ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చైనా విధానాలతో ఆయుర్వేడంపై రోడ్‌మ్యాప్

2 గంటల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 06:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో భాగం చేయడమే లక్ష్యం

- 95 శాతం వైద్యులు దేశంలోనే సేవలు

- ఔషధాలుగా కాకుండా డైట్ గానే ఎక్కువ వినియోగం

- నితీఅయోగ్ నివెదికలో వెల్లడి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి మరింత గుర్తింపు తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఉత్పత్తులను పెంచడంతోపాటు ఇతర దేశాలకు ఎగుమతులను కూడా పెంచడం లక్ష్యంగా రోడ్ మ్యాప్ తయారు చేయాలనీ నిర్ణయించారు. దీనిపై తాజాగా నీతిఆయోగ్ ఒక నివేదికను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న లోపాలను వివరించడంతోపాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనే స్పష్టతనిచ్చింది.

చైనా సాంప్రదాయ వైద్య విధానంపై ఇప్పటికే అధ్యయనం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అక్కడి విధానాలనే అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. చైనా సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకుని ఆయుర్వేదాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే వ్యూహాన్ని ప్రతిపాదించించడం విశేషం. ప్రస్తుతం భారత్‌లో సుమారు 3.55 లక్షల మంది ఆయుర్వేద వైద్యులు, 415కు పైగా ఆయుర్వేద కళాశాలలు ఉన్నప్పటికీ, ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన సంస్థలు లేవని నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఆధునిక వైద్యంతో అనుసంధానం కూడా పరిమితంగానే ఉందని పేర్కొంది. అందుకే కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లాలని భావిస్తోంది. దీనికోసం స్వల్ప కాలిక, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల్ని సూచించారు.

2029 నాటికి నిర్దేశించుకున్న స్వల్పకాలిక లక్ష్యాల్లో భాగంగా అమెరికా, యూరప్, యూఏఈలపై ఆధారపడకుండా ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఆయుర్వేద ఉత్పత్తుల ఎగుమతులను విస్తరించడంపై దృష్టి సారించనున్నారు. ముడి ఔషధాల కంటే తయారైన ఆయుర్వేద మందులు, వెల్‌నెస్ ఉత్పత్తులు, డైటరీ సప్లిమెంట్ల ఎగుమతులను ప్రోత్సహించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక 'ఆయుర్వేద ఫార్మకోపియా–ఎగుమతి ఎడిషన్' రూపొందించడం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి నాణ్యతను పెంచడంపై దృష్టి సారించనున్నారు.

ఆయుష్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ను బలోపేతం చేసి ఎగుమతిదారులకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం, దిగుమతి–ఎగుమతులపై రియల్‌టైమ్ సమాచారం అందించే ఆయుర్వేద ట్రేడ్ డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయడం వంటివి అమలు చేయనున్నారు. అలాగే అమెరికా, యూరప్ వంటి ప్రధాన మార్కెట్లలో నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక వ్యూహం అమలు చేయాలనీ, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా మార్కెట్ అవకాశాలను విస్తరించడంపైనా దృష్టి సారించనున్నారు.

2035 నాటికి నిర్దేశించుకునే మధ్యకాలిక లక్ష్యాల్లో భాగంగా దేశీయ ఆయుర్వేదిక ప్రమాణాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం విదేశాల్లో కూడా ప్యాకేజింగ్, ఫినిషింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పించడం, విదేశాల్లో ఆయుర్వేద ఆసుపత్రులు, క్లినిక్‌లు, వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసే "ఆయుర్వేద యాస్ ఏ సర్వీస్" నమూనాను అభివృద్ధి చేయాలనీ ప్రతిపాదించారు.

ఇక దీర్ఘకాలిక లక్ష్యముగా 2047 నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలోని గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ తో కలిసి ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా వర్తించే భద్రత, నాణ్యత, సమర్థత ప్రమాణాలను రూపొందించడం, ప్రతి ఏడాది గ్లోబల్ సేఫ్టీ రిపోర్ట్, గ్లోబల్ ఎవిడెన్స్ రిపోర్ట్ విడుదల చేయడం, ఆయుర్వేదాన్ని శాస్త్రీయ ఆధారాలతో కూడిన విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థగా ప్రపంచానికి పరిచయం చేయడం, పరిశోధనకు ప్రాధాన్యం కల్పించడంపైనా ప్రణాళికలు సిద్ధం చేయాలనీ నిర్ణయించారు.

వ్యాధులపై పరిశోధనలు

వివిధ రకాల వ్యాధులు వాటి నివారణ చర్యలపైనా దృష్టి సారించాలని ప్రతిపాదించారు. ప్రధానంగా నడుము నొప్పి, మోకాలి ఆస్టియో ఆర్థ్రైటిస్, జీర్ణ సమస్యలు, నిద్రలేమి, ఒత్తిడి, మెటబాలిక్ సిండ్రోమ్, మహిళల ఆరోగ్య సమస్యలపై ఆయుర్వేద చికిత్సల ప్రభావాన్ని నిరూపించే పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. పరిశ్రమ, విద్యా సంస్థల సమన్వయంతో ఆయుర్వేద రీసెర్చ్ డెవలప్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. బీమా డేటా ఆధారంగా రియల్ వరల్డ్ డేటా సేకరణ, ఆయుర్‌జీనోమిక్స్ పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలని పేర్కొంది. సంప్రదాయ జ్ఞానం పేటెంట్‌ చేయలేనప్పటికీ, కొత్త సాంకేతికతలు, తయారీ విధానాలు, నూతన డెలివరీ సిస్టమ్‌లకు పేటెంట్ అవకాశాలపై పరిశ్రమకు స్పష్టత ఇవ్వాలని సూచించింది.

ఎగుమతులపైనే దృష్టి

ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 30 దేశాల్లో వివిధ స్థాయిల్లో ఆయుర్వేదానికి గుర్తింపు ఉంది. భారత్‌లో ఉన్న శిక్షణ పొందిన ఆయుర్వేద వైద్యుల్లో 95 శాతం మంది దేశంలోనే సేవలందిస్తున్నారు. ఆయుర్వేద ఉత్పత్తుల ఎగుమతులు 2014లో 1.09 బిలియన్ డాలర్ల నుంచి 2023లో 2.16 బిలియన్ డాలర్లకు పెరిగినప్పటికీ, ఎక్కువ ఉత్పత్తులు ఔషధాలుగా కాకుండా డైటరీ సప్లిమెంట్లుగానే ఎగుమతి అవుతున్నాయని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం సుమారు 150 దేశాలకు ఆయుర్వేద ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్