సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‌కీలక శాఖల్లో ఎఐ

55 నిమిషాల క్రితం

CM Chandrababu Naidu meets with AP employee union leaders
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 12:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- డేటా ఆధారిత నిర్ణయాలతో మెరుగైన ఫలితాలు

- సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కీలకమైన వివిధ రంగాల్లో ఎఐ సాంకేతికతను వినియోగించుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఆధునిక టెక్నాలజీ, ఎఐ స్టాక్ ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు శాఖల పనితీరు, ప్రభుత్వ ఆదాయాలను మెరుగుపర్చాలని నిర్దేశించారు. రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యారోగ్యం నుంచి వ్యవసాయం వరకూ ఎఐను వినియోగించి సేవలను సులభతరం చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలను మరింత సమర్థవంతంగా, వేగంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంపొందించేందుకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడినప్పుడే మరింత మెరుగైన పాలన అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ద్వారా ప్రజల నుంచి అందే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పర్యవేక్షణ లోపాలను సరిదిద్దుకుంటూ, ప్రతి శాఖ తన పనితీరును నిరంతరం సమీక్షించుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. రెవెన్యూ, లీగల్ ఎఐ స్టాక్ ద్వారా వివిధ అంశాలను విశ్లేషించి, అత్యుత్తమ పనితీరు సాధించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అత్యంత కీలకంగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరుకు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఒక కొలమానంగా ఉన్నాయని పేర్కొన్నారు. శాఖల ఉన్నతాధికారులు పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఎస్‌‌సి, బిసి, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఆర్థిక, మున్సిపల్, ఇంధన శాఖల ఉన్నతాధికారులు, ఆర్‌‌టిజిఎస్‌ అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్