మూడో పార్టీకి భూములు ఇచ్చేలా కంపెనీకి అనుకూలంగా లీజు ఒప్పందాలు
కొందరికి అగ్రిమెంట్ కాపీలు ఇవ్వకుండా మోసం
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : టాటా పవర్ సోలార్ కోసం సేకరించిన భూముల లీజులో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. లీజు భూములను మూడో పార్టీకి ఇచ్చుకునేందుకు అనువుగా కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకొని రైతులకు షాకిచ్చింది. 29 సంవత్సరాల 11 నెలలకు ఒప్పందం చేసుకుంటున్నా లీజు మొత్తాల చెల్లింపులో తేడాలు ఉన్నాయి. అగ్రిమెంటు కాపీలు ఇవ్వకుండా కొందరి రైతులను కంపెనీ మోసగిస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో టాటా పవర్ సోలార్ ప్రాజెక్టు కోసం లీజు ఒప్పందాలు జరిగాయి. కంపెనీ తమను తప్పుదోవ పట్టించి మోసగించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ మండలం హోసూరు–పెద్దహుల్తి గ్రామాల మధ్య 1,800 ఎకరాల్లో టాటా పవర్ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ ప్రాంత రైతులు పత్తి, జొన్న, మిరప, సజ్జ, వాము, ఉల్లి తదితర పంటలను సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సాగు నీటి సౌకర్యం లేనందున భవిష్యత్తులోనూ పంటలు పండవంటూ, వ్యవసాయం లాభసాటిగా ఉండదంటూ కంపెనీ తరఫున దళారులు రంగంలోకి దిగారు. టాటా పవర్ సోలార్ కోసం రైతులను భూములు లీజుకు ఇచ్చేలా మభ్యపెట్టారు. ప్రాజెక్టు కోసం 650 మంది రైతులతో సుమారు 1,200 ఎకరాలకు లీజు ఒప్పందాలలను కంపెనీ పూర్తి చేసుకుంది. రైతుకు ఎకరా ఒక్కంటికీ ఏడాదికి రూ.31 వేల లీజు చెల్లిస్తామంటూ ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయంలో నష్టాలు, గిట్టుబాటు ధరలు రాకపోవడం, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని కంపెనీ ప్రతినిధులు నయానా, భయానా ఒప్పించారు. మూడో పార్టీకి భూమిని బదలాయించేలా కూడా లీజు ఒప్పందం కంపెనీ కుదుర్చుకుంది. దీనిపై తమకు ముందుగా తెలియజేయకుండా కంపెనీ మోసగించిందని రైతులు వాపోతున్నారు. ఒప్పందంలోని 5.1, 5.2 క్లాజులు లీజు కంపెనీకి విస్తృత అధికారాలు కల్పిస్తున్నాయని, తమ హక్కులను పరిమితం చేస్తున్నాయని ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
ఒప్పందంలోని 5.1 క్లాజులో... లీజుదారు (కంపెనీ) భూ యజమాని అనుమతి లేకుండానే తన లీజు హక్కులను మూడో వ్యక్తికి బదిలీ చేయడం, భూమిని ఆర్థిక సంస్థల వద్ద తనఖా పెట్టడం, పెట్టుబడిదారులు లేదా ఇతర సంస్థలకు అప్పగించడం వంటి అపరిమిత అధికారాలు కలిగి ఉండేలా నిబంధనలను తనకు అనుకూలంగా కంపెనీ చేర్చుకుంది. దీంతో, భూ వినియోగ హక్కులు ఎవరి చేతుల్లోకి వెళ్తాయో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5.2 క్లాజులో... భూ యజమాని తన భూమిని విక్రయించాలంటే ముందుగా లీజుదారుకు (టాటా కంపెనీకి) లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాలనే నిబంధనను పెట్టింది. అంతేకాకుండా భూమిని కొనుగోలు చేసే కొత్త యజమాని కూడా ఇప్పటికే ఉన్న లీజు ఒప్పందంలోని అన్ని షరతులనూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆంక్షలు విధించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డీడ్ ఆఫ్ అథీరెన్స్ నమోదు చేయాలని, ఇందుకు సంబంధించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను కొత్త కొనుగోలుదారే భరించాలని నిబంధనల్లో కంపెనీ చేర్చింది. దీంతో, భూ విక్రయం సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని, భూమిపై పూర్తి హక్కులు ఉన్నప్పటికీ రైతుల స్వేచ్ఛపై పరిమితులు విధిస్తున్నట్లు కనిపిస్తోందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లీజు చెల్లింపుల్లో గందరగోళం
లీజు అడ్వాన్స్ డబ్బుల జమలో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరి రైతులకు ఐదేళ్లకు సంబంధించిన చెల్లింపులు, మరికొందరి రైతులకు 20 ఏళ్లకు సంబంధించిన చెల్లింపులు అడ్వాన్స్ గా జమ చేసినట్లు చెబుతున్నారు. తమకు కేవలం రెండేళ్ల చెల్లింపులే చేసి మిగతా విషయంపై స్పష్టత ఇవ్వడం లేదని కొందరు రైతులు వాపోతున్నారు. ఒకే ఒప్పందం కింద భూములు ఇచ్చిన రైతులకు వేర్వేరు విధానాలు కంపెనీ అమలు చేస్తుండడంపై వారు ప్రశ్నిస్తున్నారు. చాలామందికి లీజు అగ్రిమెంట్లు ఇవ్వలేదని, గట్టిగా అడిగిన వారికి మాత్రమే ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. భూములు ఇచ్చిన రైతులందరికీ ఒకే విధమైన నిబంధనలు, ఒకే విధమైన చెల్లింపులు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.






కామెంట్‌లు (0)