ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడ్రోన్ దీదీ కుముందిని

1 గంట క్రితం

dronefarming
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 06:04 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

‘‘రైతులు తమ పంటను పురుగుల నుంచి కాపాడుకోవడానికి రసాయనాల్ని కలిపిన ట్యాంక్‌ను వెనుకకు తగిలించుకుని మొక్కలపై పిచికారీ చేస్తారు. దీనివల్ల వారికి వెన్నెముక నొప్పి రావడమే కాదు.. అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి రసాయనాల తీవ్రతకు తీవ్ర అస్వస్థతకు కూడా గురవుతారు. అదే రైతులు డ్రోన్ల సహాయంతో కేవలం ఐదు-ఆరు నిమిషాల వ్యవధిలోనే ఒక ఎకరానికి, ఒక్కరోజులో ఏకంగా ఇరవై ముప్పై ఎకరాలకు పిచికారీ చేయొచ్చు.’’ అని ఆలోచించారు ఒడిశాకు చెందిన కుముదిని స్వైన్. తరువాత దానిని ఆచరణలోకి తెచ్చి, డ్రోన్ దీదీగా పేరు తెచ్చుకున్నారు.


ఒడిశాలోని ఖోర్ధా జిల్లా బలిపట్నకు చెందిన కుముదిని బీఎస్సీ డిగ్రీ చదివారు. కొన్ని సంవత్సరాలపాటు కొన్ని పాలడైరీ సంస్థల్లో పనిచేశారు. కోవిడ్ సమయంలో డైరీ మూసివేయడంతో తనతోపాటు, తన భర్త ఉద్యోగం పోయింది. దీంతో తన ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడానికి వారికున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేయడం ప్రారంభించారు. మొదట కూరగాయల్ని పండించారు. కొన్ని నెలల తర్వాత వ్యవసాయం చేయడం వల్ల రైతులెంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకున్నారావిడ. పెట్టుబడులకు తగ్గట్టు రాబడి లేదు. పంట బాగా పండినా మార్కెట్లో ధర లేకపోవడం వల్ల వ్యవసాయం వల్ల నష్టం వస్తుందని తెలుసుకుందామె. అప్పుడే ఆమె అందరికంటే భిన్నంగా ఆలోచించింది. రైతులు పండించిన పంటలకు తగ్గట్టుగా మార్కెట్ సృష్టిస్తే ఇదే ప్రధాన ఆధారమవుతుంది. చాలా కుటుంబాలు వ్యవసాయం వైపు మళ్లుతాయని ఆమె ఆలోచించారు.

రైతుల భాగస్వామ్యంతో...

తన గ్రామంతోపాటు శ్రీరాంపూర్ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులతో ఆమె అనేకసార్లు చర్చలు జరిపింది. కేవీకే ఖోర్ధా (వ్యవసాయ విజ్ఞాన కేంద్రం), నిగమ్ అనే ఎన్జీవో సంస్థల్ని సంప్రదించి రైతులను, మహిళలను సమీకరించి మహీరా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ (ఎఫ్‌పీసీ)ని ప్రారంభించారు. ఈ కంపెనీ మొదట 35 గ్రూపులతో 700 మంది రైతులతో ప్రారంభమైంది. ఇప్పుడందులో 960 మంది సభ్యులున్నారు. ఈ సహకార సంస్థలో మొదట రైతులు చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. మొదట్లో తన సొంత డబ్బులతోనే ఈ సంస్థను ఆమె నడిపారు. సహకార సంస్థలో చేరడం వల్ల రైతుల పంటకు మార్కెట్ లభిస్తుందని, ఆర్థికంగా నిలదొక్కుకుంటారని వారికి అర్థమయ్యేలా చెప్పి ఇందులో భాగస్వాముల్ని చేశారు. వాటాల రూపంలో మొదట ఐదు లక్షల మూలధనంతోపాటు, ‘సమున్నతి ఫైనాన్స్’ నుంచి రుణం తీసుకుని ఆ డబ్బుతో ఐదెకరాలు లీజుకు తీసుకుని సాగు చేశారు. అందులో ఒక ఎకరానికి పైగా పుట్టగొడుగుల్ని పండించారు. పండ్ల చెట్లను నాటారు. కోళ్ల ఫారం షెడ్‌ను ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ, పండ్లు, వ్యవసాయం ఇలా పలు రకాలుగా మార్కెట్‌కు అనుకూలంగా పండించడంతో లాభాలు వచ్చాయి. ఆ లాభాలు రైతులకందివ్వడంతో చాలా మంది రైతులతోపాటు యువకులు, మహిళలు కూడా ఇందులో సభ్యులుగా చేరారు. ఈ సంస్థలో ఇప్పుడు సుమారు 70 శాతం మహిళలే ఉన్నారు. 60 శాతం మంది యువ రైతులున్నారు. దీంతో ఉత్పత్తి పెరిగింది. ఇప్పుడు ఎఫ్‌పీసీఎల్ సంస్థ సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా టర్నోవర్ జరుగుతోందని కుముదిని చెప్పారు.

డ్రోన్లతో అన్నదాతలకు అండగా...

కుముదిని వ్యవసాయోత్పత్తుల్ని మరింత పెంచడానికి సాంకేతికతను అందిపుచ్చుకున్నారు. కొత్త పరికరాలపై దృష్టి పెట్టారు. 2022లో అగ్రికల్చరల్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఆమె 15 రోజులపాటు డ్రోన్లను ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకున్నారు. ఆమె ఈ శిక్షణ ద్వారా డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) సర్టిఫికెట్ కూడా పొందారు. 15 లక్షలతో మహీరా కంపెనీ సొంత డ్రోన్‌ను తయారుచేసుకుంది. ఈ డ్రోన్ ఆపరేటింగ్ ఎలా చేయాలో రైతులందరికీ ఆమె వివరించడంతో మొదట్లో సంకోచించినా.. ఆ తర్వాత దాని ప్రయోజనాలను చూసి వారెంతో సంతోషించారు. ఇప్పుడు తన భర్తతోపాటు మరెంతోమంది డ్రోన్లను నిర్వహించడంలో శిక్షణ పొందారు. ఇప్పుడు వారి వద్ద రెండు డ్రోన్లు ఉన్నాయి. యంత్రాల గురించి తెలియని మహిళలకు వాటిని ఆపరేట్ చేస్తున్నారు.

ఈ మహీరా సహకార సంస్థ వల్ల రైతులు మాత్రమే కాదు. చిన్న చిన్న పరిశ్రమలవారు కూడా ఎంతో లాభపడ్డారు. 40 ఏళ్ల సులోచన ఈ మహీరాలో చేరకముందు డిస్పోజల్ తయారుచేసే సంస్థ దక్షను నడిపేవారు. అయితే తమ ఉత్పత్తులకు మార్కెట్ సరిగ్గా లేకపోవడంతో ఈమె 'మహీరా' కంపెనీ మద్దతుతో తన వస్తువులకు మార్కెట్ ఉండేలా చేసుకున్నారు. గతంలో 25 వేలు సంపాదించే ఈమె ఇప్పుడు 40 నుంచి 50 వేలు దాకా సంపాదిస్తున్నారు. ఈ సంస్థ టర్నోవర్ కూడా 50 లక్షలకు చేరుకుంది. మరో 30 మందికి ఆమె ఉపాధి కల్పిస్తున్నారు. మహీరా కంపెనీ ప్రవేశపెట్టిన డ్రోన్లు మహిళలకెంతో ప్రయోజనకరమని సులోచన అన్నారు. గతంలో పురుగుమందులు చల్లాలంటే ట్యాంక్‌ను మోస్తూ.. రసాయనాలను పీలుస్తూ పొలంలో రోజంతా గడపాల్సి వచ్చేది. అదే డ్రోన్ల సాయంతో అదే పని నిమిషాల్లో పూర్తవుతుంది. ఇది చాలా వేగవంతమైనది. సురక్షితమైనది. ఎంతో సమర్థవంతమైనదికూడా అని సులోచన అభిప్రాయపడ్డారు.

మహీరా సంస్థలో చేరిన తర్వాత తన జీవితమే మారిపోయిందని చుమినా పటేల్ అన్నారు. ఆమె ఇంటి దగ్గరుండే సంపాదిస్తోంది. 'సహకార సంస్థల సహకారంతో ప్రభుత్వ పథకం కింద మొదట రెండు మేకల్ని తీసుకుని పెంచడం ప్రారంభించాను. ఆ తర్వాత ఆ సంఖ్యను రెండేళ్లకే 15కి చేర్చాను. అలాగే పుట్టగొడుగుల పెంపకంలో వరిగడ్డిని ఎలా ఉపయోగించాలో మహీరా సంస్థ ద్వారా శిక్షణ పొందాను. ఇప్పుడు నేను పొలాన్ని, మేకల్ని, పుట్టగొడుగుల పెంపకంతో రోజంతా బిజీగా ఉంటున్నాను' అని చుమినా చెప్పారు.

మరిన్ని డ్రోన్ల కోసం తాను ఇంకా ఎక్కువ శ్రమించాలని కుముదిని అన్నారు. ‘వ్యవసాయం అంటే ఇకపై కేవలం కఠిన శ్రమ మాత్రమే కాదు. సరైన సాంకేతికతతో దానిని సులువుగా చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ ముఖ్యంగా మహిళలకు గౌరవాన్ని, నాయకత్వాన్ని అందించే సాధనంగా మారుతుంది. మాతో అనుబంధం ఉన్న ప్రతి మహిళా రైతు స్వతంత్రురాలిగా మారాలని నేను కోరుకుంటున్నాను. వారు రుణాలపై ఆధారపడకుండా, పని ద్వారా సాధికారత పొందాలి’ అని ఆమె అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్