ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆశయ నిబద్ధులు...అంకితమైన కుటుంబాలు...

2 గంటల క్రితం

comrade.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 05:36 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

సోమవారం నాడు రైతుసంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి హఠాత్తుగా కన్నుమూయడం అందరినీ విచారంలో ముంచింది. వయస్సు రీత్యా పెద్దవారైనా ఆ సమయంలో ఆయన మరణం అకస్మాత్తుగానే సంభవించింది. ఆయన చివరి సమయంలో కూడా తనను డిశ్చార్జి చేస్తే వెళ్లి నల్గొండలో జరిగే అఖిల భారత రైతు మహాసభల కోసం కృషి చేయాలని ఆరాటపడినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన గురించి తెలిసిన వారికి ఇదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. మల్లారెడ్డి మరణానంతరం మృతదేహం, చర్మం, నేత్రాలు భద్రపరిచి ఇతరులకు అమర్చే ఏర్పాట్లు చేశారు. ఆయన అంతిమయాత్రలో అన్ని రాజకీయ పార్టీల, సంఘాల నేతలు మేధావులు నివాళులర్పించారు. అనంతరం భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రిలో వైద్య విద్యార్థుల పరీక్షల నిమిత్తం అందజేశారు. ఇటీవలి కాలంలో ఇదొక వరవడిగా మారడం మంచి పరిణామం.​

అంకిత భావంతో ఆఖరు దాకా..​

మల్లారెడ్డి మరణించిన మరుసటి రోజునే వి. సుమతి కూడా దూరమయ్యారు. సిపిఎం సీనియర్‌ ‌నాయకుడు, ఎ.పి రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు సతీమణి మాత్రమేగాక...నిబద్ధ కార్యకర్త, చదువరి, రచయిత్రి కూడా. కుమార్తె డాక్టర్ ప్రతిభ వైద్యశాలలో గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో పెనుగులాడుతూ ఆఖరి శ్వాస విడిచారు. ఆమె శరీరాన్ని కూడా ప్రభుత్వ వైద్యశాలకు అప్పగించారు.​

దీనికి కొన్ని రోజుల ముందు విశాఖపట్నంలో ప్రజా కళాకారుడు, సిఐటియు కార్యకర్త అరుణ్‌‌జీ తన 80వ ఏట చనిపోయారు. ఇప్పటికీ అయిదు దశాబ్దాలుగా ‘ప్రజానాట్యమండలి’లో, ఉద్యమాలలో కృషి చేస్తూ వస్తున్న అరుణ్‌జీ అందరికీ సుపరిచితులు. వీరేగాక మరికొందరు నాయకులు, కార్యకర్తలు కూడా ఈ తరుణంలో కన్నుమూశారు.

జాతీయ స్థాయిలోనూ కొంతమంది కీలక నేతలు, మేధావులు ఈ సమయంలోనే దూరమయ్యారు. కొద్ది రోజుల కిందట ప్రఖ్యాత చరిత్రకారుడు సుమిత్‌ ‌సర్కార్‌ అస్తమించారు. ఆధునిక భారత చరిత్రను ఉద్యమాలను వర్గ దృక్పథంతో, సామాజిక అవగాహనతో పరిశోధించి అక్షరీకరించిన సుమిత్‌ ‌తన రంగంలో అగ్రగామి. ఆయనను చాలామంది అధ్యయానికి మార్గదర్శిగా పరిగణిస్తారు.

ఇక ‘ఐద్వా’ నేతగా కీలకమైన సేవలనందించిన పరిశోధకురాలు, సోన్యా గిల్‌ ‌కూడా ఈ వారంలోనే కన్నుమూశారు. ‘పీపుల్స్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ ‌రూరల్‌ ఇండియా’ పేరిట ప్రజా ఉద్యమాల, ప్రజారాశుల చరిత్ర నిక్షిప్తం చేయడానికి కృషి చేసిన సోన్యా ప్రఖ్యాత పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ ‌భార్య. అనేక మహిళా ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి వాస్తవాలను వెలికితీసిన ప్రతిభావంతురాలు.

వైవిధ్య సేవలు..​

వీరందరి వివరాలు ఇక్కడ ప్రస్తావించడం సెంటిమెంటు కోసమో లేక విచారించడం కోసమో కాదు. దేశమంతటా వివిధ రంగాలలో, వివిధ స్థాయిల్లో ఉద్యమకారులు, ప్రజాపక్ష మేధావులు ఎంత వైవిధ్య భరితమైన కృషి చేస్తున్నారో, ఎర్రజండాను సమున్నతంగా ఎగరేస్తున్నారో స్మరించు కోవడానికి, నివాళులర్పించడానికి మాత్రమే. ఈ కాలంలో తెలుగు నాట, దేశంలో కూడా మరికొంతమంది నేతలు, కార్యకర్తలు కూడా ప్రాణాలు వదిలారు. అందరి పేర్లు ఇక్కడ పేర్కొనడం సాధ్యం కాకపోవచ్చు గానీ వారంతా అంతే అంకితభావం గలవారన్నది ఇక్కడ కీలకం. గతవారం ఇదే శీర్షికలో జెన్‌ ‌జీ ‌పోరాటం తీసుకొచ్చిన సంచలనం గురించి చెప్పుకున్నాం. ఇది దానికి మరో పార్శ్యం. యావజ్జీవితం విప్లవాశయాలకు, ప్రగతిశీల భావజాలానికి సమర్పించిన సార్థక జీవుల సంస్మరణ. విశేషమేమంటే వీరందరూ దంపతులు, పిల్లలూ, పెద్దలూ, కుటుంబాలతో సహా తరాల పర్యంతం ఉద్యమ పథంలో వున్నవారే కావడం.

మళ్లీ మల్లారెడ్డినే తీసుకుంటే ఆయన స్వతహాగా పటేల్‌ ‌పని చేస్తున్నవారు. అయితే ప్రభుత్వ అన్యాయాలపై ఎలుగెత్తి నిలబడి ఐచ్ఛికంగా ఉద్యోగం వదలుకున్నారు. ప్రజా ఉద్యమాలకు పేరెన్నిక గన్న వరంగల్‌‌లో దశాబ్దాల తరబడి కృషి చేశారు. 1971లో సిపిఎం కు ఏకైక ఎంఎల్‌ఎ గా ఓంకార్‌‌ను గెలిపించిన నర్సంపేట ప్రాంతంలో అనేక ఆటుపోట్లను తట్టుకున్నారు. నిర్మాణాత్మక కృషి చేశారు. తర్వాత కాలంలో హైదరాబాద్ వచ్చి రాష్ర్ట నాయకత్వంలో కీలక ప్రాత పోషించారు. ఆయన పెద్ద పట్టాలు తీసుకోలేదు. కానీ ఉద్యమావసరాల కోసం విస్తారంగా అధ్యయనం చేశారు. ఆయన భార్య భాగ్యలక్ష్మమ్మ రైతు సంఘంలో, మహిళా సంఘంలో పనిచేశారు. కుమారులు‌ వాసుదేవ్‌, మధుసూదన్‌ కూడా ఉద్యమంతోనే నిలిచారు. ఇద్దరూ కోవిడ్‌‌లో కరోనా బారిన పడి కూడా తట్టుకున్నారు. కుమార్తె కేన్సర్‌తో పోరాడుతూ ‌మృతి చెందితే అకాల మరణాన్ని కూడా తట్టుకుని నిలబడ్డారు. ఇన్ని సవాళ్ల మధ్యనా మల్లారెడ్డి అకడమిక్‌ ‌రంగంలో వారితో పోటీ పడేలా ఎప్పుడూ సాధికారిక సమాచారం సేకరిస్తూ లెక్కలు, పత్రాలతో సిద్ధంగా వుండేవారు. అడిగినదే తడువుగా వ్యవసాయం, నీటిపారుదల, పౌర సరఫరాలు వంటి అంశాలపై సమాచారమిచ్చేవారు. రాజకీయ, మీడియా మిత్రులందరికీ ఆయన ఒక సమాచార వనరు, నెనరు. ఆ తరంలో కొరటాల సత్యనారాయణగారి తర్వాత మల్లారెడ్డినే చెప్పుకోవలసి వుంటుంది. వ్యక్తిగతంగా నాకూ చాలా సన్నిహితులు. తనతో రైతుసంఘంలో పనిచేసిన మా నాన్న నరసింహయ్య మొదటి రోజుల్లో చెప్పిన అర్థశాస్ర్తం క్లాసులు ఎంతగా ఉపయోగపడ్డాయో ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు. నాన్న మరణానంతరం ఒకసారి స్మారక ప్రసంగం చేసేందుకు వచ్చిన మల్లారెడ్డి వాహనం కోసం చూడకుండా అదే రాత్రి బస్సెక్కి ఉదయాన్నే సెమినార్‌‌కోసం తిరిగి వెళ్లిపోవడం బాగా గుర్తు.

సుమతి​, అరుణ్‌‌జీ​

సుమతి పుట్టింది కూడా కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా పేరొంది ఘోర నిర్బంధం చూసిన కాటూరులో. ఆమె తండ్రి వల్లపల్లి నాగభూషణం, తల్లి తులసమ్మ. కుటుంబీకులు కూడా ఉద్యమాభిమానులు. పెళ్లి సమయానికి మధు ఎస్‌ఎఫ్‌ఐ తొలి రాష్ట్ర కార్యదర్శి. నిజానికి నన్ను ‘ప్రజాశక్తి’లో చేరాలని ఆహ్వానిస్తూ తొలుత లేఖ రాసి పిలిపించింది మధూనే. చాలాకాలం వారి ఇంటిపక్కన గదిలోనే నేనూ వుండేవాణ్ణి. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగంతో పాటు స్వయంకృషితో అధ్యయనం చేశారు సుమతి. ‘ప్రజాశక్తి’కి ఆదివారం సంచికకు చాలాసార్లు రచనలు ఇస్తుండేవారు. పదవీ విరమణ తర్వాత బుక్‌‌హౌస్‌‌ కోసం కొంత కాలం పనిచేసినప్పుడే ‘మతం మార్కెట్‌ ‌ముట్టడిలో మహిళ’, ‘అందరికీ ఆరోగ్యం’ వంటి ముఖ్యమైన రచనలు అనువాదం చేశారు. ఇందులో ‘మతం మార్కెట్‌ ‌ముట్టడిలో...’ అనేది చాలా కీలకమైన ‘ఐద్వా’ అధ్యయన పత్రాలతో కూడినది. మార్కెట్‌ ‌యుగంలో మహిళల మనుగడ సవాళ్లు ఏమిటో చెబుతాయి. ‘మానవి’ పత్రికలోనూ కృషి చేశారు. ఉద్యమానికి ఆర్థికంగా చేతనైన సహాయం అందిస్తూ వచ్చారు. కుమార్తె డాక్టర్‌ ‌ప్రతిభ, అల్లుడు మధుసూదన్‌ ‌కూడా ఉద్యమాభిమానులుగా నిలిచారు.

అరుణ్‌‌జీ కుటుంబం కూడా ఈ కోవలోనే ఆయనతో నిలబడింది. ఆయన అనారోగ్యం పాలయ్యాక, గొంతు దెబ్బ తిన్నాక కూడా వారు జాగ్రత్తగా చూసుకోవడమేగాక సభలకు తీసుకొస్తుండేవారు. కమ్యూనిస్టులే కుటుంబాలను ఉద్యమాలలోకి తీసుకురారనే అపప్రధకు సమాధానం ఇలాంటి ఉదాహరణలు.​

శిఖరాగ్ర చరిత్రకారుడు..​

ఇక చరిత్రకారుడూ, బోధకుడూ సుమిత్ సర్కార్‌ ‌కృషి శిఖాగ్రమైనది. తన తండ్రిగారైన సుశోభన్‌ ‌చంద్ర సర్కార్‌‌ కూడా కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్‌. తొలి తరంలో మార్క్సిస్టు పరిశోధనా పద్ధతిని, అధ్యయనాన్ని ప్రోత్సహించడమే గాక కమ్యూనిస్టు ఉద్యమానికి సన్నిహితంగా మెలిగినవారు. సుమిత్‌ ‌సర్కార్‌ ‌కూడా అదే కోవలో పెరిగి పరిజ్ఞానం పెంచుకున్నారు. ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యయనం చేశాక 1974లో ఢిల్లీ యూనివర్సిటీలో చేరారు. అధ్యయనం, బోధనతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (‌డియుటిఎ)లో చురుగ్గా పని చేశారు. గతితార్కిక దృష్టితో ఆధునిక భారత దేశ చరిత్రలో వివిధ తరగతులు వర్గాల పాత్ర, మరీ ముఖ్యంగా బెంగాల్‌‌లో ఉద్యమాలు వంటి వాటిని విస్తారంగా అధ్యయనం చేశారు. ‘స్వదేశీ ఉద్యమం’, ‘ఆధునిక భారతదేశం’ అన్న ఆయన రచనలు ప్రామాణికమైనవి. ఈ చివరి పుస్తకాన్ని ఎప్పటికప్పుడు పున:పరిశీలన చేస్తూ మరోసారి మెరుగుదిద్దారు. మత రాజకీయాల ముప్పు పెరిగాక తొలుత వెలువడిన ‘ఖాకీ షార్ట్స్ - శాఫ్రన్ ఫ్లాగ్స్‌’ ‌తీసుకొచ్చారు. ఇవన్నీ చదువరులకు సుపరిచితాలే. కేవలం రచనలేగాక బోధనలోనూ సుమిత్‌ ‌తనదైన విలక్షణ శైలితో ఒక ముద్ర వేశారు. బెంగాలీ భాషలో తరచూ చెప్పుకునే భద్రలోక్‌ అనే మధ్యతరగతి ధోరణులను అధిగమించి ఉద్యమాలతో మమేకమయ్యారు.

సోన్యా గిల్‌...​

పాలగుమ్మి సాయినాథ్‌‌ తాత వి.వి.గిరి మాజీ రాష్ర్టపతి. తొలి దశలో గిరి కాంగ్రెస్‌ ‌కార్మికోద్యమంలో పనిచేశారు. సాయినాథ్‌‌తో పెళ్లికి ముందే సోన్యా గిల్‌ ఢిల్లీ జెఎన్‌‌యు లో విద్యార్థి ఉద్యమాలతో ఉన్న వ్యక్తి. తర్వాత కాలంలో మహిళల హక్కుల కోసం, రైతాంగ సమస్యల కోసం గట్టిగా కృషి చేశారు. ‘ఐద్వా’ మహారాష్ర్ట కార్యదర్శిగా పనిచేశారు. ఎప్పటికప్పుడు కరపత్రాలు, పుస్తకాలు, పత్రికల వంటివి తీసుకురావడమే గాక క్షేత్ర స్థాయిలోనూ విశేష కృషి చేశారు. సామాన్య ప్రజల జీవితాలను, ఉద్యమాలు పోరాటాలను నిక్షిప్తం చేయాలనే తపనతో నెలకొల్పిన ‘పీపుల్స్‌ ఆర్కైవ్ ఆఫ్‌ రూరల్‌ ఇండియా’కు ఆమె డైరెక్టర్‌‌గా వున్నారు. సోన్యా గిల్‌ ‌సేవలను కొనియాడుతూ పెద్దలు చెప్పిన నివాళులు చూస్తే ఆమె ఉద్యమంతో ఎంతగా పెనవేసుకుపోయారో తెలుస్తుంది. మరణానికి వారం ముందే ఆమె హైదరాబాద్‌‌లో వదిన (సాయినాథ్‌ ‌పెద్దక్క) 75వ పుట్టిన రోజుకు వచ్చి వెళ్లడం విశేషం. ‘పని మొత్తం సోన్యా చేస్తుంది, రచనకు పేరు మాత్రం సాయినాథ్‌‌కు దక్కుతుంది’ అని ఆమె అత్తగారు అంటుండేవారని తీస్తా సెతల్వాద్‌ ‌రాశారు.

షావుకారు జానకి నుంచి...

ఇంత ప్రత్యక్షంగా కాకున్నా ఈ వారమే కన్ను మూసిన షావుకారు జానకి తొలుత అక్కినేని పక్కన ప్రముఖ కథానాయికగా చేసింది కమ్యూనిస్టులు తీసిన ‘రోజులు మారాయి’ చిత్రంతోనే. జానకి, చెల్లెలు కృష్ణకుమారి రాజమండ్రిలో కమ్యూనిస్టు కార్యాలయం దగ్గర మెస్‌‌ నడుపుతున్న అమ్మగారితో కలిసుంటూ ‘ప్రజానాట్యమండలి’కి చేరువయ్యారు. మహానటి సావిత్రి తొలిసారి పూర్తి కథానాయికగా చేసింది కూడా ‘పీపుల్స్‌ ఆర్ట్‌ ‌థియేటర్‌’ ‌పేరిట తీసిన ‘పల్లెటూరు’లో ఎన్.టి.ఆర్ పక్కనే. ఇక జమున అచ్చంగా డాక్టర్‌ ‌రాజారావు ‘పుట్టిల్లుతో’నే పరిచయమయ్యారు. సావ్రితి కన్నా ముందు అగ్రనాయికగా ఉన్న జి.వరలక్ష్మి చాలా కాలం కమ్యూనిస్టు పార్టీకి గట్టి అభిమాని. ఈ వివరాల జాబితా ఇలా చాలా రాయొచ్చు. వీరందరి నేపథ్యాలు, సేవలూ ఒకే తరహాకు చెందినవి కూడా కాదు. ఉద్యమాలు, సాహిత్యం, చరిత్ర, కళలూ అన్నీ వున్నాయి.

ఆశయ నిబద్ధమైన కుటుంబాలు, వ్యక్తుల కృషి ఎలా ఆఖరి వరకూ కొనసాగిందో సపరివారంగా వారు ఉద్యమాల బాటలో ఎలా నిలిచి వున్నారో గమనించకుండా వ్యాఖ్యలు చేసేవారికి ఈ ఉదాహరణలే సమాధానాలు. నేరుగా కనిపించకపోయినా ఆ ప్రభావాలు చాలా వున్నాయని కూడా చెబుతాయి. ఈ వరవడి కొనసాగుతూనే వుందనడానికి జెన్‌ ‌జీ నేహా బోరా, ఐఫీ ఘోష్‌ ‌వంటి వారు తాజాగా పర్యటించి వెళ్లిన సమావేశాలు ఇచ్చిన ఉత్సాహమే నిదర్శనం. ఎదురుదెబ్బలు, ఆటుపోట్లు ఎన్నయినా ఈ కృషి ఆగేది కాదు. ఒక కవితలో రాసినట్టు...ఆశయం చిరంజీవి, అలా నడిపిస్తూనే వుంటుంది.

t ravi.jpg

తెలకపల్లి రవి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్