గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకొటియాలోని గనులపై కేంద్ర మాజీ మంత్రి కన్ను!

17 గంటల క్రితం

kotia 2.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 12:33 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • అఖిలపక్ష పోరాటం వెనుక మైనింగ్ మాఫియా!

  • ఆంధ్రా అడ్డు తొలగించుకునేందుకే ఒడిశా దూకుడు?

  • బాక్సైట్ తవ్వకాలు జరిగితే కొటియా గ్రామాలపై ప్రభావం

ప్రజాశక్తి- పార్వతీపురం : ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య 90 ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న 21 కొటియా గ్రామాలపై పట్టుకోసం ఒడిశాలోని కొరాపుట్ జిల్లాకు చెందిన ప లు రాజకీయ పార్టీలు కలిసి చేస్తోన్న పోరాటం వెనుక మైనింగ్ మాఫియా ప్రోత్సాహం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గ్రామాల ప్రజలను మచ్చిక చేసుకుని ఈ ప్రాంతంలోని ఉన్న ఖనిజ సంపద తరలించుకుపోవాలని కేంద్ర మాజీ మంత్రి స్కెచ్‌ ‌రూపొందించినట్లు సమాచారం. దీనికోసం కొరాపుట్ జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులను ఐక్యం చేసి పోరాటానికి ఉసిగొల్పుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ కొటియా వాసులపై ఒడిశా ప్రజాప్రతినిధులు, అధికారులు దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడడం వెనుక మైనింగ్ మాఫియా అండదండలే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్, బిజెపి, కాంగ్రెస్ పార్టీ ల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొటియా గిరిజనులను లొంగదీసుకునే ఏడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో బంగారం, ప్లాటినం, మాంగనీసు, బాక్సైట్, గ్రాఫైట్ వంటి గనులు ఉన్నట్లు ఒడిశా ప్రభుత్వ సర్వేలలో తేలింది. దీంతో, వివాదాస్పద గ్రామాలపై ఆంధ్రా పెత్తనం లేకుండా గుత్తాధిపత్యం సాధించడానికి, ఈ గనులను కొల్లగొట్టడానికి అఖిల పక్షం పోరాటం వెనుక సూత్రధారిగా ఒడిశాకు చెందిన బిజెపి ఎంపి, మాజీ మంత్రి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోనూ, ఒడిశాలోనూ అధికారంలో బిజెపి ఉండడంతో కొటియా గ్రామాలపై పట్టు బిగించేందుకు యత్నిస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రికి బినామీల పేర్లతో మైనింగ్ కంపెనీలు ఉన్నాయని, మైనింగ్‌ ‌మాఫియాలను వెనకుండి నడిపిస్తున్నారని చర్చ నడుస్తోంది. ఐదేళ్ల క్రితం ఆయన కొటియాలోని పట్టుచెన్నూరు గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయనకు ఎదురైన ఎపి పోలీసు అధికారితో పరుషంగా మాట్లాడడం, ‘ఆంధ్రా గో బ్యాక్’ అంటూ ఆంధ్రా పోలీసులతో దురుసుగా మాట్లాడడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కొటియా గ్రామాలలో ఎపి అభివృద్ధి పనులకు ఒడిశా అడ్డుకుంటోంది.

గత ఆగస్టులో బాక్సైట్ తవ్వకాలకు ఒప్పందం

కొటియా కొండల్లోని బాక్సైట్ తవ్వకాలకు ఈ ఏడాది ఆగస్టులో నేషనల్ అల్యూమినియం కంపెనీ (నెల్కో), ఐడిసిఒ కంపెనీ మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సుమారు 1,744 ఎకరాల్లో 111.794 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఏడాదికి 3.5 టన్నుల బాక్సైట్ తవ్వుకునేందుకు ఒప్పందం కుదిరింది. 18.5 కిలోమీటర్లు ఓవర్ లోడ్ కన్వేయర్ వ్యవస్థ ద్వారా దమన్‌‌జోడిలోని అల్యూమినియం రిఫైనరీ కంపెనీకి తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. సేరుబంద కొండల్లోని బాక్సైట్‌ త‌వ్వితే సమీపంలోని అడవులు, నీటి వనరులు, వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సుమారు 200 గిరిజన గ్రామాలపై ఆ ప్రాజెక్టు ప్రతికూల ప్రభావం చూపనుంది. కొటియా గ్రామాలపై ఆంధ్రా పెత్తనం ఉంటే వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద దోపిడీ సాధ్యం కాదనే అభిప్రాయంతో ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆంధ్రా అధికారులను అడ్డుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021, 2026లో ఎపి ప్రభుత్వం నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో కొటియా ఓటర్లు పాల్గొనకుండా చేసి అక్కడి ప్రజలు తమవైపే ఉన్నారని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని ఒడిశా విఫలయత్నం చేస్తోంది. ఇటీవల ఎన్నికల్లో పోలింగ్‌‌కు కొటియా ఓటర్లు రాకుండా చేసేందుకు కొరాపుట్ జిల్లా యంత్రాంగంతోపాటు పోలీసులు, ప్రజాప్రతినిధులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఎంపిటిసి, జెడ్‌‌పిటిసి ఎన్నికల్లో పోటీ చేసిన గంజాయిబద్ర, దండిగాం ఎంపిటిసి అభ్యర్థులను ఒడిశా పోలీసులు తమ అదుపులో ఉంచుకొని పోలింగ్ రోజున విడిచి పెట్టారు. సుప్రీం కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు అమలులో ఉన్నా భౌగోళికంగా తమకు దగ్గరగా ఉన్నాయనే ధీమాతో కొటియా గ్రామాల గిరిజనుల హక్కుల ఉల్లంఘనకు ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎపిలోని కూటమి పార్టీలు, వైసిపి మౌనం!

కొటియా గ్రామాల విషయంలో ఒడిశా దౌర్జన్యంపై ఎపిలోని అధికార కూటమి నాయకులు, ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి నోరుమెదడం లేదు. సిపిఎం నాయకులు కొటియా గ్రామాల ప్రజల తరఫున గళమెత్తుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కొటియా గ్రామాల వివాదాన్ని ఇరు రాష్ట్రాలూ పార్లమెంటు పరిధిలో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్