ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకొత్త స్వరం!

1 గంట క్రితం

voice.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 05:58 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

"1950 జనవరి 26న మనం ఒక పరస్పర విరుద్ధమైన జీవితంలోకి అడుగుపెడుతున్నాం. రాజకీయాల్లో ఒక మనిషికి ఒక ఓటు-ఒకే విలువ అనే సూత్రాన్ని అంగీకరిస్తున్నాం, కానీ సామాజిక-ఆర్థిక జీవితంలో మాత్రం 'ఒకే మనిషికి ఒకే విలువ' అనే సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉన్నాం. ఈ అసమానతలను త్వరగా తొలగించకపోతే, ఆ అసమానతల వల్ల నలిగిపోతున్న వర్గాలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థనే బద్దలు కొడతాయి" అని 1949 నవంబరు 25న భారత రాజ్యాంగ సభ చివరి సమావేశంలో అంబేద్కర్ చేసిన హెచ్చరిక... నేటి యువత ఆందోళనలకు అద్దం పడుతోంది. అసమానతలు, అవకతవకలు, అవినీతి, అక్రమాలు, ఆధిపత్యం వంటి జాఢ్యాల వల్లే యువత వీధుల్లోకి వస్తున్నారు. ప్రపంచ ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని డప్పు కొట్టుకునే వాళ్ళకు ఓ పిల్లాడు సైతం గట్టి ఝలక్‌ ఇచ్చాడు. దేశ రాజకీయ, సామాజిక యవనికపై అతను విసిరిన ప్రశ్న సమాజాన్ని విస్తుపోయేలా చేసింది. బీహార్ రాజధాని పాట్నా వీధుల్లో బిపిఎస్‌సి వివాదంపై నిరుద్యోగులు, విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఆ పిల్లాడు చూపిన ధైర్యం, ప్రదర్శించిన సామాజిక స్పృహ కేవలం ఒక యాదృచ్ఛికమైన సంఘటన కాదు. అది వ్యవస్థీకృత వైఫల్యాలపై తరం మారుతున్న కొద్దీ తీవ్రమవుతున్న అసంతృప్తికి ఒక సజీవ సాక్ష్యం. ఇరవై ఇంచులైనా లేని ఛాతీతో యాభైయారించిల అధికారాన్నే ఒణికించిన పిల్లాడి గొంతులో నేటి తరాన్ని రగిలించే ప్రశ్న ఉంది. వాడి గుండెలో మార్పు కోసం మేల్కొన్న ఒక మహా స్వప్నం ఉంది. ప్రజాస్వామ్యపు నిద్రలో జోగుతున్న వారిని ఈ సరికొత్త స్వరం మేల్కొలిపింది.

ఆరేళ్ల ఆదిత్య గొంతు లోంచి వెలువడిన ప్రశ్నలు... ఈ దేశ నిరుద్యోగ యువత సంధిస్తున్న ప్రశ్నలు. పరీక్షలు రాసి సంవత్సరాల తరబడి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల ప్రశ్నలు. అవి తల్లిదండ్రుల ఆశలు, అప్పులు, ఆందోళనల ప్రశ్నలు. అంతేకాదు, తమ భవిష్యత్‌ గురించి భయపడుతున్న రేపటి తరం ఈరోజే అడుగుతున్న ప్రశ్నలు. టాగూర్‌ కలగన్నది ‘భయరహిత మనస్సు’ కలిగిన దేశం. ఆ దేశంలో పౌరుడు అధికారాన్ని చూసి వణికిపోకూడదు. ప్రశ్నించడానికి భయపడకూడదు. ఒక ఆరేళ్ల పిల్లవాడు పోలీసుల ముందూ, మీడియా ముందూ, ఒక న్యాయవాది ముందు తన మాట చెప్పడానికి వెనుకాడకపోవడం- అది కేవలం అతని ధైర్యం మాత్రమే కాదు; సమాజంలో ప్రశ్నించే సంస్కృతి ఇంకా చావలేదనడానికి సంకేతం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సిజెపి చేపట్టిన సమరం విజయం సాధించడం, నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో యువత తిరగబడి పాలకులను ఆత్మరక్షణలో పడేసి రాజీనామాలు చేయించడం, జార్ఖండ్‌లో హేమంత్ సొరేన్ ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గి నియామకాలను రద్దు చేయడం, బీహార్‌లో బిపిఎస్‌సి వివాదంతో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌ వంటి పరిణామాలు...‘పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్లు తప్ప’ అనే స్ఫూర్తిని రగిలిస్తున్నాయన్నది నిస్సందేహం. ‘రాజు మరణించె నొక తార రాలిపోయె/ కవియు మరణించె నొక తార గగనమెక్కె/ ...రాజు జీవించె రాతి విగ్రహములందు/ సుకవి జీవించె ప్రజల నాలుకలందు’ అంటారు గుర్రం జాషువా. అధికార బలంతో ప్రజల గొంతు నొక్కాలనుకునే పాలకులు చరిత్ర పుటల్లో కనుమరుగవుతారు. కానీ ప్రజల తరఫున, భవిష్యత్తు తరాల తరఫున మాట్లాడేవారిని పాలకులు దిమాగీ నక్సల్, అర్బన్‌ నక్సల్‌, ఇప్పుడు ఆల్ఫా నక్సల్‌ వంటి పేర్లు పెట్టినా...మార్పు కోరే భావజాలాలే చరిత్రను నిర్దేశిస్తాయి, సరికొత్తగా నిర్మిస్తాయి.

మార్క్స్‌ చెప్పినట్టుగా ‘చరిత్రను మార్చేది కేవలం ఆలోచన కాదు; ఆ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొచ్చే ప్రజలే’. భారత సమాజంలోనూ ప్రతి సామాజిక మార్పు వెనుక ప్రజల చైతన్యం ఉంది. రైతు ఉద్యమాల నుంచి కార్మిక పోరాటాల వరకు, విద్యార్థి ఉద్యమాల నుంచి సామాజిక ఉద్యమాల వరకు- ప్రశ్నించిన గొంతులే మార్పునకు బాటలు వేశాయి. ఈ పోరాట పటిమ కేవలం ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితం కాకుండా, భవిష్యత్తు తరం గుండెల్లోకి ప్రవహిస్తోంది. ఈ ప్రశ్నలు అధికారపు చెవులకు చేరితేనే కాదు... ప్రజల గుండెల్లోకి చేరితే అవి ఉద్యమంగా మారతాయి. ఆదిత్య గొంతు ఈ రోజు చిన్నదే కావొచ్చు- అది... రేపటి తరాల మహా గర్జనకు తొలి అక్షరం! ఆరేళ్ల పిల్లాడ్ని పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పడం, అతని కుటుంబం భయంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. భద్రత పేరుతో పోలీసులు చెప్పే కట్టుకథలను సమాజం నమ్మే స్థితిలో లేదు. చిన్నారి ఆదిత్య అడిగిన ప్రశ్నలకు, సవాళ్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. యువతకు కావాల్సింది ఉచిత హామీలు కాదు, పారదర్శకమైన నియామకాలు, నాణ్యమైన విద్య, భరోసానిచ్చే భవిష్యత్తు. నిర్బంధాలు పెరిగే కొద్దీ నిరసనలు మరెంతగా జ్వలిస్తాయో చరిత్ర నిరూపించింది. ఇప్పటికైనా పాలకులు అహంకారాన్ని పక్కనబెట్టి, విద్యార్థులు, నిరుద్యోగులు, చివరకు ఆరేళ్ల ఆదిత్య అడుగుతున్న ప్రశ్నలకు పారదర్శకమైన సమాధానాలు చెప్పాలి. లేకపోతే, రాబోయే రోజుల్లో ఈ 'జెన్ ఆల్ఫా' నిరసన జ్వాలలు ప్రజాస్వామ్య పునాదులను పునర్నిర్మిస్తాయి!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్