శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలోఘటన..
బయటపడుతున్న విస్తుపోయే నిజాలు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి ఆరోగ్యశ్రీ నిధుల గోల్‌మాల్‌లో విషయంలో తవ్వే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. రూ. 47.52 లక్షల సొమ్మును బినామీ ఖాతాలకు మళ్లించి స్వాహా చేశారు. 2024 డిసెంబర్ 6 నుంచి 2026 ఏప్రిల్ వరకూ ఈ అవినీతి సాగింది. సెప్టెంబర్ 15న రాత్రి తొమ్మిది గంటలకు ఆస్ప్రతి ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు గురువారం కొన్ని విస్తుపోయే నిజాలను బయటకు తీశారు. నిందితులైన జూనియర్ అసిస్టెంట్ జి లక్ష్మీ ప్రసన్నతో పోస్టుమార్టం అసిస్టెంట్ చందు కుమ్మకై వారి బంధువులు, ఆస్పత్రిలోని కొందరు ఉద్యోగుల ఖాతాలకు నగదు బదిలీ చేసినట్లు విచారణలో కనుగొన్నారు. చెక్కులపై అమౌంట్‌ను మార్చడం, అధిక మొత్తం రాయడం, మెడికల్ సూపరింటెండెంట్‌ల సంతకాలను ఫోర్జరీ చేయడం, ఫోర్జరీ చేసిన చెక్కులను, నెప్ట్ ఫారాలను ఒరిజినల్‌గా చూపి ప్రభుత్వ డబ్బును డ్రా చేయడం వంటి అవినితి చర్యలకు పాల్పడ్డారు. లక్ష్మీ ప్రసన్న, చందులతో పాటు వారి బందువులైన లక్ష్మీ ప్రసన్న భర్త పిఎస్ చేతన్ కుమార్, అత్త దుర్గాదేవి, మామ సుబ్రమణ్యం, స్నేహితులు పూజ జయచంద్ర, రమ్య, శేషు, చందు తండ్రి నటరాజ, తల్లి ఈశ్వరి, స్నేహితురాలు హరిత ప్రియలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు కేసుకు ముందే లక్ష్మీ ప్రసన్న, చందుల నుంచి ఆస్పత్రి పెద్దలు ఓ రాజకీయ పెద్ద వద్ద పంచాయితీ చేసి రూ. 22.50 లక్షలు రికవరీ చేయించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నిధుల పక్కదారిపై అనుమానాలు
చెక్కులపై డ్రా చేసుకునే మొత్తాన్ని అక్షరాల్లో రాస్తున్నప్పడు అధిక మొత్తంలో ఎలా రాసుకునే అవకాశం ఉంటుందన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అదేవిధంగా పోర్జరీ సంతకాలు బ్యాంకులో ఎలా సరిపోలాయి, భారీ సంఖ్యలో బినామీలకు నగదు బదిలీ చేస్తుంటే బ్యాంకు అధికారులకు ఎందుకు అనుమానం రాలేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. హైపర్ కమిటీని ఏర్పాటు చేశామని ఉన్నతాధికారులు చెబుతున్నా ఇప్పటివరకు ఆస్పత్రికి రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. లోతుగా విచారిస్తే నేతలు, ఉన్నతాధికారుల పేర్లు బయటకు వస్తాయనే నెపంతో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలను ప్రజలు వ్యక్త పరుస్తున్నారు. ఈ విషయంపై డిసిహెచ్ఎస్ ఆనంద్ మూర్తిని వివరణ కోరగా మరో మూడు రోజుల్లో హైపవర్ కమిటీ ఏరియా ఆస్పత్రికి విచారణకు వస్తుందని చెప్పారు.








కామెంట్‌లు (0)