- స్థానిక ఎన్నికల్లో పోటీకి అవకాశం
- ప్రాథమికంగా నిర్ణయించిన టిడిపి
- 40శాతం డిమాండ్ చేస్తున్న జనసేన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. కూటమిలో పెద్దపార్టీగా ఉన్న టిడిపి ఈ సర్దుబాటును ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే టిడిపి నిర్ణయానికి జనసేన, బిజెపి కట్టుబడి ఉంటాయా? లేదా? అనేది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం సీట్లు చేయాలి, ఎక్కడ పోటీ చేయాలనే అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ముందు సీట్ల శాతం పూర్తి చేయాల్సి ఉంది. కూటమిలో పెద్దపార్టీగా ఉన్న టిడిపి అధిష్టానం సీట్ల పంపకాలు పూర్తిచేసినట్లు టిడిపి నేతలు చెబుతున్నారు. జనసేనకు 20శాతం ఇచ్చేందుకు ప్రాథమికంగా సిద్ధపడినట్లు చెబుతున్నారు. చర్చల ద్వారా 2 నుంచి 5శాతం పెరిగే అవకాశం ఉనట్లు అంటున్నారు.జనసేన 40శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సీట్ల సర్దుబాటు నేపథ్యంలో తమకు బలం ఉన్న ప్రాంతాల్లో 40శాతం ఇవ్వాలని, మిగిలిన చోట్ల 20శాతం ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. గోదావరి జిల్లాలతో పాటు, అనంతపూరం, తిరుపతి, ఉత్తరాంధ్ర వంటి చోట్ల జనసేన ఎక్కువ సీట్లు అడుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం మేయర స్థానంపై ఆ పార్టీ కన్నువేసినట్లు టిడిపి నేతలు అంటున్నారు.
స్వరం మారిన జనసేన
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై జనసేన స్వరం మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజీ పడే ప్రసక్తి ఉండదనట్లుగా ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. 35శాతం సీట్లు తమకు కేటాయించాలని జనసేన, 15శాతం తమకు కేటాయించాలని బిజెపి తొలుత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అడిగినట్లు సమాచారం. అయితే రెండు పార్టీలకు కలిపి 15శాతం మించి ఇచ్చేది లేదని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అనట్లు ప్రచారం జరిగింది. లోకేష్ వ్యాఖ్యలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు చంద్రబాబు నాయుడును, లోకేష్‌ను కూడా కలవలేదు. మంత్రివర్గ సమావేశాలకు, ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాటు అసెంబ్లీ సమావేశాలకు కూడా పవన్ హాజరు కాలేదు. లోక్‌భవన్‌లో ఆగస్టు 15వ తేదిన ఎట్‌హోం కార్యక్రమానికి, ఈ తరువాత నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు తీవ్ర జ్వరం ఉందని హాజరు కాలేదు. అసెంబ్లీ జరుగుతున్న చివరి రోజు మాత్రం వచ్చి జనసేన పార్టీ శాసనసభపక్ష సమావేశం నిర్వహించుకొని వెళ్లిపోయారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ జరుగుతున్నా, శాసనసభలో లోకేష్ ఉన్నా కలవకుండానే వెళ్లిపోయారు. ఇద్దరు కూడా అసెంబ్లీ ప్రాంగణం నుంచి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే కలుసుకోకుండా బయటకు వెళ్లిపోవడంతో చర్చనీయాంశంగా మారింది. మరోపక్క సీట్ల కేటాయింపులో తగ్గేది లేదని తొలుత మాట్లాడిన జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇప్పుడు బలం ఉన్న చోటే పోటీ చేద్దామని కార్యకర్తలకు చెబుతున్నారు. 2024లో రాష్ట్ర ప్రయోజనాల కోసం సీట్ల విషయంలో రాజీ పడ్డమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండదని జనసేన పిఎసి చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ బహిరంగంగానే చెప్పారు. అయితే ఇప్పుడు సీట్ల సంఖ్య ప్రాముఖ్యత కాదని, గెలిచే బలం ఉన్న చోట పోటీ చేద్దామని ఆ పార్టీ కార్యకర్తలకు చెబుతున్నారు. దీంతో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రావడంతోనే జనసేన స్వరం మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీట్ల సర్దుబాటుపై త్వరలోనే అధికారికంగా ప్రకటన ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెల రోజుల నుంచి పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ చికిత్స కోసం కేరళ వెళ్లినట్లు జనసేన నేతలు చెప్పారు. ప్రస్తుతం కూటమి పార్టీల సమన్వయ కమిటీల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏ పార్టీకి ఎక్కడ బలం ఉందనే చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల అనంతరం పార్టీల వారీగా పోటీ చేసే శాతం గురించి ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.







కామెంట్‌లు (0)