- విశాఖలోనే 109 .. ప్రాంతీయ సదస్సుల్లో 194
- 9.88 లక్షల కోట్ల పెట్టుబడులు
ప్రజాశక్తి - విశాఖ : విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో మొత్తం 331 ఓప్పందాలు కుదిరాయి. ఈ మేరకు సదస్సు ఫలితాలను అధికారులు ఖరారు చేశారు. వీటిలో కొన్నింటికి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చినట్టు తేల్చారు. ప్రధాన సదస్సుకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు చోట్ల నిర్వహించిన ప్రాంతీయ సదస్సులతోపాటు మొత్తం 9.88 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ప్రతిపాదనలు రాగా తద్వారా 3.46 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు తేల్చారు. అధికారవర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో పెట్టుబడులను వికేంద్రీకరించే లక్ష్యంతో నిర్వహించిన ఐదు ప్రాంతీయ సదస్సుల్లో మొత్తం 194 ఎంఓయూలు కుదిరాయి. విశాఖపట్నం ప్రాంతీయ సదస్సులో 31, కాకినాడ ప్రాంతీయ సదస్సులో 15, అమరావతి ప్రాంతీయ సదస్సులో 59, అనంతపురం ప్రాంతీయ సదస్సులో 22, తిరుపతి ప్రాంతీయ సదస్సులో 67 ఒప్పందాలు జరిగాయి. చివరిగా విశాఖపట్నంలో జరిగిన ప్రధాన సదస్సులో మరో 109 ఎంఓయూలు కుదిరాయి. దీంతో మొత్తం ఎంఓయూల సంఖ్య 303కు చేరింది.
పరిశ్రమల శాఖలోనే అత్యధికం
మొత్తం కుదిరిన ఒప్పందాల్లో అత్యధికంగా పరిశ్రమల శాఖలోనే ఉన్నాయి. ఈ శాఖలో ప్రధాన సదస్సులో 41, ప్రాంతీయ సదస్సుల్లో 84 కలిపి మొత్తం 125 ఎంఓయూలు కుదిరాయి. వీటి ద్వారా రూ.5,06,305 కోట్ల పెట్టుబడులు, 1,42,124 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్పారు. అదనంగా 9 జీఓల ద్వారా రూ.29,638 కోట్ల పెట్టుబడులు, 10,620 ఉద్యోగాల కల్పనకు జరుగుతున్నట్టు పేర్కొన్నారు.
ఇంధన రంగంలో రూ.2.58 లక్షల కోట్లు
ఇంధన రంగంలో మొత్తం 29 ఎంఓయూలు కుదరగా, వీటిలో ప్రధాన సదస్సులో 27, ప్రాంతీయ సదస్సుల్లో 2 ఉన్నాయి. వీటి ద్వారా రూ.2,58,355 కోట్ల పెట్టుబడులు, 41,280 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రతిపాదనలు వచ్చాయి. ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ పరిధిలో 23 ఎంఓయూలు కుదిరాయి. .పర్యాటక శాఖలో ప్రధాన సదస్సులో 11, ప్రాంతీయ సదస్సుల్లో 50 కలిపి మొత్తం 61 ఎంఓయూలు కుదిరాయి. వీటి ద్వారా రూ.6,828 కోట్ల పెట్టుబడులు, 26,948 మందికి ఉపాధి అవకాశాలు ప్రతిపాదించారు.మారిటైమ్ విభాగంలో రూ.9,285 కోట్లతో 12 ఎంఓయూలు, సీఆర్డీఏ రూ.7,690 కోట్లతో 18 ఎంఓయూలు, ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.6,344 కోట్లతో 23 ఎంఓయూలు, ఉన్నత విద్యాశాఖలో రూ.4,000 కోట్లతో 4 ఎంఓయూలు, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో రూ.3,421 కోట్లతో నాలుగు ఎంఓయూలు, ఏపీఏడీసీఎల్ రూ.670 కోట్లతో నాలుగు ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు అధికారులు తేల్చారు.








కామెంట్లు (0)