ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమరింత లోతుకు భూగర్భ జలాలు

1 గంట క్రితం

img_3818.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 09:47 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర ప్రభావం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది. సంబంధిత శాఖ అంచనాలకన్నా వేగంగా నీటినిలువలు తగ్గిపోతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. రెండు మీటర్ల కన్నా లోతుకు నీటి మట్టం పడిపోతుందని అధికారులు గతంలోనే హెచ్చరించగా తాజాగా అంతకు మించే భూగర్భ జలాలు తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం భూమి మట్టానికి 11.02 మీటర్ల లోతులో నమోదైంది. గత ఏడాది ఇదే రోజున 8.98 మీటర్లుగా మాత్రమే ఉండగా తాజాగా 2.04 మీటర్లుకు తగ్గిపోయింది. ​ఆగస్టు ఒకటి నాటికి వినియోగానికి అందుబాటులో ఉన్న భూగర్భ జలాల పరిమాణం మొత్తం 492.39 టీఎంసీలుగా ఉందదగా, ఇందులో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 415.57 టీఎంసీలు, రాయలసీమలో 76.81 టీఎంసీలు ఉన్నాయి.

గోదావరి జిల్లాల్లో కష్టాలు

పచ్చదనానికి మారుపేరుగా నిలిచే తూర్పు గోదావరి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ జిల్లాలో ఏకంగా దగ్గరదగ్గర 24 మీటర్లు లోతుకున భూగర్భ జలాలు పడిపోయాయి, గత ఏడాది 19.64 మీటర్ల వరకు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు 23.55 మీటర్లకు పడిపోయింది. అంటే 3.91 మీటర్ల తగ్గుదల నెలకొంది. ఈ స్థాయిలో ఈ జిల్లాలో భూ గర్భజలాలు పడిపోవడం తూర్పు గోదావరి జిల్లాలోఅత్యంత అరుదుగా చెబుతున్నారు. ఏలూరులో 20.66 మీటర్ల నుంచి 23.49 మీటర్లకు పడిపోయిన భూగర్భ జలాల మట్టం 2.83 మీటర్ల పతనం నమోదైంది. కృష్ణాలో 1.34 మీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 1.70 మీటర్లు తగ్గాయి.

సీమలో సమస్య తీవ్రం

కోస్తా ఆంధ్రతో పోలిస్తే రాయలసీమలో భూగర్భ జలమట్టం మరింత సమస్యాత్మకంగా ఉంది. రాయలసీమలో సగటు నీటిమట్టం 13.55 మీటర్ల లోతులో ఉండగా, కోస్తా ఆంధ్రలో 10 మీటర్ల వద్ద నమోదైంది. గత ఏడాది ఇదే తేదీతో పోలిస్తే రాయలసీమలో 3.10 మీటర్ల తగ్గుదల రికార్డ్ కాగా, కోస్తా ఆంధ్రలో ఈ తగ్గుదల 1.61 మీటర్లుగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే శ్రీ సత్యసాయి జిల్లాలో భూగర్భ జలమట్టం అత్యధికంగా పడిపోయింది. గత ఏడాది ఆగస్టు 19న 11.96 మీటర్లుగా ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 7.97 మీటర్లు పడిపోయి 19.93 మీటర్లకు చేరింది. ​అనంతపురంలో గత ఏడాది 11.12 మీటర్లుగా ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 15.47 మీటర్లకు, నంద్యాలలో 6.66 మీటర్ల నుంచి 9.74 మీటర్లకు, చిత్తూరులో 13.93 మీటర్ల నుంచి 16.14 మీటర్లకు, అన్నమయ్యలో 13.44 మీటర్ల నుంచి 16.36 మీటర్లకు నీటిమట్టం పడిపోయింది.

ఉత్తరాంధ్రలోనూ తగ్గుదల

​ ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు తగ్గాయి. శ్రీకాకుళంలో 7.16 మీటర్ల నుంచి 8.42 మీటర్లకు, విజయనగరంలో 3.94 నుంచి 5.78 మీటర్లకు, పార్వతీపురం మన్యంలో 5.77 నుంచి 7.24 మీటర్లకు నీటిమట్టం పడిపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 8.30 నుంచి 10.42 మీటర్లకు, విశాఖపట్నంలో 8.04 నుంచి 11.35 మీటర్లకు చేరింది. విశాఖపట్నంలో గత ఏడాదితో పోలిస్తే 3.31 మీటర్ల పతనం, అనకాపల్లిలో 3.13 మీటర్ల తగ్గుదల నమోదైంది. కాకినాడలో 1.97 మీటర్లు, కోనసీమలో 0.28 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయింది.గుంటూరులో భూగర్భ జలమట్టం 3.73 మీటర్ల నుంచి 5.66 మీటర్లకు పడిపోయింది. బాపట్లలో 2.88 నుంచి 4.01 మీటర్లకు, పల్నాడులో 10.07 నుంచి 12.48 మీటర్లకు, ప్రకాశంలో 7.31 నుంచి 7.99 మీటర్లకు చేరింది. ​​విశాఖపట్నంలో వినియోగానికి అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు కేవలం 1.10 టీఎంసీలుగా ఉన్నాయి. చిత్తూరులో 1.20 టీఎంసీలు, ప్రకాశంలో 4.05 టీఎంసీలు, కర్నూలులో 8.29 టీఎంసీలు, నంద్యాలలో 9.51 టీఎంసీలుగా నమోదయ్యాయి. వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, మార్కాపురం జిల్లాల్లో ఈ లభ్యత సున్నాగా నమోదైంది.

​పశ్చిమగోదావరి , మార్కాపురంలో భిన్న పరిస్థితి

పశ్చిమగోదావరి, మార్కాపురం జిల్లాల్లో పరిస్థితి మాత్రం రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు భిన్నంగా ఉంది. అక్కడ గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టం 8.14 మీటర్ల నుంచి 7.71 మీటర్లకు మెరుగుపడింది. మార్కాపురంలో గత ఏడాది 20.90 మీటర్లుగా ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 19.74 మీటర్లకు చేరి 1.16 మీటర్ల మేర మెరుగుపడింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్