- డేటా సెంటర్లతో ప్రజల్లో భయాందోళన
- దేశంలో ఎక్కడాలేనివి ఇక్కడే ఎందుకంటూ ప్రశ్న
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : ‘రాష్ట్రంలోని డేటా సెంటర్లకు ఏడాదికి 3.50 టిఎంసిల నీరే సరిపోతుంది. ఈ ప్రాజెక్టుల నీటి అవసరాలపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారు’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష జరుపుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. వీటిపై విశాఖలో తాజాగా తీవ్ర చర్చ జరుగుతోంది. డేటా సెంటర్లకు పెద్ద మొత్తంలో నీరు అవసరమని మేధావులు, పర్యావేరణవేత్తలు చెబుతుంటే దానికి భిన్నంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో డేటా సెంటర్లు ఏర్పాటు కానున్న విశాఖలో ప్రస్తుతం తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. విశాఖ నగర పరిధిలోని ఆరిలోవ ప్రాంతంలో రెండు లక్షల మంది తాగునీటికి కటకటలాడుతున్నారు. కుళాయిల్లో మూడు, నాలుగు రోజులకుగానీ తాగు నీరు రావడం లేదని ఇటీవల అక్కడి ప్రజలంతా ఆందోళనలకు దిగారు. ఇప్పటికీ నీటి ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితులున్నాయి. నీటి ఎద్దడిని డేటా సెంటర్లు మరింత సంక్లిష్టం చేయనున్నాయని విశాఖ పౌరసమాజం, మేధావి వర్గం తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతోంది. దేశంలో ఎక్కడాలేని డేటా సెంటర్లు ఇక్కడే ఇంత పెద్ద మొత్తంలో ఎందుకంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడే ఎందుకు...
దేశంలో విశాఖ కంటే పెద్ద నగరాలు ముంబయి, కోల్‌కతా ఉన్నా విశాఖకు డేటా సెంటర్లు రావడానికి కారణం ఎపి ప్రభుత్వం ఉదారంగా భూమిని ఇస్తుండడమే. సముద్రం నుంచి కేబుల్ వ్యవస్థలు నేరుగా డేటా సెంటర్లకు వెళ్లనున్నాయి. ఇప్పటికే విశాఖ జిల్లాలో గూగుల్ డేటా సెంటర్‌ను ఆనందపురం మండలం తర్లు వాడలో 265 ఎకరాల్లో, విశాఖ నగరంలోని అడవివ రంలో 160 ఎకరాల్లో, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 175 ఎకరాల్లో ఏర్పాటుకు చంద్రబాబు సర్కారు అనుమతులు ఇచ్చింది. గూగుల్,
విశాఖకు తాగునీటి సవాళ్లు
అదానీ కలిసి తర్లువాడలో మెగా డేటా సెంటర్‌ను సుమారు రూ.24 వేల కోట్లతో, రాంబిల్లిలో రూ.21,400 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. మూడేళ్లలో వాటి పనులను పూర్తి చేయాలని టిడిపి కూటమి ప్రభుత్వం లక్ష్యం. అడవివరం వద్ద సింహాచలం దేవస్థానం భూమిలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ పట్ల ఆరిలోవ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముడసర్లోవ రిజర్వాయర్ పక్కనే ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఆ రిజర్వాయర్‌లో నీటిమట్టం అడుగంటింది.
నీరు ఎక్కడ నుంచి ఇస్తారు?
డేటా సెంటర్లలో భారీ సర్వర్లను చల్లబరిచేందుకు రోజూ లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఈ నీటిని కూడా ఇప్పటికే విశాఖకు తాగునీరందించే వనరుల నుంచే ఇవ్వాలని చంద్రబాబు సర్కారు చెబుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక గిగావాట్‌కు 1.86 టిఎంసి నీరు అవసరం అంటే 161 మిలియన్ లీటర్లు రోజుకు కావాలి. పోలవరం పూర్తయితేగానీ నీటి సమస్య పరిష్కారం కాదు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ ప్రాజెక్టు ఈ రెండేళ్లలో పూర్తయి విశాఖకు నీరు వస్తుందన్న గ్యారెంటీ లేదు. 2040 నాటికి 1,500 ఎంఎల్‌డి నీటి అవసరం డేటా సెంటర్లకు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. అంత పెద్ద మొత్తంలో నీరు ఎక్కడి నుంచి వస్తుందన్నది శేష ప్రశ్న.






కామెంట్‌లు (0)