- మూడు నెలలుగా తీవ్ర లోటు వర్షపాతం
- ఎల్‌నినోతో రైతాంగం అతలాకుతలం
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లాను తీవ్ర దుర్బిక్షం వెంటాడుతోంది. మూడు నెలలుగా కనీస వర్షపాతం నమోదు కాలేదు. 50 శాతానికి పైగా లోటు వర్షపాతం కొనసాగుతోంది. దీంతో జిల్లా అంతా కరువు మేఘాలు కమ్ముకున్నాయి. గత నెల రోజుల్లోనే ఈ పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. జూన్‌లో కురిసిన వర్షాలతో పత్తి, మిర్చి సాగు చేసిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. సత్తెనపల్లి, వినుకొండ ప్రాంతంలో కొందరు రైతులు మిర్చి సాగుచేయగా, అది కూడా ఎండిపోయి ఎందుకు పనికిరాకుండా పోయింది. జిల్లాపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని అధికారవర్గాలలే అంటున్నాయి అదే సమయంలో జిల్లాలో వరి వేయవద్దని చెప్పిన ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏయే పంటలు సాగు చేయాలన్న విషయాన్ని చెప్పడం లేదు. కరువు మండలాల ప్రకటన ఊసు కూడా లేకపోవడంతో రైతాంగం పరిస్తితి దయనీయంగా మారుతోంది.
బిందెలతో పత్తి మొక్కలకు నీళ్లు
పెదకూరపాడు, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పత్తి మొక్కలను కాపాడు కొనేందుకు బిందెలు, కడవలతో పోస్తున్నారు. దీనివల్ల ఖర్చు భారీగా పెరుగుతోంది. మొక్కలు ఆశించినంత ఎదుగుదల లేకపోవడంతో పంట నిలదొక్కుకున్నా దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గణనీయంగా తగ్గిన సాగు
కరువు పరిస్థితులతో పంటల సాగు జిల్లాలో భారీగా తగ్గింది. పల్నాడు జిల్లాలో ఖరీఫ్‌లో ఐదు లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తారని అంచనా. ఇప్పటి వరకు కేవలం లక్షా 65 వేల ఎకరాల్లో పత్తి, కంది, ఇతర పంటలను వేశారు. 2.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనాలు వేయగా, ఇప్పటి వరకు లక్షా 35 వేల ఎకరాల్లో సాగు చేశారు. లక్షా ఐదు వేల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా, పది వేల ఎకరాల్లోనే వరి వేశారు. అది కూడా బోరుల కిందే సాగులో ఉంది. 2,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగాల్సి ఉండగా వెయ్యి ఎకరాల్లో చేశారు. 65 వేల ఎకరాల్లో కంది సాగు జరగాల్సి ఉండగా కేవలం తొమ్మిది వేల ఎకరాల్లోనే వేశారు. మరో పది వేల ఎకరాల్లో మిర్చి, అపరాలు, ఇతర పంటలను సాగు చేశారు.
కొన్ని ప్రాంతాల్లో పైర్లు ఇప్పటికీ ఎదుగుదల దశలోనే ఉన్నాయి. వరి సాగు వద్దని అధికారులు పదే పదే చెబుతున్నారు. 2002-2003లో కూడా తీవ్ర దుర్బిక్షం నెలకొనగా, ఉమ్మడి రాష్ట్రంలో సాగర్ జలాశయంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నా అప్పట్లో డెడ్ స్టోరేజి నుండి నీటిని అందించిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 58 శాతం నీటి నిల్వ ఉంది. సాగర్‌లో గరిష్ట నీటి నిల్వ 312 టిఎంసిలు కాగా, బుధవారం సాయంత్రం 181 టిఎంసిలు ఉన్నాయి. ప్రస్తుతం సాగర్ ఆయకట్టుపరిధిలో కుడి కాల్వలకు తాగునీటి నిమిత్తం ఎనిమిది టిఎంసిలను ఇటీవల విడుదల చేశారు. వేసిన పంటలకు నీరు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పులిచింతల గరిష్ట నీటి నిల్వ 45.77 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 28.67 టిఎంసిల నిల్వ స్థిరంగా కొనసాగుతోంది.
27 మండలాల్లో లోటు వర్షపాతం
పల్నాడు జిల్లాలో జూన్‌లో 85 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 70 మిల్లిమీటర్లు మాత్రమే నమోదైంది. జులైలో 130.95 మిల్లిమీటర్లకుగానూ 38.92 మిల్లీమీటర్లు, ఆగస్టులో 140 మిల్లీమీటర్లకుగానూ 47.04 మిల్లీమీటర్లు మాత్రమే నమోదు కావడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
మొత్తం 28 మండలాలకుగాను 27 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. గత మూడు నెలలుగా లోటు కొనసాగుతుండడంతో భూగర్భ జలాలు అడుగింటిపోతున్నాయి. దీంతో, బోర్లు కింద కూడా ఆశించిన స్థాయిలో సాగు జరగడం లేదు.
ప్రభుత్వం ఆదుకోవాలి
వేసిన పత్తి పంట వర్షాలు లేకపోవడంతో పిందె, గూడ దశలోనే రాలిపోతోంది. కరువు మండలంగా ప్రకటించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. పంటలు వేసిన రైతులందరికీ బీమా ప్రీమియంతో సంబంధం లేకుండా పరిహారం అందించాలి.
-వి.పూర్ణ, హుస్సేనగర్ గ్రామం, పెదకూరపాడు మండలం
మిర్చి ఎండిపోవడంతో తొలగించాం
వినుకొండ మండలం వెంకుపాలెం ప్రాంతంలో మూడు ఎకరాల్లో వేసిన మిర్చి ఎండిపోవడంతో తొలగించాం. ప్రాథమిక దశలోనే రూ.50 వేలు నష్టం వచ్చింది. పల్నాడు జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి.
-గణప రామబ్రహ్మం, మిర్చి రైతు
వర్షం లేదు... నీరు రాదు...
వర్షాలు లేవు. కాల్వల నుంచి నీరు రావడం లేదు. సత్తెనపల్లి మండలంలో వర్షాభావంలో ఏ పంట వేసినా నిలదొక్కుకుంటుందన్న గ్యారంటీ లేదు. సాగు చేయడానికి రైతులు సాహసించడం లేదు.
-బాదరబోయిన వెంకట్రావు, అబ్బూరు గ్రామం







కామెంట్‌లు (0)