సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
అక్షరం ఒక్కటే – అది చీకట్లో వెలుగు తెస్తుంది.. అజ్ఞానంలో జ్ఞానం నింపుతుంది.. బానిసత్వంలో స్వేచ్ఛను ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. 1966లో యునెస్కో ప్రకటించిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2026కి చేరుకుని, సరిగ్గా 60 ఏళ్ల తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా యునెస్కో నిర్దేశించిన నేపథ్యం – "ప్రజలకు, భూగోళానికి, అభ్యున్నతికి అక్షరాస్యత" (Literacy for people, planet and prosperity) – కేవలం పాఠ్యపుస్తకపు నినాదం కాదు; అది నేటి మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లకు పరిష్కారం. ప్రపంచంలో ఇంకా 739 మిలియన్ల మందికి అక్షరాస్యత లేకపోవడం, భారతదేశంలో 80.9% సగటు అక్షరాస్యత ఉన్నా 22% పైగా ప్రజలు ఇంకా నిరక్షరాస్యులుగా ఉండటం, ప్రత్యేకించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 72.6%తో దేశంలోనే అడుగున, తెలంగాణ 76.9%తో జాతీయ సగటు కంటే వెనుకబడి ఉండటం – ఇవన్నీ ఈ రోజు మనం ఆగి ఆలోచించాల్సిన వాస్తవాలు.
అక్షరాస్యత అనేది గణాంకాల పట్టికలోని సంఖ్య కాదు; అది ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసం, ఒక కుటుంబం ఆర్థిక స్థిరత్వం, ఒక సమాజం ప్రజాస్వామ్య శక్తి. ఒక దేశం భవిష్యత్తు పునాది. ఈ 60వ వార్షికోత్సవ సందర్భంగా ప్రపంచ వేదిక నుండి మన గ్రామాల వరకూ, అక్షరం వల్ల కలిగే పరివర్తన.. ఇంకా మిగిలిన సవాళ్లు, ఆ సవాళ్లను అధిగమించే ఉద్యమాల ఆవశ్యకత అంతే అవసరం. ఎందుకంటే, అక్షరం చదివిన ప్రతి ఒక్కరూ ఒక కొవ్వొత్తి వెలిగించినట్లే – ఆ వెలుగు ఒంటరిది కాదు, అది లక్షల కొవ్వొత్తులను వెలిగించే శక్తి కలిగి ఉంటుంది. అక్షరాస్యత ఒక ప్రాథమిక మానవ హక్కు. ఇది ఇతర మానవ హక్కుల ఆస్వాదనకు, స్వేచ్ఛకు, ప్రపంచ పౌరసత్వానికి తలుపులు తెరుస్తుంది. నేటి డిజిటల్ యుగంలో కేవలం చదవడం, రాయడం మాత్రమే సరిపోదు. మీడియా, సమాచార అక్షరాస్యతను కూడా పాఠ్యాంశాల్లో భాగం చేయాలని యునెస్కో సూచిస్తోంది.
ప్రపంచంలో పురోగతి.. సవాళ్లు
ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత రంగంలో గణనీయమైన పురోగతి సాధించారు. యునెస్కో గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 86% కంటే ఎక్కువ మంది చదవడం, రాయడం వచ్చు. 1979లో ఇది కేవలం 68% మాత్రమే. యువత (15-24 సంవత్సరాలు) అక్షరాస్యత రేటు 93% కాగా, వయోజన అక్షరాస్యత రేటు 88%గా ఉంది. అయితే ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. 2024 నాటికి కనీసం 73.9 కోట్ల మంది యువకులు, వయోజనులు ప్రాథమిక అక్షరాస్యతా నైపుణ్యాలు లేకుండానే ఉన్నారు. వీరిలో మూడింట రెండొంతుల మంది మహిళలు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా 10 మంది పిల్లల్లో నలుగురు చదవడంలో కనీస నైపుణ్యాన్ని కూడా సాధించడం లేదు. 2023లో 27.2 కోట్ల మంది పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు పాఠశాలకు దూరంగా ఉన్నారు. ప్రాథమిక పాఠశాల పూర్తి చేయాల్సిన వయస్సులో, సగం మంది విద్యార్థులు మాత్రమే చదవడంలో కనీస ప్రావీణ్యతను సాధిస్తున్నారు. ఉప-సహారా ఆఫ్రికాలో 29% మంది యువకులు మాత్రమే ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేస్తుంటే, ప్రపంచ సగటు 62% అక్షరాస్యతలో ప్రాంతీయ అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్షరాస్యత పేదరికాన్ని తగ్గిస్తుంది, ఉపాధి అవకాశాలను పెంచుతుంది. ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మహిళలు అక్షరాస్యులైతే వారి కుటుంబాల ఆరోగ్యం, విద్యపై, ముఖ్యంగా బాలికల విద్యపై తక్షణ ప్రభావం పడుతుంది.
భారతదేశంలో..
భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు అక్షరాస్యత రేటు కేవలం 14% మాత్రమే. నేటికి భారతదేశం అక్షరాస్యత రంగంలో కొంతమేరకు పురోగతి సాధించింది. 2023-24 నాటికి ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారిలో భారతదేశ సగటు అక్షరాస్యత రేటు 80.9%కి చేరుకుంది. పురుషుల అక్షరాస్యత 87.2% కాగా, మహిళల అక్షరాస్యత 74.6%. మొత్తం లింగ అంతరం 14.4 శాతం పాయింట్లుగా ఉంది. అయితే యువత (15-24 సంవత్సరాలు) మధ్య ఈ అంతరం 3.8 శాతం పాయింట్లకు తగ్గడం గమనార్హం. ఇది యువతరంలో అక్షరాస్యత వేగంగా పెరుగుతున్నదని సూచిస్తుంది.
దేశంలో రాష్ట్రాల వారీగా అక్షరాస్యతలో పెద్ద తేడాలు కనిపిస్తున్నాయి. మిజోరం 98.2% అక్షరాస్యతతో అగ్రస్థానంలో ఉండగా, లక్షద్వీప్ 97.3%, నాగాలాండ్ 95.7%, కేరళ 95.3% అక్షరాస్యత కలిగి ఉన్నాయి. మేఘాలయ (94.2%), త్రిపుర (93.7%), చండీగఢ్ (93.7%), గోవా (93.6%), పుదుచ్చేరి (92.7%), మణిపూర్ (92%) వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అధిక అక్షరాస్యత కలిగి ఉన్నాయి.
భారత ప్రభుత్వం అక్షరాస్యతను పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. సార్వత్రిక విద్యా హక్కు చట్టం, సర్వ శిక్షా అభియాన్, ఉన్నత విద్యలో రిజర్వేషన్లు, డిజిటల్ సాక్షరత కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. గ్రామీణ-పట్టణ అంతరం, లింగ అంతరం, సామాజిక-ఆర్థిక అంతరాలు ఇంకా సవాలుగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వాస్తవాలు
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రెండూ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
PLFS 2023-24 సర్వే డేటా ప్రకారం అక్షరాస్యత రేటు 72.6%. ఇది భారతదేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత రేటు. ఈ విషయంలో బీహార్ (74.3%) కూడా ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగ్గా ఉంది. నీతి ఆయోగ్ 2026 మేలో విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పూర్తయ్యాక ఇంటర్మీడియట్ కు వెళ్లే విద్యార్థుల సగటు 76% కాగా, 24% మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. మాధ్యమిక స్థాయిలో చదువు మానేస్తున్న వారి సంఖ్య 15.5%గా అత్యధికంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతోంది.
తెలంగాణ అక్షరాస్యత రేటు 76.9%గా ఉంది. 2011 జనగణనలో ఇది 72% ఉండగా, ఒక దశాబ్దంలో 76.9%కి పెరిగింది. తెలంగాణలో 18-24 సంవత్సరాల వయస్సు గలవారిలో అక్షరాస్యత రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. ఈ వయస్సు వారిలో పురుషుల అక్షరాస్యత 90%, మహిళల అక్షరాస్యత 79.5%. ఉన్నత విద్యలో స్త్రీల నమోదు 41.6% కాగా, పురుషుల నమోదు 38.5%. ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానంలో తెలంగాణ గణనీయమైన పురోగతి సాధించింది. 2025-26 FLN అసెస్మెంట్ ప్రకారం, 35% మంది విద్యార్థులు దాదాపు అన్ని వాక్యాలను చదవగలరు. ఇది 2022-23 అసెస్మెంట్ (9%) కంటే నాలుగు రెట్లు మెరుగు. తెలుగు వాక్యాల పఠనం 35%కి, ఆంగ్లం 4% నుండి 29%కి, ఉర్దూ 40%కి చేరుకుంది.
సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాలు..
భారతదేశంలో 'సంపూర్ణ అక్షరాస్యత' (100% అక్షరాస్యత) అనేది ఒక గణాంకపరమైన లక్ష్యం మాత్రమే కాదు; అది ఒక రాష్ట్రం యొక్క సామాజిక, ఆర్థిక, పాలనా పరిపక్వతకు నిదర్శనం. ఇటీవలి సంవత్సరాలలో, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉల్లాస్ (ULLAS) కార్యక్రమం వల్ల, అనేక రాష్ట్రాలు ఈ లక్ష్యాన్ని సాధించాయి.
మిజోరం2025 మే 20న, మిజోరం అధికారికంగా భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మొదటి రాష్ట్రంగా ప్రకటించబడింది. ఆ సమయంలో దాని అక్షరాస్యత రేటు 98.2%గా ఉంది. మిజోరం తర్వాత, గోవా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రెండవ రాష్ట్రంగా అవతరించింది. ఇది 99.72% అక్షరాస్యత రేటును కలిగి ఉంది. త్రిపు 2025 జూన్ 23న, మూడవ రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించబడింది. దీని అక్షరాస్యత రేటు 95.6%గా ఉంది.
ఈ రాష్ట్రాలు 95% కంటే ఎక్కువ అక్షరాస్యత రేటును కలిగి ఉన్నప్పటికీ, '100%' అనేది ఒక ప్రకటనాత్మక లక్ష్యం. వాస్తవ ప్రపంచంలో, జనాభా గణాంకాలలో చిన్న లోపాలు, లేదా చాలా మారుమూల ప్రాంతాల్లో నిరక్షరాస్యులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి, ఇది ఆ రాష్ట్రాలు దాదాపు సార్వత్రిక అక్షరాస్యతను సాధించాయని సూచిస్తుంది.
కేరళ విషయంలో ఒక ప్రత్యేకత. సాధారణ అక్షరాస్యతలో కేరళ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, దాని అక్షరాస్యత రేటు 95.3%. అయితే, కేరళ 100% డిజిటల్ అక్షరాస్యత సాధించిన మొదటి భారతీయ రాష్ట్రంగా ప్రకటించబడింది. అంటే, కేరళలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ సాధనాలను ఉపయోగించడం వచ్చని అర్థం.
అక్షరాస్యత ఉద్యమాల ఆవశ్యకత..
దేశంలో అక్షరాస్యత ఉద్యమాల ఆవశ్యకత గురించి మాట్లాడుకోవాలంటే, మొదట కొన్ని మౌలిక వాస్తవాలను అర్థం చేసుకోవాలి. ప్రపంచ బ్యాంకు ప్రమాణాల ప్రకారం, 2011 జనగణన నాటికి భారతదేశంలో 15 ఏళ్లు పైబడిన వారి అక్షరాస్యత రేటు 69.3% మాత్రమే. ఇది మనం సాధారణంగా చెప్పుకునే 80.9% (7 ఏళ్లు పైబడిన వారి) సంఖ్యకు చాలా భిన్నంగా ఉంటుంది. ఈ 11 శాతం పాయింట్ల అంతరం, మన దేశంలో పెద్దల అక్షరాస్యత ఇంకా ఎంత లోతైన సవాలుగా ఉందో చెబుతుంది. ఈ అంతరంలో ఉన్న వారు యాదృచ్ఛికంగా కాదు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, దళితులు, ఆదివాసీలు, కాలానుగుణ వలస కూలీలు, మారుమూల ప్రాంతాల ప్రజలు. భారతీయ విద్యావ్యవస్థ శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, పేదరికం వలసల కారణంగా ఈ వర్గాలను చాలా వరకు విద్యా పరిధిలోకి తీసుకురాలేకపోయింది. ఈ సామాజిక వాస్తవాలను గుర్తించకుండా కేవలం సగటు గణాంకాలతో సంతృప్తి చెందడం సరికాదు . ఇక్కడే అక్షరాస్యతా ఉద్యమాల ఆవశ్యకత నిజంగా మొదలవుతుంది. అక్షరాస్యత అనేది కేవలం అక్షరాలు చదవడం, రాయడం మాత్రమే కాదు. ఈ నాటి సాంకేతిక యుగంలో, దాని నిర్వచనం చాలా విస్తృతమైంది. నేడు అక్షరాస్యత అంటే లెక్కలు చేయడం, డిజిటల్ సాధనాలను ఉపయోగించడం, ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడం, పౌర జీవితంలో పూర్తిగా పాల్గొనే సామర్థ్యం కూడా. మధ్యప్రదేశ్ టోని ఒక చిన్న గ్రామంలో దియా బాయి అనే మహిళ ఒకప్పుడు బ్యాంకు నుండి డబ్బు తీసుకోవడానికి లేదా ఏదైనా పథకానికి దరఖాస్తు చేయడానికి ఇతరుల సహాయం కోసం ఎదురుచూసేది. నేడు, ఆమె స్వయంగా ఆ పనులు చేయడమే కాకుండా, తన గ్రామంలోని ఇతర మహిళలకు మార్గదర్శిగా నిలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాస్యత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, జాతీయ సగటు (80.9%) కంటే ఇంకా వెనుకబడి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, మహిళల్లో అక్షరాస్యత మరింత తక్కువగా ఉండటం ఆందోళనకరం.
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2026 అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను, దాని 60 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకునే సందర్భం. మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అక్షరాస్యతను పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే మరింత వేగవంతమైన కృషి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, లింగ అసమానతల తొలగింపు, నాణ్యమైన విద్యా బోధన అవసరం. ఎందుకంటే అక్షరాస్యత కేవలం అక్షరాలను గుర్తించడం మాత్రమే కాదు – అది వ్యక్తి స్వేచ్ఛకు, సమాజ అభివృద్ధికి, దేశ ప్రగతికి పునాది.
విద్యశ్రీ
9866371283







కామెంట్‌లు (0)