ఇప్పటికీ 46 శాతం రోడ్లు మట్టి, కంకర రోడ్లే
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల రహదారి వ్యవస్థ ఇంకా అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 68,233 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్లో దాదాపుగా సగం కచ్ఛా రోడ్లే కావడం గమనార్హం. పల్లె పండుగ 1.0, పల్లె పండుగ 2.0 ఇలా విడతలు గడిచి పోతున్నా, రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నా పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. పంచాయతీరాజ్ శాఖ లెక్కల ప్రకారం, మొత్తం రహదారుల్లో పక్కా రోడ్లైన బిటుమినస్ టార్మాక్ - బి.టి (తారు రోడ్లు, సిమెంట్ కాంక్రిట్ - సి.సి రోడ్లు కలిపి 36,894 కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయి. అంటే కేవలం 54 శాతం మాత్రమే పక్కా రోడ్లు ఉన్నాయి. మిగిలిన 46 శాతం అంటే 31,339 కిలోమీటర్లు మేర ఇంకా మట్టి, కంకర, డబ్ల్యు.బి.ఎం రోడ్లుగానే ఉన్నాయి. కచ్చా రోడ్లలో మట్టి రోడ్లు 14,080 కిలో మీటర్లు (21 శాతం), కంకర రోడ్లు 13,386 కిలోమీటర్లు (19 శాతం) వాటర్ బౌండ్ మకాడమ్ - డబ్ల్యు.బి.ఎం రోడ్లు 3,873 కిలోమీటర్లు (6 శాతం) వర్షాకాలంలో ఈ కచ్ఛా రోడ్లు బురదమయంగా మారి గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు పంటను మార్కెట్ కు తరలించడానికి, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి, అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు వెళ్లడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాల ద్వారా గ్రామీణ రహదారులను పక్కా రోడ్లుగా మార్చేందుకు చర్యలు చేపట్టినా, లక్ష్యం ఇంకా చాలా దూరంలోనే ఉందని స్పష్టం అవుతుంది.
పక్కా రోడ్లలోనూ అధ్వానమే...
రాష్ట్రంలో గ్రామీణ రోడ్లలో 54 శాతం మాత్రమే ఉన్న పక్కా రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. మొత్తం 36,894 కిలోమీటర్ల బి.టి, సి.సి రోడ్లలో కేవలం 20,657 కి.మీ. (56 శాతమే) మాత్రమే మోటారు వాహనాలు సాఫీగా వెళ్లే అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాయి. మిగిలిన 44 శాతం రోడ్లు మరమ్మతులు, పునర్నిర్మాణం చేయాల్సి ఉంది. 14,774 కిలో మీటర్లు (40 శాతం) రోడ్లు పూర్తిగా దెబ్బతిని పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. 1,463 కిలో మీటర్లు (4 శాతం) రోడ్లకు గుంతల మయంగా ఉండటంతో పునర్నిర్మాణం చేయాల్సిన ఉంది. అధికారుల అంచనా ప్రకారం, బాగు చేయాల్సిన 16,237 కిలో మీటర్ల రోడ్లలో ఇప్పటివరకు 5,314 కిలో మీటర్ల మేర మాత్రమే నాబార్డ్, ఎపిఆర్ఆర్ఎస్పి కింద మంజూరు అయ్యాయి. ఇంకా 10,923 కి.మీ. మేరకు కొత్త ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. ఇందులో 7,198 రోడ్లు.. మేర పునర్నిర్మాణం, 1,463 కిలో మీటర్ల మేర 843 రోడ్లు పునరుద్ధరణ చేయాల్సి ఉంది. దీనికి భారీగా నిధులు అవసరమని అధికారులు చెబుతున్నారు.







కామెంట్లు (0)