అన్ని స్థాయిల్లో వెంటాడుతూనే వుంది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక విలువలను తుంగలోకి తొక్కి మత, కుల ప్రాతిపదికన వివక్ష కొనసాగిస్తున్నారు. చివరికి రాజ్యాంగ పదవుల్లో ఉన్న దళిత ప్రజాప్రతినిధులు ఏ మతంలో ఉన్నా గౌరవం అంతంత మాత్రంగానే అందుతున్నది.
నేడు దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా, ప్రభుత్వ రంగం కుంచించుకు పోతున్న, దళితులందరికీ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్న వేళ, దళితుల అభ్యున్నతికి అందరూ కలసి ఐక్యంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాల్సిన సందర్భంలో దళితుల మధ్య మతాల ప్రాతిపదికన తంపులు పెట్టడానికే పాలకుల నుండి ఇలాంటి వాదనలు ముందుకు వస్తున్నాయి. అందుకు ఉపయోగపడేదే ఈయన వ్యాసం.
దళితులందరూ (హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా) తమ హక్కుల కోసం, ఉపాధి కోసం ప్రభుత్వాలపై పోరాడకుండా చేయడం కోసమే ఈ మతపరమైన విభజనలను పాలక వర్గాలు వాడుకుంటాయి. పాలకుల ‘విభజించు, పాలించు’ అనే దుర్నీతి ఉచ్చులో పడకుండా ప్రజలందరూ, ముఖ్యంగా దళితులు ఈ కపటత్వాన్ని అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది.

వ్యాసకర్త : ఎ.పి వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె. లోకనాధం
సెల్: 9490098791







కామెంట్‌లు (0)