శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎల్‌‌నినోతో మర్తాడు రైతు విలవిల!

8 గంటల క్రితం

marthadu village 7 .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 06:24 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • కళ్లెదుటే ఎండిపోతున్న చీనీ తోటలు

  • 300 అడుగుల లోతుకు ..400కు పైగా బోర్లు

  • అయినా ఫలితం శూన్యం

  • బోర్ల కోసమే రూ.1.44 కోట్ల ఖర్చు

  • ఇతర మార్గాల్లోనూ ప్రయత్నం

  • అప్పుల ఊబిలో వ్యవసాయ కుటుంబాలు 



అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన ముగ్గురు రైతుల దీన స్థితి ఇది! ఆ ముగ్గురిదే కాదు. మార్తాడు గ్రామంలోని రైతులందరిదీ ఇదే దుస్థితి! ఎల్‌‌నినో కారణంగా జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ దుర్బిక్ష పరిస్థితుల నేపధ్యంలో మర్తాడు గ్రామంలో నెలకొన్న పరిస్థితులను ప్రజాశక్తి పరిశీలించింది. అక్కడి రైతులతో మాట్లాడింది!

ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి: మర్తాడు గ్రామంలో చీనీ తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి చీనీకి ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా నాగపూర్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఈ గ్రామ చీనీ రైతులను తీవ్రంగా కుంగదీస్తున్నాయి. ఏళ్లుగా పెంచుకుంటున్న చీనీ తోటలు కళ్ల ఎదుటే ఎండిపోతుంటే వాటిని కాపాడుకోవడానికి వారు చేయని ప్రయత్నం లేదు. పొరుగు గ్రామాల నుండి లేదా నీరు ఉన్న రైతుల బోర్ల నుండి నీటిని కొని ట్యాంకర్లతో తీసుకొచ్చి చెట్లకు అందించి వాటిని బతికించుకునేందుకు కొందరు, గ్రామానికి దూరంగా ఉన్న చెరువులో బోర్లు వేసి కిలోమీటరు నుండి రెండు కిలోమీటర్ల వరకు తమ పొలానికి పైపులైన్ వేసుకుంటున్నవారు మరికొందరు. ఫలసాయం అంది రావాల్సిన సమయంలో అట్ల వెంకటరెడ్డికు చెందిన ఐదు ఎకరాల్లోని చీనీ చెట్లు పూర్తిగా ఎండిపోయాయి. గత కొద్ది సంవత్సరాల క్రితం ఆయన కొడుకు రాజశేఖర్‌రెడ్డి తోట దగ్గర ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు వేస్తూ విద్యుదాఘాతానికి గురై చనిపోయారు. ఆ కుటుంబం మొత్తం చితికిపోయింది.

బోర్ల కోసం రూ.1.44 కోట్లు ఖర్చు

చెట్లను కాపాడుకోవడానికి ఈ గ్రామంలో సుమారు 400కు పైగా బోర్లు వేసినట్లు ‘ప్రజాశక్తి’కి గ్రామస్తులు తెలిపారు. ఒక్కో రైతు సగటున 300 అడుగుల లోతు వరకూ వెళ్లారు. ఒక అడుగు బోరు వేయడానికి గతేడాది రూ.95 నుండి వంద రూపాయలు తీసుకునే వారు. ప్రస్తుత ఏడాది రూ.120 తీసుకుంటున్నారు. ఈ లెక్కన ఈ ఒక్క గ్రామంలోనే 1.44 కోట్ల రూపాయలు బోర్ల కోసమే రైతులు ఖర్చు పెట్టారు. ఇందులో అత్యధిక మంది రైతులు అధిక వడ్డీకి అప్పులు చేసి ఈ సాహసం చేశారు. అయినా, ఫలితం పూర్తి నిరాశాజకనంగా ఉండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉద్యాన శాఖ అధికారులు తమ తోటలను పరిశీలించలేదని రైతులు వాపోయారు.

అధిక వడ్డీకి ప్రైవేట్ బ్యాంకుల వద్ద అప్పు

గ్రామంలో అప్పులు ఇచ్చే వారు తగ్గిపోయారు. కమర్షియల్ బ్యాంకులు ఎకరం తాకట్టు పెడితే లక్ష రూపాయలు రుణం ఇవ్వడానికి కూడా అనేక షరతులు పెడుతుండడంతో రైతులు ప్రైవేట్ బ్యాంకులను ఆశ్రయించారు. ఈ అవకాశాన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉపయోగించుకుని ఎకరం భూమి తాకట్టుకు మూడు లక్షల రూపాయల వరకు రుణం ఇస్తూ, వందకు రూపాయిన్నర చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఈ వడ్డీ భారం కరువు రైతే కాదు, మూడు పంటలు పండించే రైతు కూడా చెల్లించలేరు. దీని పర్యావసానం ఎంత దారుణంగా ఉంటుందో ప్రభుత్వం గమనించడం లేదు.

ప్రభుత్వం వెంటనే స్పందించాలి : రైతులు

మర్తాడు గ్రామంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలు, చీనీ తోటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. పంటలు, తోటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ నీటి వసతులు కల్పించాలని, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడంతోపాటు భూగర్భ జలాల పెంపునకు సత్వర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ఆ రైతు పేరు గిరిజాల సుబ్రమణ్యం. తన 2.50 ఎకరాల్లో పదేళ్ల క్రితం చీనీ మొక్కలు వేశారు. అవి పెరిగి గత మూడేళ్ల నుంచి పంట చేతికి వస్తోంది. ఎల్‌‌నినో వల్ల ప్రస్తుతం తీవ్ర వర్షాభావం నెలకొనడంతో చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో, ఇటీవల 14 బోర్లు, ఒక్కో బోరు సగటున 350 నుండి 400 అడుగులు వేశారు. వీటిలో నాలుగు బోర్లు కలిపి ఒక ఇంచు నీరు మాత్రమే వస్తోంది.


చాకలి కిష్టన్న అనే మరో రైతు తన ఐదు ఎకరాల పొలంలో ఐదేళ్ల క్రితం చీనీ మొక్కలు వేశారు. ఈ ఏడాది పంట చేతికి రావాల్సి ఉంది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగం టాయి. ఐదు బోర్లు వేశారు. ప్రస్తుతం ఒకటిన్నర ఇంచు నీరు మాత్రమే వస్తోంది.


శివశంకర్ అనే ఇంకో రైతు ఐదు ఎకరాల్లో ఏడు సంవత్సరాల క్రితం చీనీ చెట్లు మొక్కలు వేశారు. పంటను కాపాడుకోవడానికి 14 బోర్లు తవ్వారు. అయినా, ఏ ఒక్క బోరులోనూ నీరు పడకపోవడంతో చెట్లు ఎండిపోతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్