శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవైద్య దోపిడీ..

1 గంట క్రితం

medical bills.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 05:55 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

వైద్యం వ్యాపారం దశను దాటి దోపిడీగా మారడం అత్యంత ఆందోళనకరం. రిటైలర్లకు చేరే ప్రాణాధార మందుల ధరకు, ప్యాక్‌పై ముద్రించిన ధరకు మధ్య వెయ్యిశాతం వరకూ వ్యత్యాసం ఉండటం ‘మారణహోమం (కార్నేజ్‌)’, ‘రోగులను పగటిపూట బరితెగించి దోచుకోవడం (డే లైట్‌ డెకాయిటీ)‘’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు అక్ష‍రసత్యం. ఈ దోపిడీపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పూర్తిగా మౌనంగా ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉందని, దానికి కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కేంద్రంలోని పాలకుల నిర్వాకాన్ని ఎత్తిచూపడమే. దేశంలో సామాన్యుడు ఎదుర్కొంటున్న వైద్య రంగంలో దోపిడీకి, ఆసుపత్రి, మందుల ఖర్చుల కోసం కుదేలవుతూ ప్రాణాలు కోల్పోతున్న పేదల దుస్థితికి ఈ వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయి. కేన్సర్‌ సహా వివిధ ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులతో సహా, రిటైలర్‌కు అందించే ధర (పిటిఆర్‌)కు రోగులకు విక్రయించే గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పి)కి మధ్య భారీగా వ్యత్యాసం ఉన్న బ్రాండ్ల మెడిసిన్స్‌ అమ్మకానికే కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆసుపత్రులు మొగ్గుచూపుతుండటం గర్హనీయం. అంతేకాదు తమ ప్రాంగణంలోని ఫార్మసీల నుంచే మందులు కొనాలని ఒత్తిడి చేస్తున్నాయని, జనరిక్‌ లేదా తక్కువ ధరకు లభించే చోట మందులను కొనుగోలు చేసే హక్కును రోగి కోల్పోతున్నాడని కాంపిటేషన్‌ కమిషన్‌ దర్యాప్తులో తేలింది. కర్ణాటక, మహారాష్ట్రలోని ఔషధ నియంత్రణ సంస్థలు కూడా ఈ అంశాన్నే ఎత్తిచూపాయి. 1991 నుంచి దేశంలో నయా ఉదారవాద విధానాలు అమలు కావడం, వైద్య రంగంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం 2005 తరువాత భారీగా పెరగడంతో వైద్యం అతి పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడం అన్న స్పృహను గాలికొదిలేసి ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేశాయి. కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష‍ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేశాయి. మిగిలిన ప్రభుత్వాలన్నీ ప్రభుత్వ వైద్యరంగం బలోపేతానికి కేటాయించాల్సిన నిధులను దేశీయ, విదేశీ కంపెనీలకు లబ్ధిచేకూర్చేందుకు ఆకర్షణీయ ప్రణాళికలను రూపొందించాయి. మన రాష్ట్రంలో గతంలో అమలైన ‘ఆరోగ్యశ్రీ’ ఇప్పుడు అమలవుతున్న ‘ఎన్‌టిఆర్‌ వైద్యసేవ’ ఆ కోవలోవే. 1955 నాటి నిత్యావసర వస్తువుల చట్టం మందులతోసహా నిత్యావసర వస్తువులన్నింటిపై కేంద్రానికి అధికారాన్ని కల్పిస్తుంది. సెక్ష‍న్‌ 3(1)‘ఏదైనా నిత్యావసర వస్తువుల సరఫరాను నిర్వహించడానికి లేదా పెంచడానికి లేదా వాటి సమాన పంపిణీకి, సరసమైన ధరకు లభ్యమయ్యేలా భద్రపరచడానికి, ఉత్పత్తి, సరఫరా, పంపిణీని నియంత్రించడానికి అనుమతిస్తుంది. సెక్ష‍న్‌ 3(2) (సి) వస్తువుల ధరలను నియంత్రించే ఉత్తర్వులను జారీ చేయడానికి అనుమతిస్తుంది. విదేశీ, స్వదేశీ మెడికల్‌ కార్పొరేట్ల, ఫార్మసీ కంపెనీల కొమ్ముకాస్తూ.. ఈ అధికారాలన్నీ అటకెక్కించిన కేంద్రంలోని పాలకుల నిర్వాక ఫలితమే ప్రస్తుత ఈ దుస్థితి.

ప్రభుత్వ ధరల నియంత్రణ పరిధిలో ఉన్నవి 384 మందులే. ఇవి మొత్తం ఔషధ మార్కెట్‌ టర్నోవర్‌లో 20 శాతమే. ఒకే సామర్ధ్యం, మోతాదు కలిగిన ఒక షెడ్యూల్డ్‌ ఔషధం రిటైల్‌ మార్కెట్‌లో రూ.8, రూ.10, రూ.12గా ఉందనుకుంటే... దాని సగటు రూ.10 ప్రాతిపదికగా తీసుకుని, 16 శాతం రిటైల్‌ మార్జిన్‌ను చేర్చి, గరిష్ట ధర రూ.11.60గా ఎన్‌ఎపిఎ నిర్ణయిస్తుంది. ప్రభుత్వ నియంత్రణలో లేని మందుల విషయంలో ఇష్టారాజ్యంగా దోపిడీ ఉంటోంది. 2019లో 42 నాన్‌ షెడ్యూల్డ్‌ కేన్సర్‌ మందులపై 30 శాతం రిటైల్‌ మార్జిన్‌ను ఎన్‌ఎపిఎ విధించింది. ఆ తరువాత 526 బ్రాండ్ల ధరలు 91 శాతం వరకూ తగ్గాయని ఫార్మాసూటికల్‌ విభాగం తెలిపింది. అన్ని మందులపై ఒక స్థిరమైన రిటైల్‌ మార్జిన్‌ కలిగి ఉండాలన్న సర్వోన్నత న్యాయస్థానం సూచన ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ మందుల ధరలు పెరిగే కొద్దీ తక్కువ శాతాన్ని వర్తింపజేసే రిగ్రెసివ్‌ మార్జిన్‌తో దీనిని జత చేయాలి.

కేన్సర్‌ సహా ప్రాణాంతక వ్యాధులతో ఆసుపత్రులకు వెళ్లాల్సిన సమయంలో ‘నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంత ఖర్చవుతుంది’ అని రోగి భయపడుతుంటే...ఇల్లు, బంగారం అమ్ముకోవాలా, అప్పులు చేయాలా, జీవితకాల పొదుపును ఖర్చు చేయాలా అని ఆందోళన చెందుతుంటే అది కుటుంబ సమస్య కాదు. లోపభూయిష్టమైన పాలకుల నిర్వాకం దుష్పరిణామం. అన్ని మందుల ధరలకూ కళ్లెం వేయడంతోపాటు జనరిక్‌, బయోసిమిలర్‌ మందులను కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రులూ వినియోగించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకులదే. ప్రజల ప్రాణాలదే ప్రథమ ప్రాధాన్యత అన్న అంశాన్ని మరిచి విదేశీ, స్వదేశీ మెడికల్‌ కార్పొరేట్ల వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాల్సిన బాధ్యత అందరిదీ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్