గ్రామ స్వరాజ్యం వికసించాల్సిన పంచాయతీ ఎన్నికలను రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం తన రాజకీయ, అధికార ఆధిపత్య బల నిరూపణ బరిగా మార్చడం ప్రజాస్వామ్యానికి విఘాతం. స్వతంత్రంగా పని చేయాల్సిన స్థానిక సంస్థలను ప్రభుత్వానికి సామంత రాజ్యాలుగా, ఎన్నికలతో నిమిత్తం లేకుండా ప్రజా ప్రతినిధులను సామంత రాజులుగా నియమించుకునే స్థాయికి వ్యవస్థను భ్రష్టు పట్టించడం ఆందోళనకరం. ఎ.పిలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెల రోజులుగా సాగుతోంది. అర్బన్, జిల్లా, మండల పరిషత్ సంస్థలకు ఎన్నికలు ముగిశాయి. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థులను కనీసం నామినేషన్లు సైతం వేయనీకుండా అధికార కూటమి ఏ విధంగా అరాచకాలకు పాల్పడిందో యావత్ రాష్ట్రం కాంచింది. పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలైనందున అధికార కూటమి తన ప్రాభవం తగ్గలేదని చూపించేందుకు నానా గడ్డి కరిచిందని ప్రజలు సంభాళించుకున్నారు. ఇప్పుడు పార్టీలతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికలను సైతం అన్ని అడ్డదారులనూ తొక్కుతుండటాన్ని చూస్తుంటే అసలు రాజ్యాంగం పేర్కొన్న ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే సందేహం జనిస్తుంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి తమ మంత్రులు, ఎంఎల్ఎలు, ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పంచాయతీలలో వీలైన మేరకు ఏకగ్రీవాలు చేయించాలని ఆదేశించడం తీవ్ర అభ్యంతరకరం. ఎన్నికల్లో ప్రజలను ఒప్పంచి మెప్పించి గెలవాలని చెప్పకుండా ఏకగ్రీవాలు చేయించాలనడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ముఖ్యమంత్రే అటువంటి నిర్దేశం చేసినప్పుడు, కూటమి శ్రేణులు ఊరికినే ఉంటారా?
తన ఏకగ్రీవ మంత్రానికి సిఎం చెబుతున్నది ప్రభుత్వం ప్రకటించిన నజరానాలు. గతంలో సర్పంచి పదవి ఏకగ్రీవం అయిన పంచాయతీలకు కనిష్టంగా ఉన్న రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని 15 లక్షలకు, గరిష్టం 20 లక్షల నుంచి 50 లక్షలకు పెంచామంటున్నారు. పార్టీ రహితం అయినందున గ్రామాభివృద్ధికి తోడ్పడేలా, ప్రభుత్వ నజరానాలను అందిపుచ్చుకునేలా ఏకగ్రీవం చేయాలని సూచిస్తున్నారు. పైకి సిఎం చేప్పేది సూక్తి ముక్తావళిగా కనిపించినా లోపల మాత్రం గ్రామాలపై అధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు పోకూడదన్న లక్ష్యం కనిపిస్తుంది. అందుకోసం ఎంతకైనా బరితెగించాలన్న పాఠం గోచరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం, అధికారులతో తిరస్కరింపజేయడం, బలవంతపు విత్‌డ్రాల వరకు కూటమి నేతలు వెనుకాడట్లేదు. రాష్ట్రంలో తొలి దశలో 3,949 సర్పంచ్ పోస్టులకుగాను 758 ఏకగ్రీవం అయ్యాయి. వార్డు సభ్యులు 39,743కు గాను 14,727 పోలింగ్ లేకుండానే ఏకగ్రీవం అయ్యాయి. ఇదే విధానం తక్కిన రెండు దశల్లోనూ కొనసాగేలా ఉంది. మున్సిల్, పరిషత్లలోనూ ఇదే జరిగింది. ఏకంగా 17 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 76 జెడ్పిటిసిలు కూటమికి ఏకగ్రీవం అయ్యాయి. ఎంపిటిసిలలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. పోలింగ్ జరిగిన చోట అధికార దుర్వినియోగం, డబ్బు, మద్యం, ఇత్యాది ప్రలోభాలకు అంతే లేదు.
ఏకగ్రీవాలపై ఒకే ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య ఏకాభిప్రాయం కొరవడిందనడానికి వారు లంకించుకున్న భిన్న వైఖరే తార్కాణం. వీలైన మేరకు ఏగ్రీవాలు సాధించాలని టిడిపి శ్రేణులకు సిఎం పిలుపునిస్తుండగా, ఎక్కడైనా స్వేచ్ఛగా పోటీ చేసుకోవాలని పవన్ జనసేన క్యాడర్‌కు సూచించారు. కూటమిలోని మూడు పార్టీలూ కలిసే ఉన్నాయని తరచు అధినేతలు చేస్తున్న ప్రకటనల్లో నిజం లేదని సిఎం, డిప్యూటి సిఎం ఎంచుకున్న భిన్న వైఖరుల ద్వారా తెలిసిపోతుంది. కడప జిల్లా చక్రాయపేట మండలం సురభి పంచాయతీలో జనసేన నాయకుడిపై టిడిపి దాడి చేసిన నేపథ్యంలో ఒక జనసేన కార్యకర్త చనిపోయాడు. దాంతో ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఇటువంటి ఘటనలతో జనసేన, టిడిపి మధ్య సమన్వయం దెబ్బతిని అగాధం ఏర్పడుతోంది. ఈ ఒత్తిళ్ల కారణంగానే పవన్ తమ కార్యకర్తలకు పోటీ చేసే స్వేచ్ఛ ఇచ్చినట్లు భావించాలి. కాగా మూడవ దశ నామినేషన్లకు చివరి రోజున పవన్ ‘స్వేచ్ఛ’ ప్రకటన చేయడం గమనార్హం. తమ పాలనకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన రిఫరెండంగా సిఎం చెబుతున్నారు. అదే నిజమైతే బలవంతపు ఏకగ్రీవాలపై వెంపర్లాట ఎందుకో అర్థం కాదు. ప్రజలు తమ అభిప్రాయం తెలియజేసే అవకాశం కల్పించకుండా, తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటేసి ఎన్నుకునే స్వేచ్ఛ వారికి లేనప్పుడు ప్రజాస్వామ్యానికి, గ్రామ స్వరాజ్యానికి అర్థం ఉండదు.







కామెంట్లు (0)