- సిజెపి జాతీయ వర్కింగ్ కమిటీ పిలుపు
- గత ఐదేళ్లలో పాఠశాలలకు ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు చేశారు ?
- పాఠశాలల దుస్థితిపై కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులకు అభిజిత్ దీప్కే లేఖ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను అములు చేయడంలో విఫలమైందని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) విమర్శించింది. ఈ హామీల సాధనకై సెప్టెంబర్ 5న ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నామని సిజెపి జాతీయ వర్కింగ్ కమిటీ ప్రకటించింది. ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. మృతిచెందిన నీట్ విద్యార్థుల కుటుంబాలు, పోలీసు దౌర్జన్యానికి గురైన బాధితులు ఈ ర్యాలీలో పాల్గోంటారని తెలిపింది. ఈ మేరకు సోమవారం సిజెపి ప్రకటన విడుదల చేసింది. సిజెపి జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేస్తున్నాయని సమావేశంలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. హామీల అమలుకు బదులుగా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, కీలక అంశాలపై స్పష్టత ఇవ్వకుండా తప్పించుకుంటోందని కమిటీ విమర్శించింది. ఈనెల 18న సుప్రీంకోర్టు దేశవ్యాప్తం గా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని పేర్కొంది. సిజెపికి ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని తెలిపింది.
బలహీనతగా భావించొద్దు
తమ సహనాన్ని ప్రభుత్వం బలహీనతగా భావించరాదని సిజెపి హెచ్చరించింది. విద్యార్థుల దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రభుత్వం మోసం చేయడానికి అవకాశంగా మార్చుకోరాదని పేర్కొంది. హామీలను అమలు చేయకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 5న ఇండియా గేట్ వద్దకు దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సిజెపి పిలుపునిచ్చింది. శాంతియుత ర్యాలీలో పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరింది.
పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు లేకుండా దేశాభివృద్ధి ఎలా సాధ్యం?
దేశవ్యాప్తంగా పాఠశాల విద్యకు డుబుల్ ఇంజన్ సర్కార్ గత ఐదేళ్లలో ఎంత కేటాయించిది? ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని సిజెపి కన్వినర్ అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర విద్యా శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు, రాష్ట్రాల మంత్రులకు సోమవారం లేఖ రాశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 80 ఏళ్లు గడుస్తున్నా, నేటికీ అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేకుండాన దేశాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా విద్యను ప్రాధాన్యతగా తీసుకొని పాఠశాలలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు, పనిచేసే మరుగుదొడ్లు, సరైన తరగతి గదులు, కనీసం కూర్చోవడానికి బెంచీలు కూడా అందుబాటులో లేని పరిస్థితులున్నాయని ఆయన లేఖలో వివరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభుత్వ పాఠశాలల దృశ్యాలపై ప్రజలు స్పందించాలన్నారు. దేశ భవిష్యత్తుగా భావించే చిన్నారులు ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవాల్సి రావడం బాధాకరమని అభిజీత్ దీప్కే అన్నారు.గత ఐదేళ్లలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు నిర్మించారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నింటికి మరమ్మతులు లేదా పూర్తి పునర్నిర్మాణం అవసరం ఉందో వివరించాలని ఆ లేఖలో కోరారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు మంజూరు అయ్యాయి? వాటిలో ఎన్ని భర్తీ అయ్యాయి? ఇంకా ఎన్ని ఖాళీగా ఉన్నాయో వెల్లడించాలని కోరారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలకు ఎన్ని నిధులు కేటాయించారు? అందులో వాస్తవంగా ఎంత ఖర్చు చేశారు? కూడా తెలపాలని అన్నారు. బోధనతో పాటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఇంకా ఎలాంటి బోధనేతర పనులు, బాధ్యతలు అప్పగించారో కూడా చెప్పాలని కేంద్రాన్ని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. పిల్లవాడు ఎక్కడ పుట్టినా, అతని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, ప్రతి చిన్నారికి సురక్షితమైన తరగతి గది, స్వచ్ఛమైన తాగునీరు, పనిచేసే మరుగుదొడ్డి, కూర్చోవడానికి ఒక బెంచ్, విద్యాబోధన చేసే ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉండటం అతని హక్కు అని అన్నారు. ప్రభుత్వం ఈ వివరాలను ప్రజలకు బహిరంగంగా వెల్లడించడంతో పాటు, మౌలిక వసతుల కొరత కారణంగా ఏ ఒక్క చిన్నారి కూడా గౌరవప్రదమైన విద్యకు దూరం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అభిజీత్ దీప్కే కోరారు. పిల్లల విద్యపై ఇక ఆలస్యం వద్దని, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మార్చేందుకు తక్షణ చర్యలు అవసరమని అన్నారు.







కామెంట్‌లు (0)