ఆత్మహత్య అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని తానే ఉద్దేశ్యపూర్వకంగా ముగించుకునే చర్య. సాధారణంగా తీవ్రమైన మానసిక వేదన, నిరాశ, నిస్సహాయత, ఒత్తిడి, సమస్యలకు పరిష్కారం కనిపించని పరిస్థితుల్లో వ్యక్తికి ఈ ఆలోచనలు రావచ్చు. అయితే ఆత్మహత్యను కేవలం ఒక కారణంతో వివరించలేం. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ లేదా సంబంధాల సమస్యలు, ఉద్యోగం, చదువులో ఒత్తిడి, సామాజిక ఒంటరితనం, అవమాన భావన, తీవ్రమైన మానసిక క్షోభ వంటి అనేక అంశాలు పరస్పరం కలిసి ప్రభావం చూపొచ్చు. ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆత్మహత్య ఆలోచన వచ్చినప్పుడు వ్యక్తి తప్పనిసరిగా చనిపోవాలనే కోరికతోనే ఉంటాడని కాదు. చాలా సందర్భాల్లో తన బాధ నుంచి బయటపడటానికి మార్గం కనిపించక నిస్సహాయ స్థితికి చేరుకున్నప్పుడు అలాంటి ఆలోచనలు రావొచ్చు. సరైన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, వైద్యులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి సహాయం అందితే పరిస్థితిని మార్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆత్మహత్యను వ్యక్తిగత బలహీనతగా కాకుండా, తీవ్రమైన సంక్షోభానికి సంకేతంగా చూడాలి. ఆత్మహత్య గురించి మాట్లాడుతున్న వ్యక్తిని విమర్శించకుండా, శ్రద్ధగా వినడం, ఒంటరిగా వదిలిపెట్టకుండా సహాయం అందించడం చాలా ముఖ్యం. ఆత్మహత్య అనేది కేవలం మానసిక వైద్యులు మాత్రమే సరిచేసే సమస్య కాదు. ఇది కుటుంబం, విద్యా, ఉపాధి వ్యవస్థ, ఆర్థిక విధానాలు, ఆరోగ్య వ్యవస్థ, సమాజం మొత్తం కలిసి పరిష్కరించాల్సిన సమస్య.
ఆత్మహత్య అనేది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు. అది ఒక కుటుంబంలో ఏర్పడే శూన్యత. ఒక తల్లిదండ్రుల జీవితకాల వేదన. ఒక జీవిత భాగస్వామికి తీరని నష్టం. పిల్లలకు జీవితాంతం వెంటాడే మానసిక గాయం. ఒక సమాజం కోల్పోయే మానవ వనరు. ఆత్మహత్య అనివార్యమైనది కాదు. చాలా సందర్భాల్లో సరైన సమయంలో గుర్తించి, సత్వర సహాయం అందిస్తే నివారించగలిగే ప్రజారోగ్య సమస్య. ఆత్మహత్యల నివారణకు సంబంధించి ఒక ప్రత్యేక రోజు ఉండాలని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (ఐఎఎస్‌పి), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) భావించాయి. దీనికి అనుగుణంగా ఏటేటా సెప్టెంబరు 10న 'ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం’గా జరుపుకోవాలని ఈ రెండు సంస్థలు తీర్మానించాయి. 2003 నుంచి ఏటేటా దీన్ని నిర్వహిస్తున్నారు. ఆత్మహత్యలను ఆపగలం. ఒక మాట, ఒక చేయూత, ఒక సంభాషణ ప్రాణాన్ని నిలబెట్టగలదు. ఆత్మహత్య గురించి మాట్లాడటం వల్ల ఆలోచన పెరగదు. మాట్లాడకపోవడం వల్ల సహాయం ఆలస్యం కావొచ్చు.
చారిత్రక నేపథ్యం
ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలను నివారించే ఉద్దేశంతో 1960లో ఎర్విన్ రింగెల్, నార్మన్ ఫార్బెరో 'ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (ఐఏఎస్పీ)' అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. తర్వాతి కాలంలో ఇది డబ్ల్యూహెచ్ ఓకి అనుబంధంగా పనిచేస్తూ వచ్చింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం (World Suicide Prevention Day)గా నిర్వహిస్తున్నారు. 2003లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (IASP), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహకారంతో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సంవత్సరం కూడా 2024–2026 త్రైవార్షిక ప్రధాన సందేశం “Changing the Narrative on Suicide”
“ఆత్మహత్యపై మన దృక్పథాన్ని మార్చుకుందాం.. మౌనం నుంచి సంభాషణ వైపు అడుగులు వేయిద్దాం”
అనే అంశంతో ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రజారోగ్యానికే తీవ్ర సవాల్
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 7.2 లక్షలకు పైగా ప్రజలు ఆత్మహత్యల వల్ల మరణిస్తున్నారు. నమోదైన ప్రతి ఆత్మహత్య వెనుక అనేక ఆత్మహత్యా ప్రయత్నాలు ఉంటాయి. ఒక వ్యక్తి మరణం కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు, సమాజంపై దీర్ఘకాలిక మానసిక, సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమిటంటే 15 - 29 సంవత్సరాల వయస్సు గల యువతలో ఆత్మహత్య ప్రధాన మరణ కారణాల్లో మూడో స్థానంలో ఉంది. ప్రపంచ ఆత్మహత్యల్లో సుమారు 73 శాతం తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాల్లోనే సంభవిస్తున్నాయి.
ప్రపంచంలో..
ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఆత్మహత్య మరణాలు 7.2 లక్షలకు పైగా ఉంటున్నాయి. అధిక ప్రభావిత వయస్సు గలవారు యువతీ, యువకులే. ముఖ్యంగా 15–29 సంవత్సరాల వయస్సు వాళ్లలోనే ఈ కేసులు నమౌదవుతున్నాయి. ప్రధాన మరణ కారణాల్లో 3వ స్థానంలో యువత సంఖ్య ఉంది. తక్కువ,మధ్యస్థ ఆదాయ దేశాల్లో సంభవిస్తున్న వాటా సుమారు 73 శాతం. ప్రతి నమోదైన మరణానికి అనేక ఆత్మహత్యా ప్రయత్నాలు ఉండొచ్చు.
మనదేశంలో
అధిక జనాభా కలిగిన మన దేశంలో ఆత్మహత్యలు ఒక ముఖ్యమైన ప్రజారోగ్య, సామాజిక సమస్యగా మారాయి. NCRB ప్రతి సంవత్సరం విడుదల చేసే నివేదికలు ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశంలో సంవత్సరానికి 1.7 లక్షలకు పైగా ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. అయితే సంఖ్యలను కేవలం గణాంకాలుగా చూడకూడదు. ప్రతి సంఖ్య వెనుక ఒక వ్యక్తి జీవిత కథ, ఒక కుటుంబం, ఒక అసంపూర్తి కల, ఒక పరిష్కారం కాని సమస్య ఉంటుంది.
• వార్షిక ఆత్మహత్యల సంఖ్య : సుమారు 1.7 లక్షలకు పైగా
• ప్రధానంగా ప్రభావిత వర్గాలు: యువత, మధ్య వయస్సు వ్యక్తులు
• పురుషులు : సంఖ్యాపరంగా అధికంగా నమోదవుతారు
• మహిళలు : కుటుంబ, వివాహ, సామాజిక, మానసిక ఒత్తిళ్ల ప్రభావం గణనీయం
• ముఖ్యవృత్తుల వారు : రోజువారీ కూలీలు, స్వయం ఉపాధి, వ్యవసాయ రంగం, ఉద్యోగులు, విద్యార్థులు • ముఖ్య కారణాలు : కుటుంబ, మానసిక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, సంబంధ సమస్యలు తదితరాలు NCRB గణాంకాలు ఆత్మహత్య ఒకే కారణంతో జరిగే సంఘటన కాదని స్పష్టం చేస్తున్నాయి. వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక, మానసిక అంశాలు పరస్పరం కలిసినప్పుడు ప్రమాదం పెరుగుతుంది.
మన రాష్ట్రంలో పరిస్థితి..
రాష్ట్రంలో కూడా ఆత్మహత్యలు ఒక ప్రధాన సామాజిక, ప్రజారోగ్య సవాలుగా కొనసాగుతున్నాయి. NCRB ఆధారిత అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇటీవలి సంవత్సరాలలో వేలాది కుటుంబాలు ఆత్మహత్యల కారణంగా తమ కుటుంబ సభ్యులను కోల్పోయాయి.
20175,354
20185,319
20196,465
20207,043
20218,067
20228,908
20238,684
వాస్తవ పరిస్థితులు ఏమిటంటే..
NCRB యొక్క Accidental Deaths & Suicides in India (ADSI) 2024 గణాంకాలు భారతదేశంలో ఆత్మహత్యల తీవ్రతను మరోసారి గుర్తుచేస్తున్నాయి. 1,70,746, 2024లో మనదేశంలో నమోదైన ఆత్మహత్యలు. అంటే సగటున రోజుకు సుమారు 467 మంది ఆత్మహత్య కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మరొక విధంగా చెప్పాలంటే సుమారు ప్రతి మూడు నిమిషాలకు ఒక వ్యక్తి ఆత్మహత్య కారణంగా ప్రాణాలను కోల్పోతున్నాడు. ఇది కేవలం ఒక గణాంకం కాదు. ప్రతి మూడు నిమిషాలకు ఒక కుటుంబం శాశ్వతంగా మారిపోతోంది. NCRB గణాంకాల్లో నమోదైన ముఖ్యమైన అంశాల్లో 33.2 శాతం ఆత్మహత్యల్లో కుటుంబ సమస్యలు ప్రధాన కారణాల్లో ఒకటిగా నమోదయ్యాయి. ఇది మన కుటుంబ వ్యవస్థల్లో సంభాషణ, భావోద్వేగ మద్దతు, సమస్య పరిష్కార నైపుణ్యాల అవసరాన్ని స్పష్టం చేస్తోంది.
కేవలం మానసిక వ్యాధి మాత్రమే కాదు
ఆత్మహత్యకు సంబంధించిన చర్చలో మనం ఒక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి. “ఆత్మహత్య చేసుకున్న ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఒక మానసిక వ్యాధి ఉంటుంది” అని చెప్పడం సరైన శాస్త్రీయ దృక్పథం కాదు.
అయితే
• డిప్రెషన్
• బైపోలార్ డిజార్డర్
• మత్తు పదార్థాల వినియోగ సమస్యలు
• తీవ్రమైన ఆందోళన
• వ్యక్తిత్వ సమస్యలు
వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులు ఆత్మహత్య ప్రమాదాన్ని పెంచొచ్చు. అదే సమయంలో కుటుంబ కలహాలు, ఆర్థిక సంక్షోభం, సంబంధ విరహం, అనారోగ్యం, సామాజిక అవమానం వంటి పరిస్థితులు కూడా తీవ్రమైన మానసిక సంక్షోభానికి దారితీయొచ్చు. అందువల్ల ఆత్మహత్యను ఒకే కారణంతో వివరించలేం. ఇది జీవసంబంధ, మానసిక, సామాజిక అంశాల సంక్లిష్ట పరస్పర ప్రభావం.
హెచ్చరిక సంకేతాలను గుర్తిద్దాం
ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్న ప్రతి వ్యక్తి ఒకే విధంగా ప్రవర్తించరు. అయితే చాలామందిలో వారి మాటలు, ప్రవర్తన, భావోద్వేగాల్లో మార్పులు కనిపించొచ్చు.
ప్రత్యేకంగా ఈ మార్పులు
• అకస్మాత్తుగా ప్రారంభమైతే
• గతంలో లేని విధంగా పెరిగితే
• ఏదైనా తీవ్రమైన నష్టం లేదా సంఘటన తరువాత కనిపిస్తే.. వాటిని అత్యంత జాగ్రత్తగా గమనించాలి.
1. మాటల్లో కనిపించే హెచ్చరిక సంకేతాలు వ్యక్తి ఇలా మాట్లాడొచ్చు
• నేను ఒక ఉచ్చులో చిక్కుకున్నట్లు ఉంది
• నేను అందరికీ భారంగా మారాను
• నా జీవితానికి అర్థం లేదు
• ఇక జీవించడానికి కారణం కనిపించడం లేదు
• ఈ బాధను నేను భరించలేకపోతున్నాను
• నేను చనిపోతే బాగుంటుంది
• నేను లేకపోతే మీ అందరికీ మంచిది.. ప్రత్యేకంగా నేను చనిపోవాలని అనిపిస్తోంది ఇక జీవించడం ఇష్టం లేదు.. వంటి మాటలను అత్యవసర హెచ్చరిక సంకేతాలుగా తీసుకోవాలి.
2. ప్రవర్తనలో హెచ్చరిక సంకేతాలు
• కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి దూరం కావడం
• ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించడం
• విలువైన వస్తువులను ఇతరులకు ఇచ్చేయడం
• అకస్మాత్తుగా వ్యక్తిగత వ్యవహారాలను ముగించే ప్రయత్నం చేయడం
• మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం పెరగడం
• నిద్ర ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉండటం
• చదువు లేదా ఉద్యోగ పనితీరు తగ్గడం
• గతంలో ఆసక్తి ఉన్న కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం
• ఇంటర్నెట్‌లో ప్రమాదకరమైన స్వీయ హాని లేదా ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం వెతకడం ఇలాంటి మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు.
3. భావోద్వేగాల్లో సంకేతాలు
• తీవ్రమైన నిరాశ
• అధిక ఆందోళన
• కోపం
• చిరాకు
• తీవ్రమైన మూడ్ మార్పులు
• నిస్సహాయత
• జీవితంపై ఆసక్తి కోల్పోవడం
ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం.. తీవ్రంగా బాధపడుతున్న వ్యక్తి అకస్మాత్తుగా అసాధారణ ప్రశాంతత లేదా ఉపశమనం చూపితే కూడా దానిని గమనించాలి. కొన్ని సందర్భాల్లో వ్యక్తి అంతర్గతంగా తీవ్రమైన నిర్ణయానికి వచ్చిన తరువాత బయటకు ప్రశాంతంగా కనిపించే అవకాశం ఉంటుంది.
4. తక్షణ ప్రమాద సంకేతాలు
• తీవ్రమైన ఆందోళనతో అటూ ఇటూ తిరగడం
• ఒకే భయం లేదా ఆలోచనపై పదేపదే ఆలోచిస్తూ ఉండటం
• ఎవరూ ఓదార్చలేని స్థాయిలో తీవ్ర మానసిక కలత
• అనేక రోజులుగా తీవ్రమైన నిద్రలేమి
• మత్తు పదార్థాల వినియోగం పెరగడం
• వాస్తవానికి సంబంధం లేని తీవ్రమైన భయాలు లేదా నమ్మకాలు
• ఏదో భయంకరమైనది జరగబోతోంది అనే తీవ్రమైన భావన ఇలాంటి పరిస్థితుల్లో తక్షణ వృత్తిపరమైన సహాయం అవసరం.
నేరుగా అడగండి
ఆత్మహత్య నివారణలో అత్యంత ముఖ్యమైన నైపుణ్యాల్లో ఒకటి.సూటిగా, కానీ సున్నితంగా ప్రశ్నించడం.
మనలో చాలామంది అడగడానికి భయపడతారు. కానీ సరైన ప్రశ్న వ్యక్తి జీవితంలో ఒక కీలక మలుపు కావొచ్చు.
అస్పష్టమైన ప్రశ్నలను నివారించండి
ఏదైనా పిచ్చి పని చేయబోవడం లేదు కదా?
నువ్వు ఏమీ చేసుకోబోవడం లేదు కదా?
ఇది కేవలం తాత్కాలిక దశ మాత్రమే కదా?
ఇలాంటి ప్రశ్నలు వ్యక్తిని తన అసలు భావాలను చెప్పకుండా నిరోధించొచ్చు
సూటిగా అడగండి
సున్నితమైన స్వరంతో ఇలా అడగొచ్చు. నీకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయా?. నీ జీవితాన్ని ముగించుకోవాలనే ఆలోచనలు ఇటీవల వస్తున్నాయా?. ఇంత తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు కొంతమందికి ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. నీకు కూడా అలాంటి ఆలోచనలు వస్తున్నాయా?.
ఇలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు
• భయపడకండి
• షాక్ అయినట్లు ప్రవర్తించకండి
• తీర్పు ఇవ్వకండి
• ఉపన్యాసం ఇవ్వకండి
ఎవరైనా తమకు ఆత్మహత్య ఆలోచనలు ఉన్నాయని చెబితే మొదట ప్రశాంతంగా ఉండండి. నువ్వు ఇలా ఎలా ఆలోచించగలిగావు? అని కోప్పడకండి. “అది పాపం” లేదా “అలా చేయడం తప్పు” అని వాదించకండి. వారిని తప్పుపట్టడం కన్నా ముందుగా వారి బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
వ్యక్తితోనే ఉండండి..
తీవ్రమైన ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తే వ్యక్తిని ఒంటరిగా వదిలేయకండి. ఫోన్‌లో మాట్లాడుతున్నట్లయితే వీలైనంత వరకు లైన్‌లో ఉండండి. సమీపంలోని నమ్మకమైన కుటుంబ సభ్యుడు లేదా వ్యక్తిని వెంటనే సంప్రదించేలా చూడండి. ‘నువ్వు ఒంటరివి కాదు. మనం కలిసి సహాయం తీసుకుందాం’ అని భరోసా ఇవ్వండి.
తీర్పు చెప్పొద్దు ..
వారి సమస్యను వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వ్యక్తికి కావాల్సింది ఎవరో ఒకరు తన బాధను వినడం.
ఇలా చెప్పొచ్చు.
• నువ్వు చాలా బాధలో ఉన్నట్లు నాకు అర్థమవుతోంది
• ఇది నీకు ఎంత కష్టంగా ఉందో నేను ఊహించగలను
• నువ్వు ఒంటరిగా దీనిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు
• మనం కలిసి సహాయం పొందుదాం
• ప్రమాదకరమైన వస్తువులను దూరం పెట్టాలి.
• వృత్తిపరమైన సహాయంతో కలపండి. మీరు చికిత్స చేయాల్సిన అవసరం లేదు.
మీ పాత్ర సహాయం వైపు ఒక వంతెన కావడం..
• సైకాలజిస్ట్
• సైకియాట్రిస్ట్
• సమీప ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రి
• అత్యవసర వైద్య సేవలు
• మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్ వంటి సరైన సేవలతో కలపాలి.
తీవ్రమైన లేదా తక్షణ ప్రమాదం ఉంటే కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందడం అత్యవసరం. మానసిక ఆరోగ్య సహాయం, మార్గదర్శకత్వం కోసం Tele-MANAS 14416సేవలను కూడా వినియోగించుకోవచ్చు.
ఏమి చేయకూడదు?
ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు మరింత బాధ కల్గించొచ్చు.
ఇలా చెప్పకండి:
• నీకు అన్నీ ఉన్నాయి, ఇంకా ఎందుకు బాధ?
• ఇది చాలా చిన్న సమస్య
• ధైర్యంగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి
• నీ కుటుంబం గురించి ఆలోచించవా?
• ఇలా ఆలోచించడం సిగ్గుచేటు
• నువ్వు నిజంగా చేస్తావని నేను అనుకోవడం లేదు
• ఇతరుల సమస్యలతో పోలిస్తే నీ సమస్య ఏమిటి?
ఇలాంటి మాటలు వ్యక్తిలో
• అపరాధభావన
• సిగ్గు
• ఒంటరితనం మరింత పెంచొచ్చు.
బదులుగా ఇలా చెప్పండి
• నువ్వు ఒంటరివి కాదు.
• నీ బాధను నేను సీరియస్‌గా తీసుకుంటున్నాను
• నువ్వు ఇప్పుడు చాలా కష్టంగా అనుభూతి చెందుతున్నావని నాకు తెలుస్తోంది
• మనిద్దరం కలిసి సహాయం తీసుకుందాం
• నేను ఇప్పుడు నీతోనే ఉన్నాను
కొన్నిసార్లు ఈ చిన్న మాటలే ఒక వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన మాటలుగా మారొచ్చు.
నివారణలో మనందరి పాత్ర
ఆత్మహత్య అనేది సంక్లిష్టమైన ప్రజారోగ్య సమస్య.
కానీ ఇలా నివారించొచ్చు. ఒక ప్రాణాన్ని కాపాడటానికి మీరు తప్పనిసరిగా
• డాక్టర్ కావాల్సిన అవసరం లేదు
• సైకాలజిస్ట్ కావాల్సిన అవసరం లేదు
• సైకియాట్రిస్ట్ కావాల్సిన అవసరం లేదు
కానీ మీరు చేయగలిగేది ఒకటి ఉంది. గమనించండి. వినండి. నేరుగా అడగండి. ఒంటరిగా వదలకండి. సరైన సహాయంతో కలపండి.
• ఒక స్నేహితుడు అడిగిన “నువ్వు నిజంగా బాగున్నావా?” అనే ప్రశ్న
• ఒక ఉపాధ్యాయుడు చూపిన సానుభూతి
• ఒక కుటుంబ సభ్యుడు ఇచ్చిన భరోసా
• ఒక సహోద్యోగి చేసిన ఫోన్ కాల్
కొన్నిసార్లు జీవితం, మరణం మధ్య ఉన్న అత్యంత ముఖ్యమైన వంతెన కావొచ్చు .
అపోహలు- వాస్తవాలు
అపోహలు ప్రాణాలను తీస్తాయి. సరైన అవగాహన ప్రాణాలను కాపాడుతుంది. ఆత్మహత్యకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన అంశాల్లో ఒకటి సామాజిక అపఖ్యాతి (Stigma) తప్పుడు నమ్మకాలు (Myths). చాలామంది ఆత్మహత్య గురించి మాట్లాడటానికే భయపడతారు. మరికొందరు బాధపడుతున్న వ్యక్తి మాటలను సరదాగా తీసుకుంటారు. ఇంకొందరు “అడిగితే ఆ ఆలోచన వస్తుంది” అనే అపోహతో మౌనంగా ఉంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఆత్మహత్య గురించి సరైన సమయంలో, సరైన విధంగా మాట్లాడటం ప్రమాదాన్ని పెంచదు. సహాయం పొందే అవకాశాన్ని పెంచుతుంది. సమాజంలో విస్తృతంగా ఉన్న కొన్ని ముఖ్యమైన అపోహలు, వాటి వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోవడం అత్యవసరం.
అపోహ 1
“ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వ్యక్తిని ఎవరూ ఆపలేరు. అది తప్పనిసరిగా జరిగిపోతుంది.”
వాస్తవం ఏమిటంటే : ఇది పూర్తిగా సరైన అభిప్రాయం కాదు. ఆత్మహత్య ఆలోచనలు చాలాసార్లు శాశ్వత నిర్ణయం కాదు. తీవ్రమైన మానసిక సంక్షోభంలో ఏర్పడే తాత్కాలిక స్థితి కావొచ్చు. సరైన సమయంలో మానసిక సహాయం, కుటుంబ మద్దతు, వైద్య సేవలు, భావోద్వేగ భరోసా అందితే అనేక మంది ఆ సంక్షోభాన్ని అధిగమించి సాధారణ, సంతోషకరమైన, ఉత్పాదక జీవితాన్ని కొనసాగించగలరు. ఆత్మహత్యలను నివారించవచ్చు. సకాలంలో గుర్తించడం, సరైన సహాయం అందించడం అత్యంత కీలకం.
అపోహ 2
“ఎవరినైనా నేరుగా ఆత్మహత్య గురించి అడిగితే వారి మనసులో ఆ ఆలోచన వస్తుంది.”
వాస్తవం ఏమిటంటే : ఇది కూడా ఒక ప్రమాదకరమైన అపోహ.
“నీకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయా?” అని సున్నితంగా, ప్రేమతో అడగడం వల్ల ఆ ఆలోచన వ్యక్తి మనసులో కొత్తగా పుట్టదు.
దానికి విరుద్ధంగా
• వ్యక్తిలో ఉన్న ఆందోళన తగ్గొచ్చు
• బాధను చెప్పుకునే అవకాశం లభిస్తుంది
• ఒంటరితనం తగ్గుతుంది
• సహాయం పొందే మార్గం తెరుచుకుంటుంది
నేరుగా అడగడం ఆలోచనను నాటదు. మౌనంగా ఉన్న బాధను బయటకు తీసుకురావడానికి అవకాశం కల్పిస్తుంది.
అపోహ 3
“ఆత్మహత్యను నివారించగలిగేది కేవలం డాక్టర్లు లేదా మానసిక ఆరోగ్య నిపుణులే.”
వాస్తవం ఏమిటంటే : మానసిక ఆరోగ్య నిపుణుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. ఆత్మహత్య నివారణ కేవలం వైద్య రంగం బాధ్యత కాదు.
Suicide Prevention is Everybody’s Business.
ఒక
• స్నేహితుడు
• ఉపాధ్యాయుడు
• సహోద్యోగి
• కుటుంబ సభ్యుడు
• పొరుగువాడు
సరైన సమయంలో వ్యక్తి బాధను గుర్తించి, సానుభూతితో మాట్లాడి, సహాయం పొందేలా చేయగలిగితే అది ఒక ప్రాణాన్ని నిలబెట్టే కీలకమైన చర్య కావొచ్చు.
అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం మన పని చికిత్స చేయడం కాదు. ప్రమాదాన్ని గుర్తించి, వ్యక్తిని ఒంటరిగా వదలకుండా, సరైన నిపుణుల వద్దకు చేర్చడం.
అపోహ 4
“ఆత్మహత్య చేసుకునే వ్యక్తులు తమ ఆలోచనలను ఎవరితోనూ చెప్పరు.”
వాస్తవం ఏమిటంటే : అనేక మంది వ్యక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ బాధను ఇతరులకు తెలియజేస్తుంటారు.
వారు ఇలా చెప్పొచ్చు..
“ఇక నాకు జీవించడం ఇష్టం లేదు.”
• నేను అందరికీ భారంగా ఉన్నాను
• ఇవన్నీ త్వరలో ముగిసిపోతాయి
• నేను లేకపోతే మీకు మంచిది
• నా సమస్యకు పరిష్కారం లేదు
కొంతమంది మాటల ద్వారా చెబుతారు.
మరికొందరు ప్రవర్తన ద్వారా సంకేతాలు ఇస్తారు.
అందువల్ల వ్యక్తి మాటల్లో, ప్రవర్తనలో వచ్చే మార్పులను సరదాగా, డ్రామాగా తీసుకోకూడదు.
హెచ్చరిక సంకేతాలను గుర్తించడం ఒక ప్రాణాన్ని కాపాడగలదు.
అపోహ 5
“ఆత్మహత్య గురించి మాట్లాడేవారు, జోక్ చేసేవారు నిజంగా చేయరు.”
వాస్తవం ఏమిటంటే : ఇది అత్యంత ప్రమాదకరమైన నిర్లక్ష్య ధోరణి.
ఆత్మహత్య గురించి మాట్లాడే వ్యక్తి నిజానికి “నా బాధను ఎవరైనా గమనిస్తారా?”
అనే సందేశాన్ని పరోక్షంగా పంపుతూ ఉండొచ్చు. కొంతమంది వ్యక్తులు సహాయం కోరడం సురక్షితమేనా? లేదా? అని పరీక్షించడానికి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చు.
అందువల్ల ఆత్మహత్యకు సంబంధించిన ప్రతి వ్యాఖ్యను సీరియస్‌గా తీసుకోవాలి.
వ్యక్తి నవ్వుతూ చెప్పినా, సరదాగా చెప్పినట్లు కనిపించినా దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు.
ప్రదాన సందేశం ఆత్మహత్యలను నివారించొచ్చు

డాక్టర్ తమ్మిన దుర్గాప్రసాద్ సీనియర్ మనస్తత్వ నిపుణులు,
పాత ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి,
విజయవాడ, ఎన్‌టిఆర్ జిల్లా. 9010508999








కామెంట్‌లు (0)