ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవర్షాభావం.. ఉపాధి వైపు అడుగులు

1 గంట క్రితం

upadi.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 05:12 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కార్మికులకు ఆ పనులే జీవనాధారం

  • విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధిక పనిదినాలు

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రం కావడంతో ఖరీఫ్ వ్యవసాయం కుదేలైంది. సాధారణంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరి నాట్లు, కలుపుతీత పనులతో చేతినిండా పనులు ఉండాల్సిన వ్యవసాయ కార్మికులు.. ఈ ఏడాది ఆశించిన వర్షాలు లేక పనులు దొరకని పరిస్థితి తలెత్తింది. ఉపాధి కోల్పోయిన వేలాది మంది గ్రామీణ కార్మికులకు ఇప్పుడు ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. తీవ్రమైన కరవు ఛాయల మధ్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఆదుకుంటూ, ఈ సంక్షోభ సమయంలో ఉపాధి హామీ పథకమే కార్మికులకు ఏకైక కీలక జీవనాధారంగా మారింది.

రాష్ర్ట వ్యాప్తంగా 28 జిల్లాల్లో సుమారు 69,81లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు 28 వరకు మొత్తం వీరందరికీ మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) 14 కోట్ల 80 లక్షల 58 వేల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, దాదాపు ఆ లక్ష్యం పూర్తైంది. ఆగస్టు 28 నాటికి రూ.16 కోట్ల 48 లక్షల 92 వేల పనిదినాలు కార్మికులు ఉపయోగించుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 1.40 కోట్లు పని దినాలు వినియోగించుకున్న జిల్లాగా విజయనగరం ఉంది. ఈ జిల్లాలో జూన్ వరకు ఆమోదిత లక్ష్యం 1.38 కోట్ల పనిదినాలు కాగా 1.27 కోట్ల పనిదినాలు వినియోగించుకున్నారు. జూలైలో 5.24 లక్షలు, ఆగస్టులో ఇప్పటి వరకు 7.19 లక్షల పని దినాలను కార్మికులు వినియోగించుకున్నారు. దీన్ని బట్టి ఈ జిల్లాలో వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల ఉపాధి పనుల వైపు పూర్తిగా మళ్లిపోయారని అర్థమౌతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు కోటి 35 లక్షల 55 వేల పనిదినాలు నమోదయ్యాయి. కాస్త నీటి వనరులు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో కూడా మొదటి మూడు నెలలకు 17.82 లక్షల పనిదినాలకు గాను, 23.79 లక్షల పనిదినాలను కార్మికులు ఉపయోగించుకున్నారు.

సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో వరి నాట్లు, కలుపుతీత, పొలాల నిర్వహణ వంటి పనులతో ఈ సమయంలో నిరంతర ఉపాధి లభిస్తుంది. అందుకే ఆయా సమయాల్లో అధికారులు కూడా ఉపాధి పనులు నిలిపివేస్తుంటారు. కానీ, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు విస్తీర్ణమే గణనీయంగా తగ్గిపోయింది. దీంతో వ్యవసాయ కార్మికులకు సీజన్‌లో దక్కాల్సిన పనులు కూడా తగ్గిపోయాయి. విజయనగరం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల అన్ని పంటలూ కలుపుకుని ఇప్పటి వరకు 47 శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగు కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఉపాధి హామీ పనులే గ్రామీణ కుటుంబాలకు జీవనాధారంగా మారాయి. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్