శాంతియుత ప్రదర్శనలకు సిజెపి, పలు విద్యార్థి సంఘాల పిలుపు
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల దాష్టికానికి వ్యతిరేకంగా శుక్రవారం నాడు దేశవ్యాప్త నిరసనలు చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) పిలుపునిచ్చింది. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా ఇండియా బ్లాక్‌లో వివిధ రాజకీయ పక్షాలు, ఎస్‌ఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాలు, పౌర సమాజ సంస్థలు కూడా వివిధ రూపాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దేశంలోని అన్ని జిల్లాల్లో శాంతియుత ఆందోళనలు నిర్వహించాలని గురువారం సిజెపి ఒక ప్రకటనలో కోరింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టర్ విడుదల చేసింది. ‘‘ప్రతి జిల్లా. ఒక్క రోజు. ఒకే డిమాండ్’’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలో పాల్గొనాలని సిజెపి కోరింది. ప్రతి జిల్లాలో శాంతియుత నిరసనలు నిర్వహించాలని, పోలీసు దమనకాండకు గురైన వారికి సంఘీభావం తెలపాలని, నిర్దేశిత ప్రాంతాల్లో సమావేశమై విద్యార్థుల డిమాండ్లను చదివి వినిపించాలని పేర్కొంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రచార సామగ్రిని, మెమోరాండం నమూనాను కూడా విడుదల చేసింది. స్థానిక నిర్వాహకులు విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైన అనుమతులు పొందాలని, నిరసనలు శాంతియుతంగా జరిగేలా చూడాలని సిజెపి తెలిపింది. ఇదే సమయంలో, సిజెపితో చర్చలు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా సిజెపితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రకటించారు. అయితే, సోమవారం నాడు చర్చలని పిలిచి సిజెపి నాయకుల ఫోన్లు లాక్కొని, నడ్డా కార్యాలయంలో గంటల తరబడి కూర్చోబేట్టారని, అదే సమయం లో విద్యార్థులపై లాఠీ చార్జి చేశారని సిజెపి విమర్శించిన సంగతి తెలిసిందే. అందుకని, జంతర్ మంతర్ వద్ద లేదా దాని సమీపంలోనే చర్చలు జరపాలని సిజెపి స్పష్టం చేసింది.







కామెంట్‌లు (0)