ప్రధాని మోడీ ఇలాక వారణాసిలో డబుల్ పరాభవం
సంఘ్ పరివార్ అడ్డా నాగ్‌పుర్‌లోనూ ఘోర ఓటమి
మండలి ఎన్నికల్లో 28 స్థానాల్లో కమలానికి 13 స్థానాలే
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్‌లో ప్రతిపక్షాల సత్తా
కర్ణాటకలో ఖంగుతిన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో 28 శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి ఘోర పరాభావాన్ని చవిచూడాల్సివచ్చింది. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్‌లలో అక్కడి ప్రజానీకం డబుల్ ఇంజిన్‌కు ప్రజలు బిజెపి డబుల్ ఇంజిన్‌కు బోల్టులు ఊడగొట్టారు. యుపిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో మరోమారు బిజెపి పరాభవాన్ని చవిచూడకతప్పలేదు. ఇక్కడ రెండు పర్యాయాలు ఓట్లు లెక్కింపు చేపట్టినా..సమాజ్ వాదీ పార్టీ చేతిలో కమలం పార్టీ ఓటమిపాలైంది. మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధానకార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. బ్యాలెట్ పేపర్ విధానంలో జరిగిన ఈ ఎన్నికల్లో 28 స్థానాలకు కాంగ్రెస్‌కు దక్కింది ఎన్నంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగాస్ర్తాలు సంధించిన నేపథ్యంలో హస్తం పార్టీకి నాగ్‌పూర్ విజయం దక్కడం విశేషం. బీహార్‌లోనూ కమలం కూటమి కందిపోకతప్పలేదు. ఇక్కడ ఆర్‌జెడి, ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ సత్తా చాటాయి. స్వతంత్రలూ విజయబావుటా ఎగురవేసి బిజెపిని దెబ్బతీశాయి. ఈ నెల 23న నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 28 మండలి స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ నెల 28, 29 తేదీల్లో (బుధ, గరువారాల్లో) ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం స్థానాల్లో బిజెపి 13 స్థానాలకే పరిమితం కాగా..సమాజ్‌వాదీ పార్టీ 5 స్థానాల్లోనూ, ఎన్‌సిపి (శరద్ పవార్) రెండు స్థానాల్లోనూ విజయబావుటా ఎగురవేశాయి. కాంగ్రెస్, జెడియు, జెడిఎస్, ఆర్‌జెడి, జన్ సూరజ్ పార్టీ, శివసేన ఒక్కో స్థానం చొప్పున చేజిక్కించు కున్నాయి. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అధికార అహంకారంలో ఊగిపోతున్న సంఘ్ పరివార్ మూకలకు శాసనమండలి ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు గట్టి మొట్టికాయాలు వేశారని రాజకీయ నిపుణులు విశ్లేష్లిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో డబుల్ పరాభవం
ఉత్తరప్రదేశ్‌లో 11 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 5 గ్రాడ్యూయేట్ స్థానాలు కాగా, మరో 6 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు చెందినవి. 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యుపిలో మండలి ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. బిజెపి తన సర్వశక్తులనూ ఒడ్డింది. అయినా ఆరు స్థానాలకు పరిమితమైంది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఐదు స్థానాల్లో జయభేరి మోగించి బిజెపికి ముచ్చెమటలు పట్టించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఉపాధ్యాయ,గ్రాడ్యూయేట్ రెండు స్థానాలకు ఎన్నికలు జరగగా..రెండింటిలోనూ సమాజ్‌వాదీ పార్టీ విజయపతాక ఎగురవేసింది. వారణాసి ఉపాధ్యాయ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఎస్‌పి అభ్యర్థి లాల్ బిహారీ యాదవ్ మరోమారు విజయభేరి మోగించారు. ఆయన ప్రత్యర్థి అయిన బిజెపి అభ్యర్థి ప్రమోద్ మిశ్రాపై దాదాపు 4,900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే వారణాసి గ్రాడ్యూయేట్ స్థానంలోనూ విజయం సాధించింది. ఈ రెండింటిలో పాటు అగ్రా ఉపాధ్యాయ స్థానంలోనూ, అలహాబాద్-ఝాన్సీ గ్రాడ్యూయేట్, లక్నో గ్రాడ్యూయేట్ స్థానాల్లో ఎస్‌పి గెలుపొందింది. అయితే పశ్చిమ యుపిలో బిజెపి పట్టు నిలుపుకుంది. మీరట్ గ్రాడ్యూయేట్ , టీచర్ స్థానాలను, అలాగే బరేలీ-మొరాదాబాద్ టీచర్ స్థానాన్ని, లక్నో ఉపాధ్యాయ స్థానాన్ని , అగ్రా గ్రాడ్యూయేట్ స్థానాన్ని, గోరఖ్‌పూర్ ఫైజాబాద్ ఉపాధ్యాయ స్థానాన్ని బిజెపి గెల్చుకుంది.
ఈ ఫలితాలపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. యుపిలో బిజెపి ఘోర పరిస్థితులు ఎదుర్కొంటోందని, ఈ పరాభవంతో లక్నో లోని కాషాయ నేతలు న్యూఢిల్లీ పెద్దల ఫోన్లు కూడా తీసే పరిస్థితిలో లేరని ఆయన ఎద్దేవా చేశారు. శాసనమండలి ఎన్నికల్లో బిజెపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొన్నారు.
బీహార్‌లో జన్ సూరజ్ సత్తా
బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏలుబడిలోని బీహార్‌లోనూ కమలం కందిపోయింది. పాట్నా, ముజఫర్‌పుర్, దర్భంగ, పూర్ణియా, సరన్ జిల్లాల పరిధిలోని 8 మండలి స్థానాలకు ఎన్నికలు జరగగా...బిజెపికి మూడు స్థానాలే దక్కాయి. జెడియు ఒక స్థానంలోనూ, ఆర్‌జెడి ఒక స్థానంలోనూ విజయం సాధించగా..ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ అయిన జన్ సూరజ్ మరోమారు సత్తా చాటి ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. మరో రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 8 స్థానాల్లో బిజెపికి నాలుగు సిట్టింగ్ స్థానాలుండగా..ఈ దఫా అది 3 స్థానాలకే పరిమితమైంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రాతినిధ్యం వహించిన బనిక్‌పుర్ అసెంబ్లీ స్థానానికి ఇదివరకే జరిగిన ఉప ఎన్నికల్లో జన్ సూరజ్ అధినేత ప్రశాంత్ ఆ స్థానాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
మహారాష్ట్రలో ప్రతిపక్షాలదే పైచేయీ
మహారాష్ట్రలోనూ బిజెపి డబుల్ ఇంజిన్‌కు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. నాగ్‌పుర్, పూణే, అమరావతి, కోల్హాపుర్, సంగ్లీ, ఛత్రపతి శంబాజీనగర్ తదితర జిల్లాల పరిధిలోని 5 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగగా..అధికార మహాయూతి రెండు స్థానాలకే పరిమితమైంది. ప్రతిపక్షాల ఐక్య వేదిక అయిన మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎంవిఎ) మూడు స్థానాలను కైవసం చేసుకొని పైచేయీ సాధించింది. పూణే ఉపాధ్యాయ స్థానంలో బిజెపి విజయం సాధించగా..అమరావతి ఉపాధ్యాయ స్థానంలో శివసేన గెలుపొందింది. ఇక ప్రతిపక్షాల వేదికలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) రెండు స్థానాల్లో జయభేరీ మోగించింది. పూణే గ్రాడ్యూయేట్ స్థానాన్ని, అలాగే ఔరంగాబాద్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పుర్‌లో కాంగ్రెస్ విజయపతాక ఎగురవేసింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన అభిజిత్ వంజరీ తన సమీప ప్రత్యర్థి అయిన బిజెపి అభ్యర్థి సుధాకర్ కోహాలే పై ఘన విజయం సాధించారు. నాగ్‌పుర్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వస్థలమున్న జిల్లా కూడా కావడంతో బిజెపి సర్వశక్తులను ఒడ్డినా ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించడం విశేషం.
కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
కర్ణాటకలో ముఖ్యమంత్రి డికె శివకుమార్ నాయకత్వ పటిమకు పరీక్షగా భావించిన మండలిలో ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ నాలుగు స్థానాలకు మండలి ఎన్నికలు జరగగా..కాంగ్రెస్ అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది. కాంగ్రెస్ ఒక సిట్టింగ్ స్థానమైన బెంగళూరులో జనతాదళ్ (సెక్యులర్) గెలుపొందింది. ఇక బిజెపి తన మూడు సిట్టింగ్ స్థానాలనూ నిలుపుకుంది. నార్త్ ఈస్ట్ ఉపాధ్యాయ, సౌత్ ఈస్ట్ గ్రాడ్యూయేట్, అలాగే వెస్ట్ గ్రాడ్యూయేట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులపై బిజెపి విజయం సాధించింది. దీంతో 75 స్థానాలున్న శాసనమండలిలో సంఖ్యాబలం కాంగ్రెస్ 38 స్థానాలు, బిజెపి 24, జెడిఎస్ 6, ఒక స్వతంత్ర సభ్యులు కాగా..ఒక స్థానం భర్తీ చేయాల్సివుంది. మరో 5 స్థానాలను ప్రభుత్వం నామినేట్ చేయాల్సివుంది. ఈ ఫలితాలపై ముఖ్యమంత్రి డికె శివకుమార్ స్పందిస్తూ ప్రజలు తమకు ఒక సందేశమిచ్చారని పేర్కొన్నారు. ఫలితాలను సమీక్షించుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బివై విజేయంద్ర స్పందిస్తూ కాంగ్రెస్ విధానాలకు ఈ ఎన్నికలు ప్రతిఘటనగా పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)