ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదర్శకుడు.. హీరో.. లోకేశ్ కనగరాజ్

1 గంట క్రితం

lokesh.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 08:56 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

దర్శకత్వంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ ను సృష్టించి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన లోకేశ్ కనగరాజ్, ఇప్పుడు వెండితెరపై నటుడిగానూ తన విశ్వరూపం చూపించారు. కెమెరా వెనుక ఉండి నటులను నడిపించే దర్శకుడే, కెమెరా ముందుకు వచ్చి కథానాయకుడిగా మెప్పించడం విశేషం. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘డీసీ’ చిత్రంతో హీరోగా మారి, తొలి ప్రయత్నంలోనే ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించారు. దర్శకుడిగా ప్రతి కథలోనూ తనదైన ముద్ర వేసే లోకేశ్, నటుడిగానూ అలరించగలనని నిరూపించారు. ఈ సందర్భంగా ఆయన గురించి.. ‘డీసీ’ సినిమాలో తన పాత్ర గురించి తెలుసుకుందాం.


‘ఒకప్పుడు ఓ దెయ్యం ఉండేది.. అది కేవలం కథ మాత్రమే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ దెయ్యం మళ్లీ మేల్కొంది!’ అని ‘‘విక్రమ్‌’’ లో వినిపించే ఈ డైలాగు ఒక్కటే లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాల శైలికి ఓ చిన్న పరిచయం. చీకటి ప్రపంచాలు, ప్రమాదకరమైన పాత్రలు, మాదకద్రవ్యాల మాఫియా, హింస, కుటుంబ బంధాలు, ఊహించని మలుపులు.. వీటన్నింటినీ కలిపి తనదైన స్టైల్‌ ‌లో సినిమాలు తీశారు దర్శకుడు కనగరాజ్. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన తండ్రి బస్‌ కండక్టర్‌గా పనిచేశారు. చిన్నతనంలోనే సినిమాలంటే పిచ్చి ఉన్నప్పటికీ, తొలుత దాన్నే వృత్తిగా ఎంచుకోవాలన్న ఆలోచన ఆయనకు లేదు. చదువు పూర్తి చేసి, కొంతకాలం బ్యాంకులో ఉద్యోగం కూడా చేశారు.

కమల్‌ ‌సినిమాల ప్రభావం

కనగరాజ్ చిన్నతనంలో ఎక్కువగా కమల్‌హాసన్‌ సినిమాలనే చూస్తూ పెరి‌గారు. కమల్‌హాసన్‌నే తనను ఫిల్మ్‌మేకింగ్‌ వైపు తీసుకెళ్లిన ప్రధానవ్యక్తి అని స్ఫూర్తిగా చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. ‘‘సత్య’’,‘‘ విరుమాండి’’, ‘‘అన్‌బే శివం’’,‘‘ విశ్వరూపం’’ వంటి చిత్రాలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని ఆయన వెల్లడించారు.

అదే సమయంలో ‘‘అరణ్య కాండం’’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడం కూడా లోకేశ్‌ను బాగా కదిలించింది. మంచి సినిమా తప్పనిసరిగా భారీ విజయమే సాధించాల్సిన అవసరం లేదనే ఆలోచన ఆయనలో మరింత బలపడింది. ఆ ప్రభావమే తన తొలి చిత్రం ‘‘మానగరం’’ రూపకల్పనలో కనిపించింది.

​బ్యాంకు ఉద్యోగం మానుకొని..

బ్యాంకులో పనిచేస్తున్న సమయంలో ఓ కార్పొరేట్‌ షార్ట్‌ఫిల్మ్‌ పోటీలో పాల్గొనడం ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. ఆయన తీసిన షార్ట్‌ఫిల్మ్‌ను దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ గుర్తించి ప్రోత్సహించారు. ఆ తర్వాత ‘‘కాళం’’ అనే షార్ట్‌ఫిల్మ్‌ అవియల్ ఆంథాలజీలో భాగమైంది. అక్కడి నుంచి కనగరాజ్ సినీ ప్రయాణం మొదలైంది.

2017లో వచ్చిన ‘‘మానగరం’’తో దర్శకుడిగా కనగరాజ్ తన సత్తా చాటారు. ఒక నగరంలో ఒకే రాత్రిలో వేర్వేరు వ్యక్తుల జీవితాలు ఎలా ఒకదానితో ఒకటి ముడిపడతాయో చూపించిన ఈ చిత్రం, సాధారణ కథనానికి భిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకుంది.నగరం ఎంత పెద్దదైనా.. మనుషుల జీవితాలు ఒకదానితో ఒకటి ఏదో ఒక విధంగా ముడిపడి ఉంటాయని సందేశాత్మకంగా తీశారు. దీంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

​తండ్రి ప్రేమకు యాక్షన్‌!

లోకేశ్‌ 2019లో తీసిన ‘‘ ఖైదీ’’ ఆయన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. జైలు నుంచి బయటకొచ్చిన ఖైదీ దిల్లీ తన కూతురిని మొదటిసారి చూడాలని తపిస్తాడు. కానీ డ్రగ్‌ మాఫియా, పోలీసుల ప్రాణాపాయం, రాత్రంతా సాగే పోరాటం అతని ముందుకొస్తాయి. హీరోయిన్‌ లేకుండా, పాటలు లేకుండా, దాదాపు ఒకే రాత్రి వ్యవధిలో జరిగే కథను ఉత్కంఠభరితంగా సన్నివేశాలను అల్లారు కనగరాజ్. “పదేళ్లు జైల్లో ఉన్నానని తెలుసు.. కానీ జైలుకు వెళ్లకముందు నేను ఏం చేశానో నీకు తెలియదు.” ఈ ఒక్క లైన్‌లోనే దిల్లీ గతం, అతని పాత్రలోని రహస్యం, ప్రేక్షకుల్లో కలిగే ఆసక్తి అన్నీ దాగి ఉన్నాయి. ఈసినిమా భారీ విజయాన్ని సాధించి, తర్వాత ఏర్పడిన కనగరాజ్ సినిమాటిక్‌ ‌యూనివర్స్ కి పునాది వేసింది. ఆ తర్వాత ‘‘మాస్టర్‌’’ సినిమాతో పేద విద్యార్థుల జీవితాలను, మద్యం అలవాటుతో ఇబ్బందిపడే ఓ ప్రొఫెసర్‌ కథను, బాల నేరస్థుల జీవితాలను నేర ప్రపంచం ఎలా ఉపయోగించుకుంటుందనే అంశంతో ముడిపెట్టి సినిమా తీశారు. దాంతో హీరోలు దృష్టి అంతా దర్శకుడు కనగరాజ్ తీసే సినిమాల వైపు పెట్టారు.

​ డ్రగ్‌ ‌మాఫియాపై పోరాటం...

కమల్‌హాసన్‌, ఫహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి, సూర్య వంటి నటులను ఒకే క్రైమ్‌ ప్రపంచంలోకి తీసుకొచ్చిన సినిమా ‘‘విక్రమ్‌’’. ఇక్కడ కనగరాజ్ చెప్పిన కథ కేవలం ఓ పోలీస్‌–గ్యాంగ్‌స్టర్‌ పోరాటం కాదు. డ్రగ్‌ మాఫియా ఎంత పెద్ద వ్యవస్థగా మారగలదో, దానికి ఎదురు నిలవడానికి వ్యక్తిగత నష్టాలను పక్కన పెట్టి, పోరాడాల్సి వస్తుందనే కోణాన్ని కూడా చూపించారు. 2023లో వచ్చిన ‘‘లియో’’లో యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాన్ని ముందుకు తెచ్చారు. ఇలా ప్రతిసినిమా ప్రేక్షకులతో పాటూ సినీ నటీనటులనూ ఆకట్టుకుంటూ కనగరాజ్ సినిమాలు తీస్తున్నారు. ఆయన సినిమాలో స్టంట్స్‌ భౌతికశాస్త్ర నియమాలకు దగ్గరగా, సహజంగా ఉండాలని కోరుకుంటానని ఆయన వెల్లడించారు.

దేవదాస్‌‌గా...

ఆగస్టు 7న విడుదలైన అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలోని సినిమా ‘‘డిసి’’లో దేవదాస్‌ పాత్ర కనగరాజ్ నటించారు. ఒక సాధారణ వ్యక్తి నేరచరిత్రలోకి ఎలా నెట్టబడ్డాడు అనేది ఈ సినిమా కథ. అంతేకాదు, దేవదాస్‌ పాత్ర కోసం కనగరాజ్ దాదాపు 50 రోజుల పాటు 90 ట్రైనింగ్‌ సెషన్లు, రోజుకు రెండు వర్కౌట్లు చేశారు. కేవలం డైరెక్టర్‌ కాబట్టి హీరోగా నటించాడు అని కాకుండా, పాత్ర కోసం శరీరాన్ని కూడా అందుకు సన్నద్ధం చేశారు. దేవదాస్‌ను మొదట చూస్తే హింసను నమ్మే గ్యాంగ్‌స్టర్‌లా కనిపిస్తాడు. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ అతని వెనుక ఉన్న బాధ, ఒంటరితనం, ప్రేమ కోసం అతనిలో ఉన్న తపన బయటపడతాయి. ఆ భావోద్వేగాలను కనగరాజ్ పాత్ర ద్వారా బాగా వ్యక్తపరిచాడంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

పుట్టినరోజు: 1986, మార్చి 14న

నివాసం: కోయంబత్తూర్

తల్లిదండ్రులు: తండ్రి సి. కనగరాజ్, తల్లి కల్పన.

చదువు: కోయంబత్తూరులోని పి.ఎస్.జి. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్