నేడు గాంధీ జయంతి
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ గొప్ప ప్రజా నాయకుడు. ఆచరణాత్మక పిలుపుల ద్వారా జాతీయోద్యమంలోకి అసంఖ్యాక ప్రజానీకాన్ని ఆయన కదిలించగలిగారు. ప్రజాస్వామిక వాదిగా, గొప్ప లౌకికవాదిగా జీవితాన్ని కొనసాగించి 'మహాత్మా'గా ప్రజలచేత కీర్తినందుకున్నారు. ఆయన తొలి రోజుల్లో 'హిందూ స్వరాజ్' గ్రంథంలో చెప్పిన విషయాలకు, స్వాతంత్రోద్యమ ఉధృతి రోజుల్లో 'హరిజన్' పత్రికలో రాసిన వ్యాసాలకు చాలా వైరుధ్యాలు కనబడతాయి. వీటిని వ్యక్తిలో చూడడం కంటే ... జాతీయోద్యమంలో ప్రజల ఆకాంక్షలకు, దానికి నాయకత్వం వహిస్తున్న భూస్వామ్య వ్యవస్థతో ముడిపడిన బూర్జువా ప్రయోజనాలకు మధ్యన ఏర్పడిన కీలక వైరుధ్యాల నుండే చూడాలి. అయితే నేటి దేశ పాలకులు గాంధీలోని తొలినాటి భావాలను తమ సంకుచిత ప్రయోజనాల కోసం అసందర్భంగా ఊటంకిస్తూ ఆయన కృషిని, ఆలోచనలను గందరగోళానికి గురిచేస్తున్నారు. గాంధీజీ ప్రతిపాదించిన సామ్రాజ్యవాద వ్యతిరేకత, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సామాజిక న్యాయంతో పాటు, భారత రాజ్యాంగం, తాజాగా ఎన్నికల వ్యవస్థ కేంద్ర పాలకుల వల్ల తీవ్ర దాడికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ అనుసరించిన ప్రజాస్వామిక, లౌకికవాద దృక్పధాన్ని ఆయన జయంతి రోజున స్మరించుకోవడం సందర్భోచితం.
గాంధీతో పనిచేసిన దాదాపు ప్రతి ప్రముఖ నాయకుడితో ఏదో ఒక దశలో ఆయనకు తీవ్రమైన విభేదాలు వచ్చాయి. ఆధునికత, జాతీయవాదం వంటి అంశాల్లో రవీంద్రనాథ్ టాగూర్‌తో; పారిశ్రామికీకరణ, సామ్యవాదం, ఆధునిక విజ్ఞానంపై జవహర్‌లాల్ నెహ్రూతో; స్వాతంత్య్ర సాధన పద్ధతులు, కాంగ్రెస్ నాయకత్వంపై సుభాష్ చంద్రబోస్‌తో; కుల వ్యవస్థ, దళితుల రాజకీయ హక్కులపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌తో గాంధీకి తీవ్రమైన విభేదాలు నడిచాయి. అయినప్పటికీ అవి వ్యక్తిగత శత్రుత్వాలుగా మారకుండా, దేశ భవిష్యత్తు కోసం సాగే చర్చలుగా గాంధీ వాటిని కొనసాగించారు. తమను అంగీకరించని వారందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న నేటి పాలకులకు ఇది గిట్టదు. అలాగే గాంధీలోని లౌకిక భావన కూడా చాలా లోతైనది. ''మతం జాతీయతకు పరీక్ష కాదు, ఒక వ్యక్తి ఏ మతాన్ని అనుసరించినా, అతడు ముందు భారతీయుడే, చివరికి కూడా భారతీయుడిగానే మిగులుతాడు'' అని బోధించారు. ''ప్రపంచంలో ఏ భూభాగంలోనూ ఒకే జాతి, ఒకే దేశం అన్న అర్థం ఎక్కడా ఉనికిలో లేదు'' అని హింద్ స్వరాజ్ గ్రంథంలో పేర్కొన్నాడు. గాంధీ ఆశయాలు, ఆలోచనలకు వ్యతిరేకంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ లు వ్యవహరిస్తూ కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను, వనరులను దోచిపెడుతున్నాయి.
టాగూర్‌తో విభేదం
రవీంద్రనాథ్ టాగూర్, గాంధీల గురించి జవహర్‌లాల్ నెహ్రూ తన 'డిస్కవరీ ఆఫ్ ఇండియా'లో 'వారిద్దరూ నిస్సందేహంగా 20వ శతాబ్దంలో ఇండియాలో జీవించిన గొప్ప వ్యక్తులు, వారు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలు మనకు ఆదేశప్రాయమైనవి'' అని పేర్కొన్నాడు. వారిద్దరూ గొప్ప దేశభక్తులు. అయితే వారి ఆలోచనా ప్రపంచాలు భిన్నమైనవి. టాగూర్‌కు మానవతావాదం, విశ్వమానవ దృక్పథం అత్యంత ముఖ్యమైనవి. సహాయ నిరాకరణకు, ప్రజల రాజకీయ చైతన్యానికి, స్వదేశీకి గాంధీ ప్రాధాన్యం ఇచ్చారు. 1920-21 ప్రాంతంలో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ వంటి కార్యక్రమాలపై టాగూర్ తన వ్యతిరేకతను ప్రకటించాడు. అనేక సందేహాలు వ్యక్తం చేశాడు. విద్యాసంస్థలను బహిష్కరించడం, జాతీయతను అతిగా ముందుకు తేవడం వంటి చర్యలు యువతను సంకుచిత జాతీయవాదం వైపు నడిపించవచ్చని ఆయన భావించారు. గాంధీ మాత్రం టాగూర్ విమర్శలను శత్రుత్వంగా చూడలేదు. ఆయనతో వ్యక్తిగతంగా అంతకంటే ఎక్కువగా ఉత్తరాల రూపంలో సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో టాగూర్ ఆలోచనల్లోని ఆధునికతను గాంధీ స్వీకరించాడు. తనను అంతగా విమర్శించిన టాగూర్‌ను ''గురుదేవ్''గా గాంధీ గౌరవించారు. టాగూర్ కూడా ''మహాత్మా''గా గాంధీని సంబోధించారు. ఇద్దరూ ఒకరినొకరు గౌరవిస్తూనే తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసుకున్నారు.
నెహ్రూతో విభేదాలు
జవహర్‌లాల్ నెహ్రూ, గాంధీకి అత్యంత సన్నిహిత సహచరుల్లో ఒకరు. వారిద్దరూ జాతీయోద్యమంలో కీలక వ్యక్తులు. కానీ ఇద్దరి మధ్య ఆలోచనల్లో చాలా భేదాలున్నాయి. నెహ్రూ ఆధునిక విజ్ఞానం, సాంకేతికత, భారీ పరిశ్రమలు, శాస్త్రీయ దృక్పథం, సామ్యవాద ప్రభావిత ఆర్థిక విధానాల వైపు మొగ్గు చూపారు. గాంధీ మాత్రం గ్రామ స్వరాజ్యం, చిన్నతరహా ఉత్పత్తి, ఖాదీ, నైతిక ఆర్థిక వ్యవస్థలకు ప్రాధాన్యం ఇచ్చారు. సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని నెహ్రూ, బ్రిటీష్ ప్రభుత్వానికి గడువు ఇచ్చి ప్రస్తుతం డొమినియన్ స్టేటస్ (అధినివేశ ప్రతిపత్తి)ను సాధించుకుందామని గాంధీ అభిప్రాయపడ్డారు. దీనిపై వారిద్దరి మధ్య 1928లో కలకత్తా కాంగ్రెస్‌లో తీవ్రమైన విబేధాలు వచ్చాయి. స్వాతంత్య్రానంతరం ఎలాంటి దేశంగా నిర్మించాలి అన్న విషయంలో కూడా వారి దృక్పథాలు భిన్నంగా ఉన్నాయి. ఈ చర్చల క్రమం నుండే పారిశ్రామిక రంగం ప్రభుత్వ రంగంలోనే ఉండాలనే నిర్ధారణకు గాంధీ వచ్చారు. నెహ్రూ ఆలోచనలను అణచివేయాలని, ఆయన నుండి దూరం జరగాలని గాంధీ ప్రయత్నించలేదు. నెహ్రూ కూడా గాంధీతో చర్చిస్తూనే జాతీయోద్యమానికి కేంద్రబిందువుగా గౌరవించారు. ఆనాటి కమ్యూనిస్టు నాయకుడు యం.యన్. రాయ్ విశ్వసించిన బోల్షివిజాన్ని వ్యతిరేకించిన గాంధీ తన 'యంగ్ ఇండియా' పత్రికలో మాత్రం ఆయనతో వ్యాసాలు రాయించుకున్నారు. విభేదం అనేది విరోధం కాదు; భిన్నమైన అభిప్రాయాలతో కూడా ఒకే లక్ష్యం కోసం కలిసి పని చేయవచ్చు అని ఈ ఘటనలు చాటిచెబుతున్నాయి.
సుభాష్ చంద్రబోస్‌తో ఘర్షణ
బ్రిటిష్ పాలనను ఎదుర్కొనే విషయంలో అంతర్జాతీయ పరిణామాలను కూడా ఉపయోగించుకోవాలని సుభాష్ భావించారు.1938లో హరిపుర కాంగ్రెస్‌లో సుభాష్ అధ్యక్షుడయ్యారు. 1939లో తిరిగి అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు గాంధీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి పట్టాభి సీతారామయ్య ఓడిపోయారు. సుభాష్ విజయం సాధించినప్పటికీ, కాంగ్రెస్‌లోని విభేదాలు తీవ్రం కావడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే సుభాష్ వ్యక్తిగతంగా గాంధీని ఏనాడూ అగౌరవపరచలేదు. అలాగే గాంధీ కూడా సుభాష్ దేశభక్తిని, త్యాగాన్ని కొనియాడాడు.
అంబేద్కర్‌తో విభేదం
గాంధీ-అంబేద్కర్ మధ్య కుల వ్యవస్థపై తీవ్రమైన విభేదాలు వచ్చాయి. అంబేద్కర్ కుల వ్యవస్థ నిర్మూలనను సామాజిక ప్రజాస్వామ్యానికి ప్రాథమిక అవసరం అన్నారు. అణగారిన వర్గాలకు స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యం, ప్రత్యేక ఎన్నికల హక్కులు వంటి అంశాలను ఆయన బలంగా సమర్థించారు. 1932లో కమ్యూనల్ అవార్డు ద్వారా ''డిప్రెస్డ్ క్లాసెస్''కు ప్రత్యేక ఎన్నికల ప్రతిపాదన వచ్చినప్పుడు గాంధీ దానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. అంబేద్కర్ దీనిని రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు వీరిద్దరి మధ్య పూనా ఒప్పందం కుదిరినా, గాంధీ తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఆ తర్వాత కూడా గాంధీ, అంబేద్కర్ అనేక అంశాల్లో కలిసి పనిచేశారు. ఒకరినొకరు గౌరవించుకున్నారు.
గాంధీ-మతం
గాంధీ 'మతం' అనే పదాన్ని రెండు అర్థాలలో వాడినట్లు ఆయన జీవిత ఆచరణ తెలుపుతుంది. ఒకటి, పైకి కనిపించే హిందూ మతం, ముస్లిం మతం, క్రిష్టియన్ మతం ఇలా అనేక మతాల ఆచారాలు. రెండు, మతం అంటే దైవంలో, సత్యంలో, ధర్మంలో విశ్వాసం కలిగివుండటం. ఈ కోణంలో చూసినప్పుడు ప్రపంచంలోని ఏ మతమూ విడిగా ఉండదు. అన్ని మతాలూ మానవత్వాన్ని, సన్మార్గాన్ని మాత్రమే బోధిస్తాయి. ఈ నైతిక విలువలు అన్ని మతాలలోనూ ఒకే విధంగా వున్నాయని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా పర్యటించే క్రమంలో, భారత ప్రజల మధ్య వున్న మతాతీత సంబంధాన్ని గమనించడం పెరిగే కొద్దీ మతం పట్ల తన అభిప్రాయాలను మరింత లౌకికంగా మలచుకున్నాడు. మొదట్లో ఆయన చెప్పిన 'దైవమే సత్యం' అనే అభిప్రాయాన్ని 'సత్యమే దైవం' అని మార్చుకున్నారు. ''నిజమైన మతం, నిజమైన నైతికత ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా ముడిపడి వున్నాయి. నేలలో నాటిన విత్తనానికి నీరు ఎంత అవసరమో మతానికి నైతికత అంత అవసరం'' అన్నారు. ''అసత్యం, క్రూరత్వం, విద్వేషం, ఆపుకోలేని ఉద్రేకం వున్నవాడు నైతికత కోల్పోయిన వాడవుతాడు, వాడికి మతం గురించి ఉచ్ఛరించే హక్కు లేదు'' అని రవీంద్రనాథ్ టాగూర్ కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ''మత కారణంగా మనుషులను వేరు చేయడం పూర్తిగా తప్పు...తేడా అంతా మతాన్ని అవలంబించడంలో, ఆచారాలలో ఉంటుంది. వాటితో లౌకిక రాజ్యానికి సంబంధమే లేదు'' అనే ఆయన ఆలోచనే నేడు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. ''నేనే గనుక నియంతనైతే మతం మరియు రాజ్యం వేరుగా ఉంచుతాను. నేను నా మతంపై ప్రమాణం చేస్తున్నాను, నేను దాని కోసం చనిపోతాను. అయితే అది నా వ్యక్తిగత వ్యవహారం. రాజ్యానికి (ప్రభుత్వానికి) దానికి సంబంధంలేదు'', ''నాకే కనుక అధికారం ఉంటే, మతతత్వాన్ని ప్రోత్సహించే ఎత్తుగడతో రాసిన రచనలన్నిటినీ నిషేధిస్తా'' అని హ్చెరించారు. 'మతతత్వం దేశ వ్యతిరేకమే కాదు, అది హిందూ మతతత్వమైతే హిందూ మత వ్యతిరేకం, ముస్లిం మతతత్వమైతే ముస్లిం మత వ్యతిరేకం అని' ఆయన నిరంతరం ఘోషించాడు.
వి. రాంభూపాల్







కామెంట్‌లు (0)