మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జవాబు చెప్పాల్సింది ఎవరు?

1 గంట క్రితం

pm modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 04:45 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

“పన్నులు తగ్గించాం, రాయితీలు ఇచ్చాం. మరి ఉద్యోగాలేవి? జీతాల పెంపు ఏది?”

నవంబర్ 19న న్యూఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్‌ ‌ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) శత వసంతాల వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పారిశ్రామికవేత్తలను నిలదీశారు. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేకుండా చేశామని గుర్తుచేశారు. ఇన్ని రాయితీలు ఇచ్చినా పారిశ్రామికవేత్తలు కొత్త ఉద్యోగాలు కల్పించలేదని, ఉద్యోగుల జీతాలు పెంచలేదని, దేశాభివృద్ధికి తగినంతగా తోడ్పడలేదని ప్రశ్నించారు. ఈమాటలపై ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇది కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం కలిసి ఆడుతున్న లాలూచీ కుస్తీ కాదా? ప్రధాని అంగీకరించింది ఏమిటి?

ప్రధాని ప్రసంగంలోని అసలు సారాంశం ఇదే. కార్పొరేట్ పన్నులను రికార్డు స్థాయిలో తగ్గించినా, బడా వ్యాపారవేత్తలకు భారీ ప్రోత్సాహకాలు ఇచ్చినా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు. సంపద సృష్టించే ఉద్యోగ, కార్మికుల జీతాలు పెరగలేదు. అంటే గత 12 ఏళ్లుగా బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ప్రధానమంత్రే ఒప్పుకున్నట్లు కాదా?

బడా కార్పొరేట్ సంస్థలు, వ్యాపార దిగ్గజాలు తమ లాభాలను మరింత పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాయి. కార్మిక సంక్షేమం, ఉద్యోగ కల్పన వారి ప్రాధాన్యత కాదు. ఇది జగమెరిగిన సత్యమే. అయినా ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్ను 22 శాతానికి తగ్గించింది. కొత్తగా ప్రారంభించిన మాన్యుఫాక్చరింగ్ రంగ సంస్థలకు ఇది 15 శాతమే. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్) 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయాల ఫలితంగా, ప్రభుత్వ అంచనాల ప్రకారమే సంవత్సరానికి రూ. 3.03 లక్షల కోట్ల మేర పన్నుల ఆదాయం తగ్గింది. ఆ మేరకు ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకు బదలాయించినట్లేగా? కార్పోరేట్‌ ‌దిగ్గజాలు, లబ్ధి పొందిన ప్రజాధనాన్ని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయని, ఉద్యోగులకు జీతభత్యాలు పెంచుతాయని ఆశించగలమా?

ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న వాతావారణం ఉంటే కొత్త పెట్టుబడులు పెట్టి, కొత్తగా కంపెనీలు పెట్టటానికి ముందుకొస్తాయి. కొత్త ఫ్యాక్టరీల వలన ఉద్యోగాలు పెరుగుతాయి. జీతాలు పెరుగుతాయి. ఆదాయాలు పెరిగితే ప్రజల వినిమయం, కొనుగోలుశక్తి పెరుగుతుంది. మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. ఇంకా కొత్తగా పెట్టుబడులు పెరుగుతాయి. దీన్నే అర్థశాస్త్రంలో పాజిటివ్ ఎకనామిక్ సైకిల్ అంటాం. కానీ గత కొన్నేళ్లుగా ఆర్థిక చక్రం తిరోగమనంలో ఉంది. నిరుద్యోగం, ఆర్థిక అంతరాలు, అసమానతలు పెరుగుతున్నాయి. అరకొర ఉద్యోగ కల్పన జరిగినా అది అసంఘటిత రంగంలోనే. భద్రత, గ్యారంటీ లేని గిగ్ వర్కర్లు పెరుగుతున్నారు. గ్రామీణ ఉపాధి పథకాన్ని తగిన నిధులు కేటాయించకుండా నీరుగారుస్తున్నది ప్రభుత్వం. గ్రామీణ నిరుద్యోగం పెరిగి కొనుగోలు శక్తి దిగజారుతున్నది.

లాభాల వర్షం, వాటా ఎవరికి?

కార్పొరేట్ లాభాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా విశ్లేషణ ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికంలో, అంటే గత మూడు నెలల్లోనే, స్టాక్ మార్కెట్లో నమోదైన 2,600 పైగా కంపెనీలు సుమారు రూ.4.5 లక్షల కోట్ల నికర లాభం ఆర్జించాయి. అయితే ఆ లాభాలు అందరికీ సమానంగా అందలేదు. మొదటి 5 కంపెనీలు దాదాపు 25 శాతం లాభాలు ఖాతాలో వేసుకున్నాయి. తరువాతి 5 కంపెనీలతో కలిసి (10 కంపెనీలు) లాభాలలో 38 శాతం, మొదటి 50 కంపెనీలు 55 శాతం లాభాలను సొంతం చేసుకున్నాయి. లాభాలు కొద్ది చేతుల్లోనే పోగవుతున్నాయని అర్ధం​చేసుకోవడానికి ఈ ఉదాహరణ చాలదా? అప్పుడవి కొత్త ఉద్యోగాలు, జీతాల పెంపు దిశగా ఎందుకు కృషి చేయడం లేదు?

వేతనాల స్తబ్దత కొత్తది కాదు

ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా (మొదటి అధికారిక గృహ ఆదాయ సర్వేకు సాంకేతిక నిపుణుల బృందం అధ్యక్షుడు) ఇటీవల ఒక వ్యాసంలో తెలియజేసిన ప్రకారం 2024 ధరల్లో సగటు వాస్తవ వేతనం 2011-12లో నెలకు రూ.23,637 ఉండగా, 2025 నాటికి రూ.22,314కు తగ్గింది. పట్టభద్రుల సగటు జీతం రూ.41,782 నుంచి రూ.35,046కు పడిపోయింది. అంటే జీతాల సమస్య ఏళ్లుగా కొనసాగుతున్నదే, ఒక్క రోజులో వచ్చింది కాదు. ప్రభుత్వ విధానాలే పరిశ్రమల పని విధానాన్ని నిర్ణయిస్తాయి. 2018 నుంచి బడ్జెట్ తర్వాత బడ్జెట్‌లో దిగుమతి సుంకాలుపెంచారు. నాణ్యతా నియంత్రణ ఉత్తర్వుల (క్యు.సి.ఓల) పరిధిలోకి పాలిస్టర్ దారం నుంచి పాదరక్షల వరకు వందలాది ఉత్పత్తులను చేర్చారు. ఫలితంగా చౌకగా దిగుమతయ్యే ముడి సరుకులు రావడం లేదు, దేశీయ సరఫరాదారులకు రక్షణ దొరుకుతోంది. పోటీ లేనప్పుడు నూతన ఆవిష్కరణలకు ఒత్తిడి ఉండదు. పరిశ్రమలు సుంకాలనూ, క్యు.సి.ఓలనూ నిర్ధారించవు. అది ప్రభుత్వ బాధ్యత. ప్రోత్సాహకాలకు, ధరలకు, పన్నులకు, నిబంధనలకు స్పందించే సంస్థలు ఉపన్యాసాలకు స్పందించవు.

‘శ్రమ లేకుండా సంపద లేదు’

వస్తు సేవల ఉత్పత్తికి ప్రధానం అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగుల శ్రమ అన్నది ఆర్థికశాస్త్ర మౌలిక సూత్రం. శ్రమ లేకుండా సంపద పుట్టదు. కానీ పెట్టుబడే సంపదను సృష్టిస్తుందనే తిరోగమన అవగాహనతో బిజెపి ప్రభుత్వం నడుస్తోంది. అందుకే విధానాలన్నీ కార్పొరేట్ అనుకూలంగా ఉన్నాయి. శ్రమపై పెట్టుబడి ఆధిపత్యం స్థిరపడింది. ఈ ప్రసంగంలో మరో విషయం గమనించాలి. తదుపరి సంస్కరణలపై ఫిక్కీ రాతపూర్వక సూచనలు ఇవ్వాలని ప్రధాని స్వయంగా ఆహ్వానించారు. కార్పొరేట్లకు ఇంత సులభంగా తలుపులు తెరుచుకునే చోట, శ్రామికుల, ఉద్యోగ సంఘాల సూచనలను ఇలా ఆహ్వానించిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? విధానాల రూపకల్పనలో ఎవరి గొంతు వినిపిస్తోందో ఇదే చెబుతోంది.​

ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ పాత్రే ప్రశ్నార్థకం

కార్పొరేట్లను నిందించే ముందు ప్రభుత్వం తన విధాలను నిశితంగా సమీక్షించుకోవాలి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిర్దేశాలకు అనుగుణంగా ఎఫ్‌.ఆర్‌.బి.ఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) చట్టం చేసి, బడ్జెట్ లోటు తగ్గింపు పేరుతో మౌలిక వసతుల రంగ పెట్టుబడుల్లో కోత పెడుతున్నారు. విద్య, వైద్యం, ప్రజా సంక్షేమ రంగాలకు కేటాయింపులు తగ్గాయి. అంచనాల ప్రకారం ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 30 లక్షల శాశ్వత ఉద్యోగ ఖాళీలు భర్తీకాలేదు. ఆ ఖాళీల్లో తాత్కాలిక, దినసరి, కాంట్రాక్టు, అప్రెంటిస్, ఔట్‌సోర్సింగ్, ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులతో పని చేయిస్తున్నారు. వారికి అరకొర జీతాలే తప్ప సమాన పనికి సమాన వేతనం లేదు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వ శాఖలు, సంస్థలు, మోడల్ ఎంప్లాయర్ గా శ్రమ దోపిడీకి పాల్పడకూడదని 2016 నాటి పంజాబ్ ప్రభుత్వం వర్సెస్‌ జగ్జిత్ సింగ్ కేసుతో సహా సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసినా పరిస్థితి మారలేదు. ప్రభుత్వమే ఉద్యోగ భద్రత, సరైన జీతాలు లేని వ్యవస్థను నిర్మించాక, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు ఆ బాధ్యత తీసుకోవాలని ఆశించడం జరిగే పనేనా?

కనీస వేతనమే లేని ‘వేజ్ కోడ్’

కార్మిక చట్టాలను రద్దు చేసి తెచ్చిన వేజ్ కోడ్‌లో కనీస వేతనాల ప్రస్తావనే లేదు. దానికి బదులు ‘ఫ్లోర్ రేట్’ అంటూ రోజుకు రూ.176 అని కొత్తగా నిర్ణయించారు. ఇలా వేతన విధానాన్నే బలహీనపరిచిన ప్రభుత్వం,“జీతాలు ఎందుకు పెంచలేదు” అని కార్పొరేట్లను నిందించడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? తన విధాన పరమైన లోపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం కాదా?

ప్రజల కంటే లాభాలే ముఖ్యం

అమెరికన్ తత్వవేత్త, భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్‌స్కీ నాలుగు దశాబ్దాల నూతన ఆర్థిక విధానాలపైనా, వాటి ప్రభావాలపైనా అనేక పుస్తకాలు రాశారు. వాటిలో 1999లో వెలువడిన ‘ప్రాఫిట్ ఓవర్ పీపుల్: నియో లిబరలిజం ​అండ్ గ్లోబల్ ఆర్డర్’ (ప్రజల కంటే లాభాలే ముఖ్యం) ప్రసిద్ధమైనది. ఈ విధానాల పర్యవసానంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులుగా పనిచేస్తున్నాయని ఆయన సూత్రీకరించారు. మన దేశంలో జరుగుతున్నది దీనికి భిన్నంగా ఉందా? ఉంటుందా? ఉపన్యాసాలు కాదు, విధానాలు మారాలి. ప్రధాని ప్రశ్నలో ఒక నిజం ఉంది. సంపద పెరుగుతోంది, కానీ అది అత్యధికులుగా ఉన్న ప్రజానీకానికి, శ్రమజీవులకు చేరడం లేదు. కానీ ప్రశ్నించాల్సింది కార్పొరేట్లను మాత్రమే కాదు, విధాన రూపకర్త అయిన ప్రభుత్వాన్నే. ఖాళీలను భర్తీ చేయడం, కనీస వేతనాన్ని చట్టబద్ధం చేయడం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థకు ముగింపు పలకడం, సంపదపై న్యాయమైన పన్ను విధించడం ప్రభుత్వం చేతుల్లో పనులు. వేదికపై నిలదీత కొత్త ఉద్యోగాలను సృష్టించదు. మాటలతో వేతనాలు పెరగవు. ప్రభుత్వం తగిన విధాన రూపకల్పన చెయ్యాలి. నిబద్ధతతో అమలు చెయ్యాలి.


- వ్యాసకర్త : పి. వెంకటరామయ్య

సెల్‌: 9553533815

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్