గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకృష్ణా జలాలపై తేలని పంచాయతీ

8 గంటల క్రితం

River Krishna comes alive with water – Prakasam Barrage gates lifted.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 06:02 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • కర్ణాటక తీరుపై కేంద్రానికి రాష్ట్రం ఫిర్యాదు

  • ఆల్మట్టి, అప్పర్ కృష్ణ, నవాలి ప్రాజెక్టులపై మళ్ళీ అభ్యంతరాలు

  • దక్షిణ భారత మండలి భేటీలోనూ ప్రస్తావన

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : దశాబ్దాలు గడుస్తున్నా నదీ జలాల వివాదాలకు పరిష్కారం లభించడం లేదు. ద్వైపాక్షిక చర్చలు లేకపోవడం న్యాయస్థానాలకు వెళ్లినా పరిష్కారాలు లభించకపోవడంతో వివాదాలు ముదురుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ భారత మండలి కౌన్సిల్ భేటీలో కూడా ఈ వివాదాలే చర్చకు వచ్చాయి. అన్ని రాష్ట్రాలు తమతమ రాష్ట్రాల జల వివాదాలను ఏకరువు పెట్టాల్సి వచ్చింది. మన రాష్ట్ర అధికారులు కూడా ఇవే అంశాలను కేంద్రానికి వివరించారు. ప్రధానంగా కృష్ణా నదిపై కర్ణాటకలో నిర్మిస్తున్న, మూడు దశాబ్దాలుగా చిక్కుముడితోనే ఉన్న ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్ కృష్ణ ప్రాజెక్టు, నివాలి ప్రాజెక్టులపైనే రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించింది. 2000 ఏప్రిల్ 25న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు ఆల్మట్టి డ్యామ్ నిర్మాణాన్ని +519.60 మీటర్ల వరకు మాత్రమే అనుమతించింది. డ్యామ్ ఎత్తును +524.256 మీటర్లకు పెంచే అంశాన్ని తగిన ట్రైబ్యునల్ మాత్రమే పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న ఇచ్చిన తీర్పులో కర్ణాటకకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తును +524.256 మీటర్లకు పెంచుకునేందుకు అనుమతించింది. దీంతో కర్ణాటక కేటాయింపు 173 టీఎంసీల నుంచి ఒక్కసారిగా 303 టిఎంసీలకు పెరిగిపోయింది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలు సుప్రీంకోర్టులో మళ్ళీ సవాలు చేశాయి. 2011 సెప్టెంబర్ 16న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం తదుపరి నివేదికను గెజిట్‌లో ప్రచురించకూడదని ట్రిబ్యినల్‌‌ను ఆదేశించింది. ఇప్పటికీ ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. వాస్తవానికి అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కింద 173 టిఎంసిల నీటిని వినియోగించుకునేలా ఆల్మట్టి డ్యామ్‌ను +519.60 మీటర్ల ఎత్తు వరకు నిర్మించారు. దీనివల్లనే ఆల్మట్టి డ్యామ్ ఎత్తును ఏకపక్షంగా 524 అడుగులకు పెంచేందుకు కూడా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అప్పర్ కృష్ణా పనులు ఆపాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ట్రిబ్యునల్ నివేదిక గెజిట్ ప్రచురణపై సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నందున, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ఫేజ్-3 పనులను కర్ణాటక కొనసాగించకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ ఏడాది మే 29న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. సుప్రీంకోర్టు ఆంక్షలు అమలులో ఉన్నాయని, కేసు ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని పేర్కొంది. దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎగువ రాష్ట్రాల్లో చేపట్టే ప్రాజెక్టులు ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఎగువ రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులను ప్రణాళిక చేసే సమయంలో దిగువ రాష్ట్రాల ప్రాథమిక నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని స్పష్టం చేసింది.

నవాలి ప్రాజెక్టుపైనా అభ్యంతరం

కర్ణాటక ప్రతిపాదించిన నవాలి ప్రాజెక్టుపైనా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం. తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడిక పేరుకుపోవడం వల్ల తుంగభద్ర ప్రాజెక్టు కింద తనకు కేటాయించిన నీటిని పూర్తిగా నియోగించుకోలేకపోతున్నామని చెబుతూ కర్ణాటక నవాలి వద్ద కొత్త రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 30 టిఎంసిల స్థూల నిల్వ సామర్థ్యంతో, +488 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో కొత్త రిజర్వాయర్ నిర్మించాలన్నది కర్ణాటక ప్రతిపాదన చేసింది. అయితే తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన నీటిని పూర్తిగా పొందలేకపోతోందని, కెసి కెనాల్‌కు నియంత్రిత నీటి విడుదలల్లోనూ సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో తుంగభద్ర రిజర్వాయర్ నుంచి మరింత నీటిని మళ్లిస్తే ఆంధ్రప్రదేశ్‌కు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని అభ్యంతరం తెలిపింది.

​బెడ్తి–హిరేవడత్తి లింక్‌పైనా...

కర్ణాటక చేపట్టిన మరో ప్రతిపాదన బెడ్తి–హిరేవడత్తి లింక్ ప్రాజెక్టు. దీనిని బెడ్తి నది నుంచి 18.51 టిఎంసిల నీటిని మళ్లించి, తుంగభద్ర లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కొత్త ఆయకట్టును అభివృద్ధి చేయాలని కర్ణాటక భావిస్తోంది. ఈ మళ్లింపు ద్వారా ఏర్పడే అదనపు నీటిలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా వాటా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అంతర్-లింక్ ప్రాజెక్టుపై తన అభిప్రాయాలను నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్‌కు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది.

​తుంగభద్రపై రెండు బ్రిడ్జ్-కమ్-బ్యారేజీలు

ఇవే కాకుండా కర్ణాటక మరో రెండు బ్రిడ్జ్-కమ్-బ్యారేజీల నిర్మాణాలను కూడా ప్రతిపాదించింది. రాయచూర్ జిల్లాలోని చిక్కమంచాలి సమీపంలో తుంగభద్ర నదిపై ఒకటి, చిక్కలపర్వి–కుంబలనూరు ప్రాంతంలో మరొకటి నిర్మించాలని ప్రతిపాదించింది. వీటి ద్వారా కర్ణాటకలోని ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రాలయం తదితర ప్రాంతాలతో అనుసంధానించాలన్నది ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర డిపిఆర్‌లను కోరింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న నీటి హక్కులు, వాటాలపై ఎలాంటి ప్రభావం ఉండకుండా ఖచ్చితమైన రక్షణ చర్యలు ఉండాలని కోరింది. వీటన్నింటినీ పరిష్కరించాలని కేందాన్ని రాష్ట్రము కోరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్