సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జనగణన గణాంకాల ప్రక్రియ మాత్రమే కాదు...

1 గంట క్రితం

census
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 02:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) ‌తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ భారత రిజిస్ట్రార్‌ ‌జనరల్‌, జనగణన కమిషనర్‌‌కు 2027 జనగణనపై మెమోను అందచేశారు.

ఆ మెమో పూర్తి పాఠం...

జనగణన 2027 ప్రస్తుతం కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఇంటింటికీ తిరిగే మొదటి దశ ఇప్పుడే ప్రారంభమవగా, మంచు కురిసే ప్రాంతాల్లో తమ వివరాలతో స్వీయ దరఖాస్తు చేసుకునే రెండో దశ ప్రారంభమైంది. జనగణన అనేది కేవలం గణాంకాలపరమైన ప్రక్రియ మాత్రమే కాదు. జనాభాను ప్రభుత్వం ఏ రీతిన అర్ధం చేసుకుంటుందన్నది ఈ జనాభా గణనే నిర్ణయిస్తుంది. ప్రణాళిక, వనరుల కేటాయింపు, అంతిమంగా రాజకీయ ప్రాతినిధ్యానికి ఇది ప్రాతిపదిక కల్పిస్తుంది.

16ఏళ్ళ తర్వాత చేపట్టడం, పైగా పౌరసత్వాన్ని, ఓటు హక్కులను, రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేసే ఇతర అనేక ప్రక్రియలు కొనసాగుతున్న తరుణంలో దీన్ని నిర్వహిస్తుండడంతో జనాభా లెక్కలు, 2027 ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. సాధారణంగా ఇటువంటి ప్రక్రియలో చోటు చేసుకోని ప్రశ్నలను చేర్చడం, పైగా డేటాను సేకరించడానికి ఉపయోగిస్తున్న పద్ధతులను చూస్తుంటే బిజెపి సంకుచిత రాజకీయ ఎజెండాను అమలు చేయడానికి ఈ ప్రక్రియను ఉపయోగించుకుంటున్నారన్నది చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. తల్లిదండ్రుల ఇద్దరి వివరాలు, వారి మతం, పుట్టిన ప్రాంతం వంటి డేటాను సేకరించడానికి ఇతర వివరణ ఏమీ లేదు. ​రెండో దశకు నోటిఫై చేసిన ప్రశ్నావళిని చూస్తే అనేక తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి. వాటిని మేం ప్రముఖంగా ప్రస్తావించాలనుకుంటున్నాం.

వ్యక్తిగత సమాచార సేకరణ

సాంప్రదాయ సిద్ధమైన రీతిలో జనాభా లెక్కల సమాచారాన్ని సేకరించడానికి మించి ఈ ప్రశ్నావళి వుంది. ఆధార్‌, ఓటర్‌ ఐడి, పాస్‌‌పోర్ట్‌, మొబైల్‌ ‌నెంబర్‌ ‌వివరాలు కోరుతోంది. అలాగే బ్యాంక్‌ ‌ఖాతాలెన్ని వున్నాయి, ఇంకా ఇతర వ్యక్తిగత వివరాలపై కూడా సమాచారం కోరుతున్నారు. పైగా సదరు వ్యక్తి (ప్రతివాది) భాగస్వామికి సంబంధించిన సమాచారం కోరడం చాలా చిత్రంగా వుంది. కొన్నిచోట్ల దీన్ని స్వచ్ఛందమని లేదా ‘అందుబాటులో వున్నట్లైతే’ అని పేర్కొన్నప్పటికీ ఒక ప్రభుత్వ అధికారి అడిగినపుడు సదరు వ్యక్తులు (ప్రతివాది) ఈ వివరాలు తప్పనిసరిగా వెల్లడించాల్సిన బలవంతపు పరిస్థితి నెలకొనే ప్రమాదమైతే వుంది.

ఇటువంటి వివరాలు అందించడం స్వచ్ఛందమని తాను వివరాలు సేకరించే ప్రతీ ఇంటికీ వెళ్ళి ఎన్యూమరేటర్‌ ‌చెబుతారని ఆశించడం అతిశయోక్తి కాగలదు. డేటా లీకేజీకి సంబంధించి కూడా తీవ్రమైన ఆందోళన నెలకొని వుంది. వ్యక్తిగత గుర్తింపు వివరాలతో పాటుగా కులం, మతం, అంగవైకల్యం, వలస, వృత్తి, కుటుంబ సమాచారం వంటివి కూడా సేకరిస్తున్నందున ఈ జనగణన సమాచారాన్ని ఇతర ప్రభుత్వ డేటా బేస్‌‌లతో ముడిపెట్టే అవకాశమనేది చాలా తీవ్రమైన సమస్యగా మారుతుంది.

జనగణన, లింకేజీలు

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆందోళనలన్నీ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విస్తృత పత్రాలు, వెరిఫికేషన్లతో తమ పౌరతస్వాన్ని నిరూపించుకునే భారాన్ని ఎస్‌ఐఆర్‌ ఇప్పటికే పౌరుల మీదకు బదలాయించింది. జనాభా లెక్కలు, ఎస్‌ఐఆర్‌‌ రెండూ పూర్తిగా భిన్నమైనప్పటికీ వ్యక్తిగత డేటా సేకరణ, ఓటర్ల జాబితాల వెరిఫికేషన్‌, పౌరతస్వంపై చర్చలు ఇవన్నీ ఏక కాలంలోనే సాగుతున్నందు వల్ల ఈ సమాచారాన్ని అంతిమంగా వినియోగించుకోవడం, ఇతర వాటితో ముడిపెట్టడానికి సంబంధించి హేతుబద్ధమైన ఆందోళనలను తలెత్తుతున్నాయి.

జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన

2026 తర్వాత మొదటి జనగణన జరిగే వరకు రాష్ట్రాల మధ్య లోక్‌‌సభ, అసెంబ్లీ సీట్ల కేటాయింపులపై రాజ్యాంగబద్ధమైన స్తంభన వున్న కారణంగా జనాభా లెక్కలు జరిగే సమయం కూడా చాలా ప్రాధాన్యత కలిగివుంది. ఈ జరగనున్న జనాభా లెక్కల ప్రక్రియ రాబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు జనాభా ప్రాతిపదికను అందించవచ్చు. అదే గనుక జరిగితే జనాభా లెక్కలు అనేది కేవలం జనగణన ప్రక్రియ కన్నా మించి వుంటుంది. రాష్ట్రాల మధ్య భవిష్యత్‌‌లో రాజకీయ ప్రాతినిధ్య పంపిణీకి సంబంధించి తీవ్ర పర్యవసానాలు తలెత్తవచ్చు. జనాభా స్థిరీకరణ చర్యలను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాల అనుభవాలను విస్మరిం చలేం. జనాభా స్థిరీకరణ విధానాలను విజయవం తంగా అమలు చేసినందుకు రాష్ట్రాలను రాజకీయంగాశిక్షించరాదు. సమాఖ్యవాదం, రాష్ట్రాల మధ్య రాజకీయ సమతుల్యతకు ఎదురయ్యే పర్యవసానాలను పరిష్కరించకుండా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టలేం.

కుల గణన

కుల గణనకు అనుసరిస్తున్న పద్ధతి అనేక తీవ్ర ఆందోళనలను లేవనెత్తుతోంది. షెడ్యూల్డ్‌ ‌కులాలు/తెగలకు చెందినవారు ఎస్‌‌సి/ఎస్‌‌టిలకు సంబంధించి అందుబాటులో వున్న జాబితా నుండి తమ కులాన్ని ఎంపిక చేసుకోగలరు, కానీ ఇతరుల విషయంలో మాత్రం ‘ప్రతివాది ప్రకటించినట్లుగా’ అని నమోదు చేయాలి. జనరల్‌ ‌కులానికి సంబంధించిన ప్రశ్నకు సమగ్రమైన రీతిలో ముందే నిర్వచించిన జాబితా లేదా ఒక వ్యవస్ధాగత యంత్రాంగం లేకపోవడం వల్ల కులాలు, ఉప కులాలకు సంబంధించి అనేకమైన ఎంట్రీలు నమోదయ్యే పరిస్థితికి దారి తీస్తుంది. అటువంటపుడు కచ్చితమైన గణాంకాలు లభ్యమయ్యే పరిస్థితి సాధ్యం కాదు. ఫలితంగా ఈ ప్రక్రియ ప్రయోజనమే నీరుగారిపోతుంది. శాస్ర్తీయంగా రూపొందించిన కుల వర్గీకరణ, కోడింగ్‌ ‌వ్యవస్థను ఉపయోగిస్తూ ఒక పద్ధతిలో డేటాను సేకరించడానికి తిరస్కరించడం ద్వారా ఇది ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తున్న పని అని స్పష్టమవుతోంది. ఆ డిజైన్‌‌లోనే లోపం వుంది. ఉద్దేశ్యపూర్వకంగానే దాన్ని అలా రూపొందించారు.

వైకల్యాన్ని తక్కువగా లెక్కించడం

ప్రత్కేక ప్రతిభావంతుల హక్కుల (పిఆర్‌‌డబ్ల్యుడి) చట్టం-2016, నిర్దిష్టంగా 21 రకాల వైకల్యాలను గుర్తించింది. కానీ జనగణన యంత్రాంగం మాత్రం అనేక వైకల్యాలను కలిపి చూపుతోంది, కొన్నిటిని అయితే మొత్తంగా వదిలివేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియలో కేవలం 9 రకాల కేటగిరీలు మాత్రమే వున్నాయి. వీటి వల్ల నిర్దిష్టంగా ఏ వైకల్యానికి సంబంధించి కచ్చితమైన డేటా అందదు. దాంతో వైకల్యాన్ని తక్కువగా లెక్కించడానికి దారి తీయడమే కాదు, ప్రణాళిక, బడ్జెట్‌ ‌కేటాయింపులు, పథకాలు వంటి వాటికి సంబంధించిన పర్యవసానాలకు దారి తీస్తాయి.

పై అంశాల నేపథ్యంలో

1. జన గణనకు అనుసరించే పద్ధతులపై అన్ని పార్టీలతో చర్చలు, సంప్రదింపులను తక్షణమే ఏర్పాటు చేయాలి.

2. తల్లిదండ్రుల మతం, వారి బ్యాంక్‌ ‌ఖాతాలు, ఆధార్‌, ఇతర ఐడి నెంబర్లు వంటి వ్యక్తిగత వివరాలు, ఇటువంటి ఇతర సమాచారాన్ని సేకరించరాదు.

3. శాస్త్రీయంగా రూపొందించిన, పారదర్శకంగా వుండే కుల వర్గీకరణ, కోడింగ్‌ ‌వ్యవస్థ వుండాలి

4. జనాభా లెక్కల డేటాను ఎన్నికల, ఆధార్‌, సంక్షేమ లేదా పౌరసత్వ డేటాబేస్‌‌లతో ముడిపెట్టకుండా కచ్చితంగా కఠినమైన రక్షణ చర్యలు చేపట్టాలి.

5. జనగణన సమాచారాన్ని పౌరసత్వాన్ని నిర్ణయించేందుకు లేదా ఎన్నికల ప్రక్రియ నుండి మినహాయించేందుకు ఉపయోగించకుండా రక్షణ తీసుకోవాలి.

6. నియోజకవర్గాల పునర్విభజన, సమాఖ్యవాదంపై జనాభా లెక్కల ప్రభావం, పర్యవసానాలపై పారదర్శకమైన బహిరంగ చర్చ జరగాలి.

7. పిఆర్‌‌డబ్ల్యుడి చట్టం కింద గుర్తించిన 21 వైకల్యాల జాబితాను జనగణన సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలి.


- ​ఫీచర్స్‌ ఆండ్‌ ‌పాలిటిక్స్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్