మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘కొటియా’పై ప్రభుత్వ మౌనముద్ర..

4 గంటల క్రితం

kotia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 04:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కటక్ సెంట్రల్ జైలులో ఇద్దరు గిరిజన నాయకులు

- కొరాపుట్ పోలీసుల నిర్బంధంలో ఐదుగురు

ప్రజాశక్తి-పార్వతీపురం :

వివాదాస్పద కొటియా గ్రామాల వివాదంపై రాష్ర్ట ప్రభుత్వం మౌనంగా ఉంది. తమకు ఆంధ్రా నాయకులు అండగా నిలబడితే తామే ఒడిశాతో పోరాడుతామని కొటియా గిరిజనులు చెబుతున్నా.. అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకుల నుంచి కనీస స్పందన లేదు. ఒడిశా తీరును విమర్శిస్తూ మొక్కుబడి ప్రకటనలివ్వడానికే ఆంధ్ర నాయకులు పరిమితం కావడంపై గిరిజనులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో, ఒడిశాలో, కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో నేతలు విఫలమవుతున్నారు.

గిరిజన పక్షపాతినని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బిజెపి అగ్రనేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఒడిశాలో బిజెపి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్‌డిఒ కూటమి అధికారంలో ఉన్నందున, ఆయన ఎందుకు చొరవతీసుకోవడం లేదని గిరిజన సంఘాలు పెదవి విరుస్తున్నాయి. టిడిపి కూటమి ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సంధ్యారాణి కేవలం పత్రికా సమావేశాలు నిర్వహించి ఒడిశా అధికారులు, పోలీసుల తీరును ఎండగడుతున్నారే తప్ప కొటియా గ్రామాలలో పర్యటించి గిరిజనులకు భరోసా ఇవ్వడం లేదు. నాలుగు దఫాలుగా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికైన మాజీ మంత్రి రాజన్నదొర కూడా టిడిపి ప్రభుత్వం పై రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు. ఇప్పటివరకూ సిపిఎం మాత్రమే కొటియా గిరిజనుల పక్షాన కొంతమేర పోరాడిందని, మిగిలిన ప్రధాన పార్టీలన్నీ చోద్యం చూస్తున్నాయని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే చొరవ చూపి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా నిర్దిష్ట పోరాట కార్యాచరణ రూపొందించాలని కొటియా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.

చొరవ చూపని ప్రభుత్వం

కొటియా గ్రామాలను చేజిక్కించుకోవడానికి ఒడిశా బిజెపి ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యాలు, బెదిరింపులకు ఉసిగొల్పుతోంది. వివాదాస్పద గ్రామాల గిరిజనులను బెదిరించైనా లొంగదీసుకునే ప్రయత్నంలో కొరాపుట్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ సహా పొట్టంగి సమితి అధికారులు నిత్యం కొటియా గ్రామాల ప్రజల కదలికల గురించి ఆరా తీస్తున్నారు. గ్రామాలలోకి ఆంధ్ర నాయకులు, అధికారులు రాకుండా ఎక్కడికక్కడ పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈనెల ఐదున ఎపిలో నిర్వహించిన ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో కొటియా గిరిజనులు ఓటు వేయకుండా ఉండేందుకు నానా ప్రయత్నాలు చేశారు. వచ్చేనెల రెండున జరుగనున్న మూడోవిడత పంచాయతీ ఎన్నికలనూ అడ్డుకునేందుకు ఒడిశా చూస్తోంది. వారి దౌర్జన్యం, బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చొరవ చూపడం లేదు.

నిర్బంధంలో గిరిజనులు

ఒడిశా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న తప్పుడు ఆరోపణలపై అరెస్టుగావించబడ్డ కొటియా గ్రామాలకు చెందిన ఇద్దరు గిరిజన నాయకులు చోడిపిల్లి భీషు, కూనేటి లివిరిలను కటక్ సెంట్రల్ జైలుకు తరలించారు. మరో ఐదుగురు గిరిజన నాయకులను కొరాపుట్ లో నిర్బంధంలో ఉంచారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ వీరిని విడిచిపెట్టేది లేదని కొరాపుట్ అధికారులు చెబుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్