రెండు ఎంపిటిసి స్థానాలతోనే ఎంపిపి పీఠం కోసం పట్టు
కూటమి పార్టీల మధ్య మిత్ర భేదం!
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : గడిచిన సాధారణ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్న జనసేన, ప్రస్తుతం ప్రతికూలత ఎదుర్కొంది. తాజాగా జరిగిన పరిషత్తు ఎన్నికల్లో కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఇచ్చిన స్థానాలను గెలుచుకోలేకపోయింది. పైగా, ఎంపిపి స్థానం కోసం మడతపేచీ పెడుతోంది. ఇది టిడిపి నాయకులకు తలనొప్పిగా మారడంతో పార్టీ అధిష్టానాన్ని ఆశ్రయించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో వైసిపితో హోరాహోరీగా తలపడిన కూటమికి, ఇప్పుడు పదవుల పంపకంలో అసలు పరీక్ష ఎదురవుతోంది. నెల్లిమర్ల ఎంపిపి పీఠం కోసం మంతనాలు, మడత పేచీలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. కూటమి పార్టీల అవగాహనలో భాగంగా నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, జామి, గుర్ల జెడ్పిటిసి స్థానాలను జనసేనకు కేటాయించారు. అందులో డెంకాడ, పూసపాటిరేగ మినహా మిగిలిన మూడు చోట్ల ఆ పార్టీ ఓడిపోయింది. నెల్లిమర్ల మండలంలో మొత్తం 15 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. వీటిలో టిడిపి ఐదు, జనసేన రెండు స్థానాల్లో గెలుపొందగా, వైసిపి ఏడు స్థానాల్లో విజయం సాధించింది. బూరాడపేట ఎపిటిసి స్థానంలో టిడిపి రెబల్ గెలుపొందారు. జెడ్పిటిసి స్థానాన్ని కోల్పోయినందున కనీసం ఎంపిపి పదవినైనా ఇవ్వాలని జనసేన పట్టుబడుతుం డడంతో టిడిపికి తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి తన పార్టీకి చెందిన ఇద్దరు జనసేన ఎంపిటిసి సభ్యులను రహస్య క్యాంపునకు తరలించారు. తమ పార్టీకి ఎంపిపి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు, తమకు పదవి దక్కకపోతే మద్దతు విషయంలో పునరాలోచించాల్సి వస్తుందన్న సంకేతాలు ఇస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో టిడిపి నాయకులు అప్రమత్తమయ్యారు. సంఖ్యా బలాన్ని కూడగట్టి ఎంపిపి పీఠాన్ని దక్కించు కోవచ్చన్న అంచనాల్లో ఉన్న తరుణంలో జనసేన మెలికతో అధిష్టానం జోక్యం కోసం ప్రయత్ని స్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గంలోనే పదవుల పంచాయితీ కూటమి ఐక్యతకు పరీక్షగా మారడం చర్చనీయాంశంగా మారింది.







కామెంట్లు (0)