తేజ చదువులో రాణిస్తూనే, ఆరుబయట ఆడుకోవడం, పరిసరాలను గమనించడం, పెద్దలు చెప్పే సామాజిక అంశాల పట్ల ఆసక్తి చూపడం, దినపత్రికలు చదవడం అలవాటు చేసుకున్నాడు. తన స్నేహితుడు అక్షయ్ మాత్రం ర్యాంకుల ధ్యాసలో ఉంటూ పుస్తకాలతో నిత్యం గడిపేవాడు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపేవాడు.
ఒకరోజు అక్షయ్ వాళ్ళ అమ్మానాన్నలు వూరికి వెళ్లారు. ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. అవసరమైతే మాట్లాడమని వాళ్ళిద్దరిలో ఒక ఫోను ఇంట్లో ఉంచేసి వెళ్లారు. మధ్యాహ్నం వేళ ఆ ఫోన్ మోగింది. అక్షయ్ హలో అనగానే ‘మీ నాన్నగారికి ఆన్‌లైన్ లాటరీలో ఐదు లక్షలు తగిలింది. బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ కి వచ్చిన ఓటీపీ చెబితే డబ్బు ఖాతాలో వేస్తాం’ అని చెప్పారు. అంత డబ్బు అనగానే ఆశపడిన అక్షయ్, వాళ్ళ నాన్నకు సర్‌ప్రైజ్ ఇద్దామని బ్యాంక్ వివరాలు వెతకడం మొదలుపెట్టాడు.
ఇంతలో ఏదో పని ఉండి అక్షయ్ ఇంటికి తేజ వచ్చాడు. అక్కడ జరుగుతున్న విషయం తెలుసుకుని వెంటనే ఫోన్ కట్ చేయించాడు. ‘అక్షయ్! చదువు ఒక్కటే సరిపోదు. ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల గురించి రోజూ వార్తల్లో చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను ఇలాగే మోసం చేస్తారు. అపరిచితులకు ఎప్పుడూ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు చెప్పకూడదు. నీకు తెలీదా?’ అనడిగాడు.
ఆ రాత్రికి వాళ్ళ అమ్మానాన్నలు ఇంటికి వచ్చాక జరిగిన విషయం తెలుసుకున్నారు. తేజ సమయస్ఫూర్తిని, లోకజ్ఞానాన్ని మెచ్చుకుని, అక్షయ్‌కి సైబర్ మోసాల గురించి చెప్పారు. అక్షయ్ తన తప్పు తెలుసుకుని, ‘చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల అవగాహన ఉండడం ఎంత అవసరమో నాకు అర్థమైంది’ అన్నాడు.
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు,
94907 99203.







కామెంట్‌లు (0)