సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జమీందారీ భూములకు... భూస్వాములే ఆసాములు..!

1 గంట క్రితం

mango
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 12:17 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- 66 ఏళ్లుగా 500 దళిత కుటుంబాల భూపోరాటం

- రెండు వేల ఎకరాల కోసం తరతరాలుగా ఎదురుచూపులు..

- సామాజిక శంఖారావం సర్వేలో వెలుగులోకి...

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : ఒకప్పుడు ఆలయ అర్చకులకు కేటాయించిన వేలాది ఎకరాల భూమి.. కాలక్రమంలో భూస్వాముల చేతుల్లోకి వెళ్లింది. ఆ భూములపై హక్కుల కోసం తరతరాలుగా ఎదురుచూస్తున్న దళిత కుటుంబాలకు నేటికీ సొంతంగా ఒక్క ఎకరం కూడా దక్కని దుస్థితి. వారికి కేటాయించాల్సిన భూముల్లోనే వారే వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న 500 దళిత కుటుంబాల కన్నీటి గాధ తిరుపతి జిల్లా పుత్తూరు మండలం కల్యాణ వెంకటేశ్వరపురంలో సామాజిక శంఖారావంలో వెలుగుచూసింది.

కార్వేటినగరం జమీందారుల పరిధిలోని పుత్తూరు మండలం కల్యాణ వెంకటేశ్వరపురం రెవెన్యూ పరిధిలోని పైమాస్‌ 202 కింద 1,855లో నారాయణవనం సమీపంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పనిచేసే అర్చకులకు సుమారు రెండు వేల ఎకరాల భూమిని మాన్యం (ఇనాం) కింద కేటాయించారు. ఈ భూములు ఆలయానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో, అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండటంతో అర్చకులు వాటిని సాగు చేసుకోలేకపోయారు. దీంతో, కాలక్రమంలో వినియోగంలో లేని ఆ భూములపై పలువురు భూస్వాములు కన్నేశారు. ప్రభుత్వ రికార్డుల్లో, భూముల అసలు హక్కులపై వివాదాలు కొనసాగుతుండగానే భూములు ఒక్కొక్కటిగా ఇతరుల చేతుల్లోకి వెళ్లాయని స్థానిక దళిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

అడవినే నమ్ముకుని జీవనం

కల్యాణ వెంకటేశ్వరపురం, గోపాలకృష్ణాపురం, నేషనూరు, పైడిపల్లి, తొర్రూరు గట్టు, గంగమాపురం తదితర ప్రాంతాల్లో దళిత కుటుంబాలు తరతరాలుగా నివసిస్తున్నాయి. అడవిని, వ్యవసాయ పనులను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నామని వారు చెబుతున్నారు. అయితే, తమకు భూములు కేటాయించాలంటూ దశాబ్దాలుగా ప్రభుత్వాలను కోరుతున్నా ఫలితం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వేల ఎకరాల భూమి కోసం 500 కుటుంబాలు చేస్తున్న పోరాటానికి ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి. అప్పటి ప్రధానమంత్రి వి.పి.సింగ్‌‌ను కలిసి తమకు భూములు ఇవ్వాలని కోరుతూ వినతిప్రతం అందజేశారు. తమకు భూములు కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి దామోదర్‌ ‌సంజీవయ్య ప్రభుత్వం నుంచి బాధితులు పోరాడుతున్నారు.

దురాక్రమణ భూముల్లోనే వ్యవసాయ కార్మికులుగా...

2014 తర్వాత వైసిపి, టిడిపి నాయకులు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, ఇతర భూస్వాములు కలిసి సుమారు 1,400 ఎకరాల వరకు భూములను ఆక్రమించుకున్నారని స్థానిక దళిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఆక్రమిత భూముల్లో మామిడి తోటలు, వరి, శనగ, పూలు, కూరగాయల సాగు చేస్తున్నారని చెబుతున్నారు.

తమకు దక్కాల్సిన భూముల్లోనే అక్కడి తామే వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వేల ఎకరాలు అటవీ సమీప ప్రాంతం కావడంతో మూలకోన, అడవివంక ఉండటం వల్ల నీరు పుష్కలంగా ఉంటోంది. ఏడాదికి మూడు పంటలు పండుతున్నాయని దళితులు చెబుతున్నారు.

పోరాడుతున్నాం : రామచంద్రయ్య, కల్యాణ వెంకటేశ్వర పురం

జానెడు భూమి లేక దళితులు, బిసిలు పోరాడుతున్నారు. మా కళ్లెదుటే రెండు వేల ఎకరాల్లో 1,400 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఆ భూముల్లోనే మేం వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నాం. నా వయస్సు 62 ఏళ్లు. మా తాత, మా నాన్న భూమి కోసం పోరాడారు. ఇప్పుడు నేనూ పోరాడుతూనే ఉన్నాను.

పేదలకు పంచాలి : ఆర్.వెంకటేష్, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఆరు దశాబ్దాలకు పైగా దళితులు భూమి కోసం పోరాడుతుంటే, మా కళ్లెదుటే ఒక్కొక్కరు వంద, రెండు వందలు, మూడు వందల ఎకరాలు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ యంత్రాంగం స్పందించి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు ఒక్కొక్కరికి ఆరు ఎకరాల చొప్పున పంచాలి.

సర్వే చేస్తున్నాం : సిజి వెంకటేశ్వర్లు, పుత్తూరు తహశీల్దార్

1825లో ఆ భూమిని నారాయణవనం కల్యాణ వెంకటేశ్వర ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న వారికి కార్వేటినగరం రాజులు మాన్యం కింద ఇచ్చారు. ఆ భూములకు ఇప్పటికీ సర్వే నెంబర్లు లేవు. సర్వే చేసి, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. ఎవరు ఆక్రమించుకున్నా కఠిన చర్యలు తీసుకుంటాం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్