దేశంలోని పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు సేవలందించడానికి అక్టోబర్ 2న ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసు (ఐసిడిఎస్ పథకం) నేటికి 51 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమై నేడు ప్రపంచంలోనే అతి పెద్ద కమ్యూనిటీ ఆధారిత బాలల అభివృద్ధి కార్యక్రమంగా అవతరించింది. దేశవ్యాప్తంగా 8.48 కోట్ల పిల్లలకు, 1.95 కోట్ల గర్భిణీ, బాలింతలకు (మన రాష్ట్రంలో సుమారు 32 లక్షల మందికి) సేవలందిస్తున్న 27 లక్షల అంగన్‌వాడీలను కనీసం కార్మికులుగా గుర్తించడంలేదు.
కేంద్రం నిధుల కోత - ప్రైవేటీకరణ వాత
మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ కి 100 శాతం నిధులు కేటాయించింది. 2006 తర్వాత కేంద్రం రాష్ట్రాల వాటాలు 90:10 కేటాయించారు. 2014లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఐసిడిఎస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను 60:40గా మార్పు చేశారు. దీనివలన రాష్ట్రాలపై అదనపు భారం పడింది. 2026-27కి కేవలం రూ. 23,100 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశలో వేగంగా పావులు కదుపుతున్నది.
లబ్ధిదారులకు ఆహారం కొరత
మాతాశిశు మరణాలు తగ్గించడంలో, అనుబంధ పోషకాహారం అందించడంలో, ప్రీ స్కూల్ విద్య అందించడంలో ఐసిడిఎస్ కి ప్రత్యేక ప్రాధాన్యత వుంది. అయితే అనుబంధ పోషకాహారానికిగాను 2017 నుండి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు పెరగలేదు. నిధులు తగ్గించి...లబ్ధిదారులను సెంటర్లకు దూరం చేయడానికి ఆధార్ లింకు పెట్టారు. పైగా ఇకెవైసి, ఫొటోక్యాప్చర్ చేస్తేనే వారికి రేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే కొనసాగితే చాలామంది ఈ పథకానికి దూరమై రక్తహీనతకు గురౌవుతారు.
మౌలిక వసతులు కరువు
రాష్ట్రంలో నేటికీ 23,424 అంగన్‌వాడీ సెంటర్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. బిల్డింగులు ఉన్న చోట్ల కూడా మంచినీరు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు తదితర మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ సెంటర్లను విలీనం చేయాలని నిర్ణయించారు. రాబోయే కాలంలో అంగన్‌వాడీ సెంటర్లను కుదించే ప్రమాదం ఉంది.
అంగన్వాడీల వేతనాలపై కోర్టు తీర్పులు బేఖాతరు
నేటికీ అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించడంలేదు. ఎటువంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు కావటం లేదు. పోరాటాల ఫలితంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీలకు గ్రాట్యూటీ అమలు చేయాలని 2022 ఏప్రిల్‌లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఐసిడిఎస్ అనేది శాశ్వత పథకం. అందులో పని చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంతవరకు వర్కర్లకు రూ.24,800, హెల్పర్లకు రూ.20,300 వేతనాలు ఇవ్వాలని 2024లో గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ రెండు తీర్పులను దేశవ్యాప్తంగా అంగన్వాడీలకు అమలు చేయకుండా బధిరాంధ మోడీ ప్రభుత్వం మోసం చేస్తోంది.
పెరుగుతున్న పని భారం-సౌకర్యాలు ఘోరం
అంగన్వాడీ వర్కర్లే పెట్టుబడి పెట్టి రేషన్ షాపుల నుండి సరుకులు తెచ్చుకుంటున్నారు. ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు ఇస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలు చేయలేదు. ఒక్కో సెంటర్ కు సరుకులు తెచ్చుకోవడానికి రూ.200 నుండి రూ. 500 వరకు ఖర్చు అవుతుంది. ఏజెన్సీ ప్రాంతాలకు ఇంకా ఎక్కువే అవుతుంది. ప్రతి నెలా అంగన్వాడీలు రిపోర్టులు ఇవ్వడానికి సెక్టార్ మీటింగ్ కి వెళ్లాలి. 2017 నుండి డీఏ బిల్లులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. నవచేతన, 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు, హెల్త్ సంబంధించిన వివరాలను యాప్ లో అప్‌లోడ్ చెయ్యాలంటూ రాష్ట్రమంతటా శిక్షణ ఇచ్చారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ చేయాల్సిన ఈ పనిని కూడా అంగన్వాడీలతో చేయిస్తున్నారు. అంగన్‌వాడీల పిల్లలకు తల్లికి వందనం అమలు చేస్తున్నప్పటికీ...రూరల్‌లో వున్న అంగన్‌వాడీలకు, వారి కుటుంబ సభ్యులకు వితంతు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగ తదితర సంక్షేమ పథకాలేమీ అమలు కావడంలేదు. అంగన్‌వాడీ పిల్లలకు రేషన్‌కార్డులు ఇవ్వడం లేదు.
వాగ్దానాల విస్మరణ
కనీస వేతనాలు, సామాజిక భద్రత కోసం అంగన్వాడీలు మన రాష్ట్రంలో 42 రోజులపాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించగా 100 శాతం పాల్గొన్నారు. ఆ సందర్భంగా సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చిన నేటి పాలకులు...‘మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాం, సమస్యలను పరిష్కరిస్తాం’ అని హామీ ఇచ్చారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. నేటికీ అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచలేదు. హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం వలన అనేక మంది ప్రమోషన్లు కోల్పోతున్నారు. దీనికి తోడు కొత్తగా ప్రమోషన్లకు 5 సంవత్సరాలకు సీనియారిటీ పెట్టారు. ఇంకా 1800 మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ కాలేదు. ఇప్పటికే ఉన్న యాప్‌ల వల్ల ప్రీస్కూల్ దెబ్బతింటున్నది. అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అక్టోబర్ 2న గాంధీ విగ్రహాలకు, అక్టోబర్ 6న రాష్ట్రంలోని ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వనున్నాం.
ఇవీ డిమాండ్లు...
అంగన్వాడీలకు కనీస వేతనాలు రూ. 26,000 ఇవ్వాలి.
పి.ఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలి.
రూరల్‌లో ఉన్న అంగన్వాడీలకు, వారి కుటుంబ సభ్యులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
హెల్పర్ల ప్రమోషన్ గైడ్ లైన్సు ఇచ్చిన జీవో 5ను సవరించాలి.
పెండింగ్‌లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్పు చేయాలి. మెర్జింగ్ చేసిన మినీ వర్కర్లకు వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి
సర్వీసులో ఉండి చనిపోయిన, మధ్యలో మానుకున్న వారికి 1972 పేమెంట్ ఆఫ్ గ్రాట్యూటీ చట్ట ప్రకారం గ్రాట్యూటీ అమలుచేయాలి.
పెండింగ్ టి.ఎ బిల్లులు ఇవ్వాలి.
లబ్ధిదారులకు ఇచ్చే మెనూతో పాటుగా వాటి చార్జీలూ పెంచాలి.

వ్యాసకర్త : కె. సుబ్బరావమ్మ
ఎ.పి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి







కామెంట్‌లు (0)