- వర్షాభావం, డ్రైస్పెల్స్
- తేమ లేక విత్తిన విత్తనాలు భూమిలోనే
- సాగైన పంటలకు నీటి కొరత
- కొత్తగా సేద్యానికి తప్పిన అదను
- ఆగస్టు నాల్గవ వారంలోనూ సాగని ఖరీఫ్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : బలహీనమైన నైరుతి రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావంతో ఈ మారు ఖరీఫ్‌లో రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరువే కనిపిస్తోంది. డెల్టా, మెట్ట అనేదానికి నిమిత్తం లేకుండా దాదాపు అన్ని ప్రాంతాల్లో పంటల సాగు అంతంతమాత్రంగానే నమోదైంది. గోదావరి డెల్టా మినహా తతిమ్మా చోట్ల వరి సాగు కూడదన్న ప్రభుత్వ నిషేధాజ్ఞలతో ముఖ్యమైన ఆహార పంట వరి సేద్యానికి పెద్ద గండం వచ్చి పడింది. కృష్ణా డెల్టాలో వరి సాగుపై ప్రభుత్వం సీజన్ ప్రారంభం నుంచీ తడవకో రకంగా దోబూచులాడటంతో రైతుల్లో అయోమయం ఏర్పడింది. వరి వద్దన్నప్పటికీ రైతులు వరి నాట్లు వేయడంతో ప్రభుత్వంలో, రైతుల్లో ఆందోళన నెలకొంది. కర్ణాటక, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలంలోకి కొద్ది రోజుల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో డెడ్ స్టోరేజి కాస్తా జలాశయం పూర్తి నిల్వ సామర్ధ్యంలో ముప్పావువంతు నిండటంతో కృష్ణా డెల్టా అవసరాలు తీరతాయని రైతులు ఆశపడ్డారు. కాగా రాయలసీమకు తాగునీటి అవసరాలతో పాటు సాగునీటి కోసం నీరు విడుదల చేయాలన్న డిమాండ్ ముందుకు రావడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇదిలా ఉండగా శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయడంతో నాగార్జున సాగర్‌కు నీరు విడుదలవుతున్నాయి. సాగర్ నుంచి కిందికి రావట్లేదు. ప్రస్తుతానికి పట్టిసీమ నీటితోనే కృష్ణా డెల్టా కాల్వలకు నీరు విడుదల చేస్తున్నారు. గోదావరిలో పైనుంచి వరద తగ్గి నీటి లభ్యతా తగ్గుతుండటంతో పట్టిసీమ ఎంత వరకు ఆదుకుంటుందోనన్న భయాలు అలముకున్నాయి.
ఇబ్బందుల్లో వర్షాధారం
వర్షాధార పంటల సేద్యానికి వర్షాభావం ప్రతిబంధకంగా తయారైంది. జూలైలో తీవ్ర వర్షాభావంతో రాష్ట్రమంతా ఇబ్బంది పడగా, ఆగస్టు మొదటి వారంలో అడపాదడపా కురిసిన వర్షాలు వేసిన పంటలకు కాస్తంత ఊపిరి పోశాయి. అంతలోనే వర్షాలు తగ్గిపోవడంతో వర్షాభావం, వర్షానికి వర్షానికి భారీ అంతరం (డ్రైస్పెల్) సమస్య ముందుకొచ్చి పంటలను మాడ్చేశాయి. కొద్దిపాటి వానలకు విత్తిన విత్తనాలు భూమిలోనే మాడిపోయాయి. తేమ లేక, అధిక ఉష్ణోగ్రతలతో మొల్కలు బయటికి రాలేదు. పైకొచ్చిన పంటలు పంటలు ఎండిపోతున్నాయి. ఆగస్టు1 నుంచి 21 మధ్య కురవాల్సిన సాధారణ వర్షంలో 50 శాతానికిపైన లోటు ఏర్పడింది. అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అత్యల్ప వర్షం (లోటు 60-99 శాతం) నమోదైంది. శ్రీకాకుళం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల, శ్రీసత్యసాయి, కడప, నంద్యాల జిల్లాలు 50 శాతానికిపైన వర్షపు లోటుతో సతమతమవుతున్నాయి.
12 లక్షల ఎకరాలు తక్కువ
ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 77.10 లక్షల ఎకరాలు కాగా ఆగస్టు 19 వరకు 47.25 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఈ పాటికి సాధారణ సాగు 58.95 లక్షల ఎకరాలు కాగా 11.7 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. సాధారణ సాగులో 20 శాతం సాగు తగ్గింది. ఆహారధాన్యాలు 5.12 లక్షల ఎకరాలు (13 శాతం) తగ్గాయి. ఆహార పంటల్లో ప్రధానమైన వరి సాగు 3.18 లక్షల ఎకరాలు (12 శాతం) తగ్గింది. ఈ తడవ మొక్కజొన్న సాగు 1.25 లక్షల ఎకరాలు (34 శాతం) తగ్గింది. సజ్జలు, రాగుల వంటివి ప్రత్యామ్నాయ పంటలుగా రైతులు అక్కడక్కడ సాగు చేశారు. అయినప్పటికీ మొత్తమ్మీద తృణధాన్యాలు సైతం 1.6 లక్షల ఎకరాలు (33 శాతం) తగ్గాయి. పప్పుధాన్యాలు 35 వేల ఎకరాలు (5 శాతం) తగ్గాయి. రైతులు పెసలు, మినుములు, కందులు ఒక మేరకు వరికి బదులు సాగు చేశారు. అవి నీటి కొరతతో ఉసూరుమంటున్నాయి. నూనెగింజలు 5.85 లక్షల ఎకరాలు (58 శాతం) తగ్గాయి. వేరుశనగ ఒక్కటే 5.6 లక్షల ఎకరాలు (63 శాతం) తగ్గింది. వాణిజ్యపంటల్లో ముఖ్యమైన పత్తి సాగు ఆశాజనకంగా ఉన్నా నీటి సమస్య వలన చివరాఖరుకు రైతులకు ఎంత వరకు చేతికొస్తుందో అనుమానంగా ఉంది. పత్తి ఈ పాటికి కావాల్సిన సాగులో 30 వేల ఎకరాలే తగ్గింది. దాదాపు 97 శాతం మేర సాగైంది.







కామెంట్‌లు (0)