కంచుకోటనూ కోల్పోయిన కాషాయదళం
జెన్ జి గట్టిదెబ్బ
డబుల్ ఇంజన్ సర్కార్‌కి బిగ్ ట్రబుల్
బంకీపూర్‌లో ఓటమిపై సర్వత్రా చర్చ
పాట్నా : బీహార్‌లోని బంకీపూర్‌లో ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ముప్పై ఏళ్ల ఆధిపత్యానికి తెర పడింది. కుక్కను అభ్యర్ధిగా పెట్టినా గెలుస్తామన్న అహంకారం బద్దలైంది. నీట్ లీక్ వ్యవహారంలో ఢిల్లీ నడి వీధుల్లో యువత తలలు పగలగోట్టిన డబుల్ ఇంజన్ సర్కార్ అందుకు మూల్యం చెల్లించుకుంది. జాతీయ పార్టీకి నాయకత్వం వహిసున్న నితిన్ నబిన్ తన సొంత నియోజకవార్గంలోనే పార్టీని గెలిపించుకోలేకపోయారు. 1995లో తొలిసారి ఈ స్థానాన్ని గెలుచుకున్న బిజెపి, అప్పటి నుంచి బంకిపూర్‌లో వరుసగా ఎనిమిది సార్లు విజయం సాధించింది. ఈ ఏడాది జనవరిలో నితిన్ నబిన్ బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం, ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికవడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ విజయంలో గమనించాల్సిన విషయాలు:
1995 నుంచి (2005 వరకు ఈ స్థానం పట్నా వెస్ట్‌గా పిలువబడేది) బంకిపూర్ బిజెపి చేతుల్లోనే ఉంది
బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వరుసగా నాలుగుసార్లు ఈ స్థానం నుంచే గెలిచారు
2010లో తొలిసారి 56 శాతం మెజారిటీతో గెలిచారు
అంతకుముందు 1995 నుంచి 2010 వరకు ఆయన తండ్రి నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు
తండ్రీకొడుకులిద్దరూ కలిపి వరుసగా 8 సార్లు గెలుపొందారు
ఫలించిన పికె వ్యూహం..
2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నెలల తరబడి పాదయాత్ర చేపట్టి బిహార్ రాజకీయాల్లోకి ఆర్భాటంగా అడుగుపెట్టిన ప్రశాంత్ కిషోర్, తొలి ఎన్నికల్లోనే ఘోర పరాజయం చవిచూశారు. జెఎస్‌పి ఒక్క సీటు కూడా గెలవలేదు; పోటీ చేసిన 238 స్థానాల్లో 236 చోట్ల డిపాజిట్ కోల్పోయింది. ఆ ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయని కిషోర్, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ప్రచారానికి నేతృత్వం వహించారు. అయితే, ఈసారి బంకిపూర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలన్న ఆయన నిర్ణయం రాజకీయంగా పెద్ద మలుపుతిప్పింది. గెలిస్తే పునరుజ్జీవం, ఓడితే పూర్తి నిష్క్రమణ ( మేక్-ఆర్-బ్రేక్) నినాదం ఫలించింది. పికె ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో కేంద్రబిందువుగా నిలిచారు. ప్రశాంత్ కిషోర్ 64,151 ఓట్లు సాధించి, బిజెపి అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 19,324 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తొమ్మిది నెలల క్రితం పార్టీ ఘోర పరాజయంచవిచూసిన తర్వాత, ఈ విజయం సంచలనంగా మారింది.
ఇది బిజెపికి బీహార్ ప్రజల సందేశం : ప్రశాంత్ కిషోర్
విజయానంతరం విలేకరులతో మాట్లాడుతూ కిషోర్, ఇది కేవలం ఎమ్మెల్యేను ఎన్నుకునే ఎన్నిక కాదని, బీజేపీ కేంద్ర నాయకత్వానికి బిహార్ ప్రజలు పంపిన సందేశమని అన్నారు. నేర చరిత్ర ఉన్న, వివాదాస్పద ప్రవర్తన కలిగిన వ్యక్తిని సీఎంగా కోరుకోవడం లేదని, విద్యను మెరుగుపరచి, యువతకు ఉపాధి కల్పించి, వలసలను ఆపగల మంచి ముఖ్యమంత్రిని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.
బిజెపిపై జనాగ్రహం..
లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ, బిజెపి, అమిత్ షా బిహార్ అభివృద్ధిపై, యువతకు ఉద్యోగాలు కల్పించడంపై, వలసలను ఆపడంపై దృష్టి పెట్టాలని కిషోర్ కోరారు. తాము కేవలం కాంట్రాక్టులు కట్టబెట్టడానికి ఎమ్మెల్యేలు కావాలని అనుకోవడం లేదని, బిహార్ అభివృద్ధే తమ ఏకైక లక్ష్యమని ప్రచారం చేశారు. అయితే 2025 ఎన్నికల్లో ఇవే అంశాలపై పోటీ చేసి ఓడిపోయిన కిషోర్, ఈసారి గెలవడం అభివృద్ధి ఎజెండాకు మద్దతు కంటే బిజెపిపై బీహార్ ప్రజల అసంతృప్తికి నిదర్శనమని పలువురు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా, నీట్-యుజి పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఆందోళనలు ఈ ఫలితంపై ప్రభావం చూపాయి.
విద్యార్థులపై ఎకె-47తో కాల్పులు..
గత నెల 25న సివాన్‌లో విద్యార్థి నిరసన సందర్భంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎకె-47 రైఫిల్‌తో కాల్పులు జరిపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రతిపక్ష నేత నేత తేజస్వీ యాదవ్ సిఎం సమ్రాట్ చౌధరిపై విరుచుకుపడ్డారు. "నిందితుడు సిఎం అయినప్పుడు, పోలీసులు అమాయక విద్యార్థులపై కాల్పులు జరుపుతారు" అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే, పికె విజయాన్ని బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిహార్ యువత ఇచ్చిన కీలక తీర్పుగా వామపక్షాలు అభివర్ణించారు. అహంకారపూరిత, అసమర్థ, నిరంకుశ బిజెపి ప్రభుత్వానికి బిహార్ యువత గట్టి దెబ్బ కొట్టారని వామపక్షాలు విమర్శించాయి. నితీశ్ కుమార్ నుంచి బిజెపి అధికారం చేపట్టాక ఏర్పడిన చౌధరి ప్రభుత్వానికి ఇది తొలి ఎన్నికల పరీక్ష కావడంతో, ఈ ఓటమి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే, ఈ ఫలితం ప్రధాన ప్రతిపక్షం ఆర్‌జెడిని కలవరపెడుతోంది. 2025 ఎన్నికల్లో పరాజయం అనంతరం కూడా క్షేత్రస్థాయిలో పెద్దగా చొరవ చూపలేదు. ఆర్‌జెడి అభ్యర్థి రేఖా కుమారి కేవలం 14,273 ఓట్లు మాత్రమే సాధించారు . 2025 ఎన్నికల్లో ఈ స్థానంలో రన్నరప్‌గా ఆమె సాధించిన 46,363 ఓట్ల కంటే 32,000 ఓట్లు తక్కువ. తేజస్వీ యాదవ్ ప్రచారం చేయకపోవడం గమనార్హం.

బంకీపూర్‌లో 30 సంవత్సరాలుగా బిజెపి ఆధిపత్యం ఆర్జేడి 2000,2005 (ఫిబ్రవరి), 2010, 2025 లో, కాంగ్రెస్ 2005(అక్టోబర్) 2015,2020 రన్నరప్ గా నిలిచాయి.








కామెంట్‌లు (0)