సామాన్యులకు ధరాఘాతం
రాష్ట్రంలో దారుణ పరిస్థితి
చుక్కలను దాటిన నిత్యావసరాలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను దాటి పరుగులు తీస్తున్నాయి. ధరాఘాతం దెబ్బకి సామాన్యులు విలవిల లాడే పరిస్థితి నెలకొంది. వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కార్పొరేట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రూపాయి కన్నా తక్కువ ధరకు కట్టబెడుతుంటే, మరోవైపు సాధారణ ప్రజానీకం రోజువారి జీవనం గడపడం కోసం ఉన్న ఆస్తులను అమ్ముకో వాల్సిన పరిస్థితి ఏర్పడింది, రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజానీకపు రోజువారి ఆహారానికి తప్పనిసరైన బియ్యం ధర ప్రభుత్వ అధికారిక లెక్కల్లోనే (డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్) రూ.62 నుండి రూ.72కు చేరింది. బహిరంగ మార్కెట్లో మొదటి రకం బియ్యం ధర దాదాపుగా వంద రూపాయలకు చేరుకుంది. ప్రభుత్వ వైఖరి ఇదే మాదిరి ఉంటే, త్వరలోనే వంద రూపాయలు దాటి పరుగులు తీసినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
భారీ పెరుగుదల ...
ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడో రకం బియ్యం ధర 62 రూపాయలు దాటిపోయింది. బహిరంగ మార్కెట్లో ఇవి 70 రూపాయల వరకు పలుకుతోంది. ఒకటో రకం బియ్యం ధర ప్రభుత్వ లెక్కలో 82 రూపాయలుగా చూపిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఇవి 100 రూపాయల వరకు చేరుకున్నాయి. గత నెలలో ఇదే బియ్యం రూ.69గా ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మిర్చి గత ఏడాది ఇదే రోజున రూ.186 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.305కు చేరిపోయింది. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ ధరకన్నా రూ.25 ఎక్కువే పలుకు తోంది. ద్వితీయ శ్రేణి మిర్చి కూడా కిలో రూ.274గా ఉన్నట్టు ప్రభుత్వమే చెబుతోంది. వేరుశెనగ నూనె గత ఏడాది రూ.159గా ఉండగా ఇప్పుడు రూ.184గా ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో రూ.200 వరకు ధర పలుకుతోంది.
ఉల్లితో మళ్లీ కన్నీరు!
ఉల్లిపాయలు మళ్లీ కంట తడి పెట్టిస్తున్నాయి. తాజాగా కిలో రూ.62 వరకు ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. బహిరంగ మార్కెట్లో రూ.70 నుడి 75 వరకు పలుకుతోంది. గత ఏడాది ఇదే సమయానికి 20 నుండి 25 రూపాయల ధర మాత్రమే ఉండటం గమనార్హం,.
ప్రభుత్వం ఏం చేస్తోంది...?
బియ్యం ధరలను రూ.47 దాటకుండా చూడాలని ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. మరోవైపు ధరలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతోంది. రైతు బజార్ల ద్వారా నిర్ణీత ధరలకే విక్రయించాలన్న ఆలోచన కూడా కార్యరూపం దాల్చడం లేదు. బయట అధిక ధరలకు విక్రయించేవారిపై కఠిన చర్యలు లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఎల్‌నినో కారణంగా ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌నినో అన్నది ఇప్పటికిప్పుడు వచ్చిన విపత్తేమా కాదు. కొన్ని నెలల నుండి దీని గురించి సంకేతాలు అందుతూనే ఉన్నాయి. అయినా, ప్రత్యామ్నాయ చర్యలను ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. బ్లాక్ మార్కెట్ చేస్తున్నారంటూ వ్యాపారులపై నిందను తోసివేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. బ్లాక్ మార్కెట్‌నె అరికట్టే బాధ్యత కూడా ప్రభుత్వానిదే కావడం గమనార్హం.







కామెంట్‌లు (0)