ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘సంక్ష‍ేమం’ దానం కాదు

3 గంటల క్రితం

welfare
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 04:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

‘సంక్షేమం అంటే పేదలకు ఇచ్చే దానం కాదు, సామాజిక న్యాయంలో అది వారి రాజ్యాంగబద్ధమైన వాటా’ అంటారు ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్. సంక్షేమ పథకాలు పాలకుల దయాదాక్షిణ్యాల వాగ్దానాలు కాదు... ప్రజల హక్కులకు ప్రభుత్వం ఇచ్చే భరోసా. పేదరికం, వృద్ధాప్యం, వైకల్యం, నిరుద్యోగం, ఆహార భద్రత వంటి జీవన సమస్యల నుంచి ప్రజలకు కనీస రక్షణ కల్పించడం. ఆ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడటం, అందుకు ప్రభుత్వం జవాబుదారీ కావాలి. ఎక్కడైనా లోపం జరిగితే దాన్ని గుర్తించి సరిదిద్దడం, అధికార యంత్రాంగంతో బాధ్యతగా పనిచేయించడం పాలకుల కర్తవ్యం. అంతేకాని పథకాల అమలులోని లోపాలకు లబ్ధిదారులనే నిందించడం, వారి జీవన విధానాలను అనుమానించడం, సంక్షేమంపై నిఘా పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ప్రజల కోసం రూపొందించిన పథకాలు ప్రజల గౌరవాన్ని కాపాడుతూ వారి జీవితాలను బలోపేతం చేసినప్పుడే సంక్షేమానికి సార్థకత చేకూరుతుంది. ‘పారదర్శకత, జవాబుదారీతనం అనేవి సుపరిపాలనకు పునాదులు. ఇవి లేని ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోతుంది’ అంటారు నెల్సన్ మండేలా. పేదలకు అందుతున్న పింఛన్‌ సొమ్మును కొందరు మద్యం కోసం ఖర్చు చేస్తున్నారని, నిధులు వృథా అవుతున్నాయని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ మౌలిక విషయాన్నే ప్రశ్నార్థకంగా మార్చాయి. సంక్షేమ పథకాల అమలులో లోపాలుంటే వాటిని సరిదిద్దాలి. అంతేకాని, పథకం పొందుతున్న పేదలనే అనుమానాస్పదులుగా, బాధ్యతారహితులుగా చిత్రించడం సమర్థనీయం కాదు.

ఆకలి, వృద్ధాప్యం, అనారోగ్యంతో అలమటించే నిరుపేదలకు పింఛను అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు; అది వారి రాజ్యాంగబద్ధమైన హక్కు. ఎక్కడో ఒకరిద్దరు దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో లబ్ధిదారులందరినీ అనుమానించడం, అధికారులు సాయంత్రం వేళల్లో వారి ఖర్చులను తనిఖీ చేయాలని ఆదేశించడం ప్రజల ఆత్మగౌరవాన్ని, వ్యక్తిగత గోప్యతను అవమానించడమే. గతంలో రైతుల ఆత్మహత్యల విషయంలో వారిని కించపరిచేలా కొందరు మాట్లాడి, భంగపడిన విషయం గుర్తెరగాలి. ‘ఒక కుటుంబానికి ఒకే ప్రయోజనం’ అమలు చేయాలని చెబుతూ, రేషన్, పింఛన్ల కోసం ఉమ్మడి కుటుంబాలు కూడా విడిపోతున్నాయని సి.ఎం వ్యాఖ్యానించడం శోచనీయం. ఒకవైపు ఉమ్మడి కుటుంబాలను విడగొట్టవద్దని హితవు పలుకుతూనే, మరొకవైపు కుటుంబాల విచ్ఛిన్నానికి దారితీసేలా సంక్షేమ నిబంధనలను రూపొందించాలనడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. కుటుంబ నిర్వచనాన్ని మార్చాలనుకున్నప్పుడు, ముందుగా శాస్త్రీయ ప్రామాణికాలను నిర్ణయించి ప్రజామోదం పొందాలి గానీ, ఉన్నపళంగా అర్హతలను కుదించడం సరికాదు. అంతేకాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే వారిపట్ల, నిరసన తెలిపే వారిపట్ల "కఠినంగా వ్యవహరించాలి" అని సి.ఎం అధికారులను ఆదేశించడం ప్రజాస్వామ్యానికే ముప్పు. ‘నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు. శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై అక్రమ కేసులు పెట్టొద్దు’ అని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన రాజ్యాంగ స్ఫూర్తిని పక్కనపెట్టి, నిరసనకారులపై కఠినంగా ఉండాలనడం అప్రజాస్వామికం. ‘సమ్మతి లేని చోట ప్రజాస్వామ్యం మనలేదు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థకు రక్షణ కవచం లాంటిది’ అంటారు జస్టిస్ డి.వై. చంద్రచూడ్.

సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి ప్రజల డబ్బే. అందువల్ల దాని వినియోగంపై పారదర్శకత, జవాబుదారీతనం అవసరమే. అదే సమయంలో లబ్ధిదారుడి గౌరవం, గోప్యత, స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం. పింఛన్‌దారులపై అనుమానపు చూపులు సరికాదు. పింఛన్‌ పంపిణీలో అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో చూడాలి. కుటుంబాలు విడిపోతున్నాయని బాధపడటం కంటే కుటుంబాలను విడదీసే విధాన లోపాలను ఎలా సవరించుకోవాలో ఆలోచించాలి. నిజానికి కుటుంబాలను విడదీస్తున్నది రేషన్‌ కాదు... పేదరికం. పేదరిక నిర్మూలన కోసమంటా ఆర్భాటంగా ప్రకటించిన ‘పి-4’ మొక్కుబడిగా మారిందని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారు. దీనికి కలెక్టర్లను మందలించడం కంటే, తగిన కార్యాచరణ రూపొందించడం ముఖ్యం. ప్రభుత్వం తన పథకాల వైఫల్యాలకు అధికార యంత్రాంగాన్ని బాధ్యుల్ని చేయడం కాదు. అమలులో వున్న లోపాలను సరిదిద్దుకోవాలి. ‘అణచివేత ఉన్న చోట నిరసన తప్పనిసరి/ ప్రజల గొంతుకను అణచగలిగే శక్తి ఏ అధికార పీఠానికీ లేదు’ అంటారో కవి. అసమ్మతి వినిపించనిచోట పాలన ఏకపక్షంగా మారుతుంది. నిరసనను అణచివేయాలని చూసిన చోట మరింత ఉధృతం అవుతుంది. ప్రజల చేతిలోని పింఛన్‌ను కాపాడటమే కాదు, ప్రజల గొంతునూ కాపాడాలి. సంక్షేమం ప్రజల జీవనానికి భరోసా అయితే, నిరసన వారి ప్రజాస్వామ్య హక్కులకు భరోసా. ఈ భరోసాను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్