పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంపై ప్రజల్లో ఆకాంక్ష
నిరసనలను ప్రజా ఉద్యమాలుగా మార్చాలి
సమస్యలపై ప్రజలను సమీకరించండి
సిపిఎం పొలిట్ బ్యూర్ సభ్యులు బివి రాఘవులు
ప్రజాశక్తి-ఒంగోలు సిటీ : ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక విధానాలపై ప్రజల్లో ఆకాంక్ష పెరుగుతోందని, ముఖ్యంగా యువతలో సోషలిస్టు ఆలోచనల పట్ల ఆసక్తి విస్తరిస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థులు ఉద్యమాల్లోకి వస్తున్నారని, మహిళల్లో శ్రామిక చైతన్యం పెరుగుతోందని తెలిపారు. ఈ పరిణామాలను కేవలం నిరసనలకే పరిమితం చేయకుండా సమాజంలో సమూల మార్పులకు దోహదపడే ప్రజా ఉద్యమాలుగా నిర్మించాలని కోరారు. ఆర్థిక అసమానతలు, కుల వివక్ష, లింగ అసమానతలు, నిరుద్యోగం, విద్యా, వైద్య సమస్యలపై ప్రజలను సమీకరించాలని సూచించారు.
ఒంగోలులోని సుందరయ్య భవన్లో మంగళవారం సాయంత్రం 109వ అక్టోబర్ విప్లవ దినోత్సవం సందర్భంగా 'వర్తమాన ప్రపంచం – సోషలిజం ఆవశ్యకత' అంశంపై సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కె మాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత సోషలిజానికి భవిష్యత్తు లేదని, పెట్టుబడిదారీ వ్యవస్తే శాశ్వతమనే ప్రచారం విస్తృతంగా జరిగిందని గుర్తుచేశారు. అమెరికా, ఐరోపా దేశాల్లోనూ యువత సోషలిజం వైపు ఆసక్తి చూపుతోందని, పెట్టుబడిదారీ విధానంలోని అసమానతలు, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభాలు ప్రత్యామ్నాయ వ్యవస్థపై ఆలోచించేలా చేస్తున్నాయని వివరించారు. ఆహారం, ఉచిత విద్య, ఆరోగ్యం, ఇల్లు, ఉపాధి, న్యాయమైన వేతనం, పెన్షన్ వంటి వాటిని ప్రభుత్వాలు ప్రజలకు దయతో అందించే పథకాలుగా కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కులుగా కల్పించాలని ప్రతిపాదించారు. వారసత్వ ఆస్తుల బదిలీపై 33 శాతం పన్ను విధించాలని ప్రతిపాదించారు. అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లో వారసత్వ పన్ను విధానాలు అమల్లో ఉన్నాయని ప్రస్తావించారు. అంటరానితనం నిర్మూలనతోపాటు కుల వ్యవస్థ నిర్మూలనను కూడా రాజ్యాంగ లక్ష్యంగా చేర్చాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కుల, లింగ వివక్షలు కొనసాగుతున్నంత కాలం సమానత్వ సాధన సాధ్యం కాదని స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై విద్యార్థులు, యువత చేసిన ఆందోళనలు, రైతుల ఉద్యమం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి రావడం ప్రజా పోరాటాల ప్రభావాన్ని తెలియజేస్తున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపోటములే ఉద్యమాలకు కొలమానం కాదని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటమే వామపక్ష ఉద్యమాల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పునాటి ఆంజనేయులు, జివి కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, ఎం.రమేష్ మాట్లాడారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎన్ రంగారావు, డాక్టర్ బి హరిబాబు, పలువురు నగర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.







కామెంట్లు (0)