దేశ రాజధానిలో సాగుతున్న విద్యార్ధి యువజనుల ఆందోళన సందర్బంగా వారిని గందరగోళపర్చాలని తిమ్మిని బమ్మిని చెయ్యడం ప్రజల్ని మభ్యపుచ్చి తప్పుదారి పట్టించే సంఘ్ పరివార్ ఎత్తుగడలు ప్రయోగించినా అవి వమ్ము కావడం గమనార్హం. సిఎఎ /ఎన్ ఆర్ సి వ్యతిరేక ఆందోళనలు సాగినపుడు ఢిల్లీ పోలీసులు ఇలాంటి ఎత్తుగడలు అనుసరించిన విషయం అందరికీ తెలిసిందే! పుకార్లు పుట్టించడం ఏదో ఒకటి చేసి దాన్ని ప్రత్యర్థులపై నెట్టేయడం దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా వ్యవహరించడం పరివార్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇప్పుడా విద్య విద్యార్ధి యువజనులవద్ద పారకపోవడం ముదావహం .
సోమవారం ఉదయం పోలీసులు పాడుబడిపోయిన వాహనాల్ని పార్క్ చెయ్యడం, ట్రక్కులతో రాళ్ళూ తెచ్చి పోగు వెయ్యడం వంటివేగాక రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది తమ పేరును డ్రెస్ పై తొలగించడం, పెద్ద సంఖ్యలో మఫ్టీ పోలీసులు షరా మామూలుగానే సంఘ్ పరివార్ మూకల చొరబాటు ... ఇవన్నీ నాటి నాజీల నుండి ఇప్పటి పరివార్ శక్తుల రొటీన్ ప్రక్రియగానే జరిగాయి. మరోవైపున షాక్ బ్యాటన్లు, భాష్పవాయువు, జల ఫిరంగులేగాక పెల్లెట్ గన్ లను సైతం యువతీ యువకులపై ప్రయోగించారు. యువతీ యువకుల మొక్కవోని దీక్ష ముందు అవేవీ పని చెయ్యలేదు సరికదా మభ్యపుచ్చే ఎత్తుగడలు కూడా పటాపంచలయ్యాయి. పోలీసులే నకిలీ అంబులెన్సులతో గందరగోళపర్చాలని యత్నించారు. హఠాత్తుగా నీటి ఫిరంగుల/ భాష్పవాయు శకటాలను కూడా ఆయా ప్రదేశాల్లోకి తెచ్చారు. ఇలాంటి కుయుక్తులెన్ని పన్నినా ఆందోళనకారులు తగిన విధంగా తప్పుకొని నిరసన యథావిధిగా కొనసాగించారు. ఇలాంటి అంశాలన్నీ జనం నిర్వహించే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రసారం కావడం గమనార్హం. గోడీ మీడియా చేసే మోళీని సోషల్ మీడియా తుత్తునియలు గావించింది. మేము బొద్దింకలమే అంటూ వ్యంగ్యంగా ఎలుగెత్తిన యువత పాలక పార్టీ కుయుక్తులనూ అలాగే ఛేదించగలగడం సంతోషదాయకం.
ఆందోళనకారులపై పెల్లెట్ గన్ల ప్రయోగం తో పలువురు గాయపడడమేగాక కొందరికి పెల్లెట్స్ తీయడానికి సర్జరీలు చేయవలసివచ్చింది. సాహిల్ లోచాబ్ అనే పందొమ్మిదేళ్ళ యువకునికి ఎయిమ్స్ ఆసుపత్రిలోనే కంటి సర్జరీ జరిగింది. చూపు తిరిగి వస్తుందో లేదో అయన కనుగుడ్డుకు మరో సర్జరీ జరిగాక కానీ చెప్పలేమని డాక్టర్లన్నారని ఆ యువకుని తల్లి ఆవేదనను అవుట్‌లుక్ పత్రిక వివరించింది. కనీసం నలుగురికి పెల్లెట్ గన్ గాయాలకు సర్జరీలు జరిగినట్లు పత్రికల్లో వివరాలొచ్చాయి. ఈ విషయం లోనూ పోలీసుల బుకాయింపు మరింత దుర్మార్గం. తాము పెల్లెట్ గన్స్ వాడనేలేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. వాస్తవానికి వాటిని ప్రయోగించింది సిఆర్‌పిఎఫ్ పరిధిలో ఉన్న రాపిడ్ యాక్షన్ ఫోర్స్. వాటి ప్రయోగం జరిగిందా లేదా అని హిందూ దినపత్రిక ప్రతినిధి సిఆర్‌పిఎఫ్ డిఐజి వివరణ కోరగా ఐజి స్థాయి అధికారి మాత్రమే చెబుతారని అయన దాటవేశారు. ఈ విషయం ఆ పత్రిక రిపోర్ట్ చేసింది.
ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందంటూ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్ జెపి నడ్డా తదితరులు చేసిన ప్రకటనలూ ప్రయత్నాలూ ఆందోళనకారుల్ని గానీ ప్రతిపక్ష పార్టీలను గానీ ఎంతమాత్రమూ ప్రభావితం చేయలేదు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాతనే ఏదైనా అంటూ గట్టి పట్టుదలగా వ్యవహరించారు. పార్లమెంట్ ఉభయ సభలు స్తంభించిపోయాయి. శుక్రవారం నాడు దేశవ్యాపిత ఆందోళనలకు పలు పార్టీలు, సంస్థలు పిలుపునివ్వడం ఉద్యమానికి మరింత ఊపునిస్తోంది. 'ఈ దేశ యువత భవిష్యత్తు కంటే మాకు మరేదీ ఎక్కువ కాదని' గురువారం నాటి సుప్రభాత వేళ ప్రధాని చేసిన ట్వీట్ ను ఈ నేపథ్యం లోనే చూడాలి.
సిజెపి ప్రారంభించిన ఆందోళన దేశవ్యాప్తంగా విస్తరించింది. విద్యార్ధి యువజనులు భారీగా భాగస్వాములవుతున్నారు. విద్యార్ధి యువజన సంఘాలు భుజం కలిపాయి. సిపిఎం వామపక్షాలు తొలినుండి అండదండగా నిలిచాయి. సంఘీభావ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇండియా బ్లాక్ పార్టీలు కూడా కలిసొచ్చాయి. కానీ మన రాష్ట్రంలో ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ గాని, ప్రశ్నించడమే తన విధానమని చెప్పిన నేత గాని కిమ్మనడం లేదు. ప్రధాన ప్రతిపక్షం అసలు ఈ పరిణామాలే పట్టించుకోవడం లేదు. బిజెపి కి వంగి సలాం కొట్టే ఈ పాలకవర్గ పార్టీల అవకాశవాదమే ఆంధ్ర ప్రదేశ్ కు పెనుముప్పుగా పరిణమిస్తోంది. తస్మాత్ జాగ్రత్త!
గిరిపుత్ర







కామెంట్‌లు (0)