సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూటమిలో కుమ్ములాట...

20 నిమిషాల క్రితం

pitapuram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 01:20 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- వైస్‌ చైర్మన్ల ఎన్నికల్లో బయటపడ్డ విభేదాలు

- పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా టిడిపి వ్యవహరించిందంటూ జనసేన, బిజెపి ఆగ్రహం

ప్రజాశక్తి-యంత్రాంగం: మున్సిపల్‌ వైస్‌ ‌చైర్మన్ల ఎన్నికల్లో కూటమిలో సోమవారం కుమ్ములాటలు చోటుచేసుకున్నాయి. పొత్తు ధర్మానికి విరుద్ధంగా టిడిపి వ్యవహరించిందంటూ జనసేన, బిజెపి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల టిడిపి, జనసేనలో అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. టిడిపి, జనసేన పార్టీల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాల వల్ల శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కూటమి పొత్తులో భాగంగా ఈ పదవికి జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీ వి.విజయలక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. అభ్యర్థిని మార్చాలంటూ టిడిపి నాయకులు పట్టుబట్టారు. ఈ క్రమంలో రెండు పార్టీల ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో టిడిపి కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం అనంతరం సమావేశం హాలు నుంచి వెళ్లిపోయారు. దీంతో, కోరంలేని కారణంగా మున్సిపల్‌ ‌వైస్‌ ‌ఛైర్మన్‌ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్‌‌డిఒ రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు.

యలమంచిలిలో రచ్చకెక్కిన జనసేన, టిడిపి విభేదాలు

అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ‌టిడిపికి చెందిన 30వ వార్డు కౌన్సిలర్ గొర్రెల శివ నారాయణను కూటమి అధినాయకత్వం సూచించింది. సోమలింగపాలేనికి చెందిన ఒకటో వార్డు జనసేన కౌన్సిలర్ కర్రి ఝాన్సీని వైస్ ఛైర్‌‌పర్సన్‌ ‌ను చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌‌కుమార్‌ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో, జనసేనకు చెందిన 11 మంది కౌన్సిలర్లు కౌన్సిల్‌ సమావేశానికి గైర్హాజరయ్యారు. కోరం లేకపోవడంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

నాయుడుపేటలో టిడిపి, బిజెపి మధ్య పేచీ

కూటమి పార్టీల మధ్య పొత్తులో భాగంగా చిత్తూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం వైస్ ఛైర్మన్ పదవిని తొలుత బిజెపికి కేటాయించారు. అయితే, ఎన్నికల సమయంలో ఐదేళ్ల పదవీ కాలాన్ని రెండున్నరేళ్ల చొప్పున పంచుకుందామనే ప్రతిపాదనను టిడిపి తెరపైకి తెచ్చింది. దీనికి బిజెపి అంగీకరించి తొలి రెండున్నరేళ్లు తమకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేసింది. తమకే తొలుత అవకాశం ఇవ్వాలని టిడిపి పట్టుబట్టింది. ఈ విభేదాల నేపథ్యంలో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది.

నగరిలో ఎన్‌‌టిఆర్‌ విగ్రహం వద్ద కౌన్సిలర్ భర్త ధర్నా

చిత్తూరు జిల్లా నగరి టిడిపికి చెందిన 36వ వార్డు కౌన్సిలర్ కెజె విజయ భాస్కర్ కు వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అదే పార్టీకి చెందిన ఏడో వార్డు కౌన్సిలర్ లత భర్త రమేష్ నగరి టవర్ క్లాక్ సమీపంలోని ఎన్‌‌టిఆర్‌ విగ్రహం వద్ద ధర్నా చేశారు. పార్టీ కోసం 38 ఏళ్లుగా కష్టపడిన దళిత నాయకులకు గుర్తింపు లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి కాకుండా వైసిపి నుంచి వలస వచ్చిన వారికి వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

వైస్ చైర్మన్ పదవి ముస్లిములకు కేటాయించాలంటూ

జనసేన కార్యాలయం వద్ద ధర్నా

మార్కాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఎప్పటిలాగే ముస్లిములకు కేటాయించాలని కోరుతూ జనసేన కార్యాలయం ఎదుట ముస్లిం మైనారిటీ వర్గాలు ధర్నా చేశాయి. జనసేనకు చెందిన 10వ వార్డు కౌన్సిలర్ కొప్ప్పుల జ్యోతికి ఈ పదవి ఇప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మున్సిపాల్టీలో వైస్ చైర్మన్ పదవి మైనార్టీలకు ఇవ్వడం అనవాయితీగా వస్తోందని, దీనికి తూట్లు పొడవడం సరికాదన్నారు.

ఆత్మకూరులో మంత్రి ఆనంపై జనసేన నాయకులు ఆగ్రహం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో వైస్‌ చైర్మన్‌ గా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన అభ్యర్థికి కాకుండా మరో కౌన్సిలర్‌కు అవకాశం కల్పించడంతో ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమైంది. మంత్రి ఆనం మనారాయణరెడ్డి జోక్యంతోనే అభ్యర్థి మార్పు జరిగిందంటూ జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్రీధర్‌ ఆందోళనకు దిగారు. తమ పార్టీ అధినేత ప్రకటించిన అభ్యర్థిని కాదని మరో పేరును ఎలా ఖరారు చేస్తారని జనసేన నేతలు ప్రశ్నించారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌ అభ్యర్థిగా జనసేన రెబల్ కౌన్సిలర్లు గడ్డం సంధ్య, శిరీష పోటీ పడ్డారు. అయితే, 6వ వార్డు జనసేన కౌన్సిలర్ కత్తి పద్మజా వైస్‌‌ఛైర్మన్‌‌గా ఎన్నికయ్యారు. మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి జోక్యం వల్లే తమకు వైస్‌‌చైర్మన్‌ పదవి దక్కలేదంటూ సంధ్య, శిరీష మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వైస్‌చైర్మన్‌ పదవిని అమ్ముకుంటారంటూ ఆరోపించారు.

కాకినాడ జనసేన ఎంపి అనుచరుడుపై అదే పార్టీ వారు దాడి

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో జనసేన కౌన్సిలర్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కాకినాడ ఎంపి అనుచరునిపై అదే పార్టీకి చెందిన వారు దాడి చేశారు. పిఠాపురం మూడో వార్డు జనసేన కౌన్సిలర్ బొజ్జ వెంకటేశ్వరరావు పేరును వైస్ చైర్మన్ గా ప్రతిపాదించారు. దీనికి కౌన్సిలర్ల నుంచి మద్దతు లభించలేదు. పార్టీ విప్ జారీ చేసినందున కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని జనసేన ఎంపి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరినా ఫలితం లేకపోయింది. 12వ వార్డు జనసేన కౌన్సిలర్ ఆగంటి ప్రభాకరరావు 14వ వార్డు జనసేన కౌన్సిలర్ పిండి సంధ్య పేరును ప్రతిపాదించారు. 28వ వార్డు జనసేన కౌన్సిలర్ రెడ్డెం రామారావు బలపరిచారు. ఈ విభేదాల నేపథ్యంలో ఎంపి ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సమావేశం హాలు నుంచి బయటకు వచ్చి చర్చలు జరిపారు. పిండి సంధ్య అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన ఆగంటి ప్రభాకరరావు, బలపరిచిన రెడ్డెం రామారావులతో మాట్లాడి వారిని బుజ్జగించారు. చివరకు బొజ్జ వెంకటేశ్వరరావును వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపి అనుచరుడు వీరంరెడ్డి చక్రిపై జనసేన సీనియర్ కార్యకర్తలు దాడి చేశారు. పార్టీ అవిర్భావం నుంచి జనసేనలో ఉన్న నాయకులను కాదని వైసిపి నుంచి వచ్చిన వారికి ఎందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపి ఉదయ్ శ్రీనివాస్ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో సీనియర్ జనసేన నాయకుడు రాయవరం శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. దీంతో -నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడంతో ఆయనను విడిచిపెట్టారు.

నందిగామలో టిడిపి మైనారిటీ నాయకుల ధర్నా

ఎన్‌టిఆర్ జిల్లా నందిగామ వైస్ చైర్మన్ పదవిని 15వ వార్డు కౌన్సిలర్ ఇమామ్‌కు ఇస్తామని గతంలో హామీ ఇచ్చి, చివరి నిమిషంలో బిజెపి కౌన్సిలర్ తొర్లికొండ సీతారామయ్యకు కేటాయించడాన్ని నిరసిస్తూ టిడిపిలోని మైనారిటీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ తమకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి చివరి నిమిషంలో పదవిని వేరే వారికి కట్టబెట్టడం అన్యాయమన్నారు. టిడిపికి, ఆ పార్టీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడైన కోగంటి బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్