గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపంటలేదు.. పని లేదు.. చేసిన పనికి కూలి రాదు..

23 గంటల క్రితం

upadi-1791206843896-2782.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 04:32 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • కరువు కాలంలో ఆర్థిక ఇబ్బందుల నడుమ ఉపాధి కార్మికుల వెతలు

  • 21 లక్షల పని దినాలకు వేతనాలు పెండింగ్‌

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ఒకవైపు కరువు రక్కసి కోరలు చాచడంతో వ్యవసాయ పనులు దొరక్క, మరోవైపు చేసిన ఉపాధి హామీ పనులకు నెలల తరబడి వేతనాలు అందక విజయనగరం జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులు, కార్మికులు దిక్కుతోచన స్థితిలో ఉన్నారు. వర్షాభావం కారణంగా సాగు కుంటుపడటంతో పేదలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు జీవనాధారంగా మారింది. అయితే, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉపాధి కార్మికులకు రావాల్సిన రూ. 50.15 కోట్ల వేతనాలు బకాయిలుగా పేరుకుపోవడంతో వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఉపాధి నమ్ముకున్న కుటుంబాల చేతిలో పైసా లేక, నిత్యావసరాలు కొనలేక సతమతమవుతున్నారు.

విజయనగరం జిల్లాలో 2026–27లో 3.68 లక్షల జాబ్‌ కార్డులు ఉన్నాయి. వీటిలో 3.35 లక్షల జాబ్‌ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కార్డుల పరిధిలో 6.34 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వీరిలోనూ 5.38 లక్షల మంది రోజువారీ పనులకు వెళ్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 24 నాటికి జిల్లాలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్, విబి గ్రామ్‌ జి పథకాలు కలిపి 155.23 లక్షల పని దినాలు నమోదు కాగా, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చేసిన పనులకు నిధులు విడుదల కాలేదు. ఈ రెండు నెలల కాలానికి సుమారు 21 లక్షల పని దినాలకు సంబంధించి సుమారు రూ.50.15 కోట్ల వేతనాలు బకాయిగా ఉన్నట్లు డ్వామా (జిల్లా నీటి నిర్వహణ సంస్థ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఓ వైపు కరువుతో ఉపాధి కోల్పోయిన గ్రామీణ పేదలకు చేసిన పనులకు కూడా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పంట లేక రైతు.. పని లేక కార్మికుడు

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్ ప్రారంభం నుంచి వారం రోజుల క్రితం వరకు వర్షాభావ పరిస్థితులే ఎదురయ్యాయి. జూన్‌‌లో 2.02 మిల్లీ మీటర్లు, జూలైలో 65.98 మిల్లీ మీటర్లు, ఆగస్టులో 28.05 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదు అయ్యింది. ఆ కాలానికి అన్ని పంటలూ కలుపుకుని 3,09,020 ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను కేవలం 1,85,412 ఎకరాలు (60 శాతం) మాత్రమే సాగయ్యాయి. అదును దాటించి సెప్టెంబర్‌‌లో తుపాను రావడంతో 60 శాతం సాగుతో కలుపుకుని మొత్తం 2,88,950 ఎకరాలకు సాగు చేరినట్టుగా వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతానికి మించి 60.65 మిల్లీ మీటర్ల వర్షం కురిసినప్పటికీ సీజన్ మొత్తంగా ఇంకా12.16 మిల్లీ మీటర్ల వర్షపు లోటు ఉంది. మూడు రోజులపాటు తుపాను ముంచెత్తడంతో అరటి, బొప్పాయి, కూరగాయలు తదితర పంటలు దెబ్బతిన్నాయి. దీంతో వ్యవసాయ కార్మికులతో పాటు చిన్న, సన్నకారు రైతులకు సైతం ఉపాధి పనులే గత్యంతరంగా మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధి బకాయిలు పెండింగ్ ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్ష్యం 65 లక్షలు.. వచ్చింది 26.61 లక్షల పని దినాలు

విబి గ్రామ్‌ జి కింద జూలై నుంచి డిసెంబర్‌ వరకు 65 లక్షల పని దినాల లక్ష్యం పెట్టుకున్నారు. సెప్టెంబర్‌ 24 నాటికి 26.61 లక్షల పని దినాలు నమోదయ్యాయి. ఇంకా 38.39 లక్షల పని దినాలు సాధించాల్సి ఉంది. సగటు వేతన రేటు రూ.233.15 కాగా, ‌వేతన వ్యయం రూ.59.61 కోట్లుగా నమోదైంది. ఎంజిఎన్ఆర్ఇజిఎస్‌‌లో జూన్‌ వరకు 138.64 లక్షల పని దినాల లక్ష్యానికి 128 లక్షలు సాధించారు. ఈ రెండు పథకాల కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ నమోదైన పని దినాలు 155.23 లక్షలకు చేరాయి. దీన్ని బట్టి ఉపాధి పనులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్టు సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. వాస్తవానికి జిల్లాలో ఎక్కువ మంది కార్మికులకు రోజువారీ ఆహారం, పిల్లల చదువులు, వైద్యం, అప్పుల వాయిదాలు వంటి అవసరాలకు ఉపాధి వేతనమే ఆధారం. జిల్లాలో లక్షలాది మంది కార్మికులు ఈ పథకంపై ఆధారపడుతున్న సమయంలో, చేసిన పనికి వేతనం సకాలంలో అందకపోతే పథకం ఉద్దేశమే దెబ్బతింటుందని పలువురు విమర్శిస్తున్నారు .

పనులు చేసినా కూలి చెల్లించలేదు : - శంకర్, ఉపాధి కార్మికుడు, రంగుపురం గ్రామం, గజపతి నగరం మండలం

​గతంలో బయట ప్రాంతాలకు వలసలు వెళ్లి జీవనం కొనసాగించేవాడిని. ఐదు నెలల నుంచి సొంత ఊరిలోనే ఉన్నాను. ఉపాధి పనులకు ఐదు వారాలు పాటు వెళ్లాను. నెలరోజులైనా వేతనాలు అందలేదు. మరోవైపు పెరుగుతున్న ధరలతో జీవనం కష్టంగా మారింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్