- అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంటు స్థానానికి భారీగా పెరిగిన ఓట్లు
- ఒకే క్యూ.... రెండు లెక్కలు
- వ్యత్యాసంపై పెదవి విప్పని ఇసి
- ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ సంచలన నివేదిక
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చిత్రం బయటపడుతోంది. అటువంటిదే మన రాష్ట్రంలోనూ వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే! పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన ఓటర్లు ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు ఎంపి అభ్యర్థికి కూడా ఓటువేసి వచ్చారు. అంటే ఇద్దరికీ ఒకే సంఖ్యలో ఓట్లు పోల్ అవుతాయి కదా! కానీ, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో దీనికి భిన్నంగా జరిగింది. ఈ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకన్నా పార్లమెంటుకు అత్యధికంగా ఓట్లు పోల్ అయ్యాయి. ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ చేసిన పరిశీలన ప్రకారం 31 వేల ఓట్లు ఇలా అధికంగా పోల్ అయినట్లు తెలిసింది. ‘ఇలా ఎలా జరిగింది?’ ఆ సంస్థ వేసిన ప్రశ్నకు ఎన్నికల సంఘం నుండి జవాబులేదు. చిత్తూరు చిదంబర రహస్యానికి సంబంధించి ఆ సంస్థ వెలువరించిన నివేదిక ప్రస్తుతం కలకలం రేపుతోంది.
చిత్తూరు పార్లమెంటు పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసిన వారి సంఖ్యపై, భారత ఎన్నికల సంఘానికి ఒక రోజు వ్యవధిలో పంపిన రెండు వేర్వేరు నివేదికలలో ఎన్నికల అధికారులు రెండు భారీ వ్యత్యాసాలను పేర్కొన్నట్లు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ కనుగొంది. చిత్తూరు లోక్‌సభ స్థానానికి సంబంధించిన నివేదికలో, చీకటి పడిన తర్వాత కూడా ఓటు వేయడానికి సాయంత్రం 6 గంటల సమయానికి 56,067 మంది ఓటర్లు ఇంకా క్యూలోనే ఉన్నారని అధికారులు తెలిపారు. చిత్తూరు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన మరో నివేదికలో, కేవలం 24,596 మంది ఓటర్లు మాత్రమే రాత్రి పొద్దుపోయే వరకు ఓటు వేయడానికి మిగిలి ఉన్నారని వారు ఇసిఐకి చెప్పారు.
పార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికలు రెండూ ఒకేసారి, ఒకే బూత్‌లలో, ఒకే క్యూలతో జరిగాయి కాబట్టి, ఈ రెండు లెక్కలూ ఒకేలా ఉండాలి. 31,000 కంటే ఎక్కువ ఓటర్ల తేడా ఇసిఐలో ప్రమాద ఘంటికలు మోగించి ఉండాలి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఇవిఎం) లోపాలు, హింస కారణంగా పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగిందని, ఒక సందర్భంలో తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) అంగీకరించారు. అసాధారణంగా అర్ధరాత్రి వరకు జరిగిన ఈ పోలింగ్, వ్యవస్థాగత రిగ్గింగ్‌కు స్పష్టమైన సంకేతమని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి .
తెలుగుదేశం పార్టీ (టిడిపి)కి చెందిన ఎన్. చంద్రబాబు నాయుడు చిత్తూరులోని కుప్పం అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో, ఓటు వేయని ఓటర్ల విషయం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో కుప్పం ఒకటి. 2024లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరిగినప్ప్పుడు, టిడిపి పార్లమెంటరీ స్థానంతో పాటు మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకుంది. భారత ఎన్నికల సంఘం మన ఓట్లకు సంరక్షకురాలు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలను నిర్వహించి, మన ఎన్నికల ప్రజాస్వామ్య పవిత్రతను కాపాడాలని రాజ్యాంగం దానికి బాధ్యత అప్పగించింది.
2024లో దేశవ్యాప్తంగా జరిగిన పోలింగ్‌ను పర్యవేక్షించడంలో ఇసిఐ విఫలమైందని ఎన్నికల ఆడిట్ సిరీస్ వెల్లడిస్తోంది. అయినప్పటికీ, సంస్థాగత రిగ్గింగ్‌ను గుర్తించడానికి ఉద్దేశించిన నివేదికలు, ఇసిఐలో ఒక అంధకార గదిలో కూరుకుపోయాయని, అందుకే ఈ నివేదికలను బహిరంగపరచరని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తెలిపింది. ఎన్నికల సంఘం అంతర్గత రికార్డులైన ‘రిపోర్ట్స్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్’ పత్రాలను ‘ది కలెక్టివ్’ సంపాదించి విశ్లేషించినట్లు ప్రకటించిం ది. ‘మేము ఇప్పటివరకు కేవలం ఒక పార్లమెంటరీ స్థానానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారుల నివేదికలను మాత్రమే సమీక్షించాము. ఇతర నియోజకవర్గాలలో ఏమి జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలో ఉన్న ఓటర్లకు 56,067 స్లిప్ప్పులు జారీ చేసినట్లు ఇసి రికార్డులు చెబుతున్నాయి. కానీ, అదే చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల (కుప్పం, చంద్రగిరి, చిత్తూరు, నగరి, పలమనేరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు) రికార్డులను కలిపి చూస్తే, సాయంత్రం 6 గంటల తర్వాత కేవలం 24,596 మంది మాత్రమే క్యూలో ఉన్నట్లు నమోదైంది. అంటే, ఒకే క్యూ లైన్లో నిలబడిన ఓటర్ల లెక్కలో ఏకంగా 31,471 మంది తేడా (అసాధారణ వ్యత్యాసం) కనిపించింది. చిత్తూరుపై ఇసిఐ వెలువరించిన రెండు నివేదికలు, సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేయడానికి క్యూలో నిలబడిన ప్రజల సంఖ్యను చాలా భిన్నంగా పేర్కొన్నాయి. ఇదే విధంగా ఈ సంఖ్యలు సరిపోలని ఏ నియోజకవర్గంలోనైనా సాయంత్రం 6 గంటల తర్వాత జరిగే పోలింగ్ యొక్క పవిత్రతకు ఇసిఐ హామీ ఇవ్వలేదు.
ఈ వ్యత్యాసంపై వివరణ ఇవ్వాలని ఇసిఐని, ఆంధ్రప్రదేశ్ సిఇఒను ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ కోరగా, ఇసిఐ స్పందించలేదు, కానీ జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాయాలని సిఇఒ కార్యాలయం తెలిపినట్లు వీరు ప్రకటించారు. 2024 ఎన్నికలలో 200 స్థానాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత ఎంత మంది పౌరులు ఓటు వేశారనే దానిపై ఇసిఐ వద్ద ఎలాంటి రికార్డు లేదు.
ఇసిఐ స్లిప్‌ల రికార్డును ఎలా నిర్వహిస్తుంది. ఏకకాల ఎన్నికల సమయంలో, ఇసిఐ ప్రతి బూత్‌లో ముగ్గురు పోలింగ్ అధికారులకు బదులుగా, ఒక ప్రిసైడింగ్ అధికారి మరియు ఐదుగురు పోలింగ్ అధికారులతో కూడిన పెద్ద బృందాన్ని నియమిస్తుంది. మొదటి పోలింగ్ అధికారి ఓటరు జాబితాతో ఓటరు గుర్తింపును సరిపోల్చి నిర్ధారిస్తారు. రెండవ పోలింగ్ అధికారి ఓటరు ఎడమ చూపుడు వేలుపై చెరగని సిరాతో గుర్తు పెట్టి, ఓటర్ల రిజిస్టర్‌పై సంతకం చేయిస్తారు. ఫారం 17A అని కూడా పిలువబడే ఈ రిజిస్టర్, ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌లోకి వచ్చిన ఓటర్లందరినీ నమోదు చేస్తుంది.
మూడవ పోలింగ్ అధికారి ఒకేలాంటి రెండు ఓటరు చీటీలను, ఒకటి తెలుపు రంగులో, మరొకటి గులాబీ రంగులో తయారుచేసి ఓటరుకు అందజేస్తారు. ఆ తర్వాత, ఓటరు లోక్‌సభ ఎన్నికలకు ఉపయోగించే ఇవిఎంల నియంత్రణ విభాగానికి ఇన్చార్జిగా ఉన్న నాల్గవ పోలింగ్ అధికారి వద్దకు వెళ్లి, తెల్లటి ఓటరు చీటీని ఆ అధికారికి అందజేసి, తమ ఓటు వేస్తారు.
అనంతరం, ఓటరు అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించే ఇవిఎంల నియంత్రణ విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్న ఐదవ పోలింగ్ అధికారి వద్దకు వెళ్లి, గులాబీ రంగు ఓటరు చీటీని అందజేస్తారు. అప్ప్పుడు ఓటరు రెండవ ఓటు వేయడానికి అనుమతించబడతారు. పైన పేర్కొన్న ఓటరు చీటీలకు భిన్నంగా, ముందుగా నంబర్లు వేయబడిన చీటీలను, సాధారణంగా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే అధికారిక సమయంలో వరుసలో వేచి ఉన్న ప్రజలకు ప్రిసైడింగ్ అధికారి పంపిణీ చేస్తారు. పోలింగ్ అధికారికంగా ముగిసిన తర్వాత, ఈ చీటీలు ఉన్న ఓటర్లు మాత్రమే బూత్‌లోకి ప్రవేశించి ఓటు వేయగలరు.
వరుసలో ముందు వైపునకు వెళ్లే కొద్దీ, చీటీ నంబర్ 1 చివరి వ్యక్తికి ఇవ్వబడుతుంది. ప్రిసైడింగ్ అధికారి జారీ చేసిన మొత్తం చీటీల సంఖ్యను కూడా తమ డైరీలో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత, ప్రిసైడింగ్ అధికారి డైరీని, ఓటర్ల రిజిస్టర్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు, ఆయన మరుసటి రోజు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రిటర్నింగ్ అధికారికి ఏవైనా అనుమానాస్పద అంశాలు కనిపిస్తే, వారు ఆ పోలింగ్ కేంద్రంలో తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఇసిఐకి సిఫార్సు చేస్తారు. లోక్‌సభ, విధానసభ ఎన్నికలు రెండూ ఒకే పోలింగ్ కేంద్రంలో జరిగి, సాయంత్రం 6 గంటలకు ఒకే ప్రిసైడింగ్ అధికారి ఒకే క్యూకు చీటీలు వేసినట్లయితే, రెండు వేర్వేరు ఓట్ల లెక్కింపులు ఎలా ఉంటాయి?







కామెంట్లు (0)