సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅకాల వర్షాలు.. శివకాశిలో తగ్గిన బాణాసంచా ఉత్పత్తి

13 గంటల క్రితం

అకాల వర్షాలు.. శివకాశిలో తగ్గిన బాణాసంచా ఉత్పత్తి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 02:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నయ్‌ : దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలకు సర్వం సిద్ధమవుతున్న వేళ బాణాసంచా తయారీ రంగానికి కీలకంగా ఉన్న తమిళనాడులోని శివకాశి ప్రాంతాన్ని అకాల వర్షాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దేశంలోని మొత్తం బాణాసంచా అవసరాల్లో సింహభాగం ఉత్పత్తి చేసే ఈ ప్రాంతం ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విరుదునగర్ జిల్లాలోని ప్రముఖ తయారీ కేంద్రాల్లో ఒకటైన సత్తూరు ప్రాంతంలో అక్టోబర్ 22 నాటికి ఏకంగా 143 మిమీ వర్షపాతం నమోదైంది. దీనివల్ల బాణాసంచా తయారీ ప్రక్రియ అస్తవ్యస్తమైంది. బాణాసంచా తయారీలో అత్యంత కీలకమైన దశ వాటిని ఎండబెట్టడం. రసాయనాలు నింపిన టపాసులను సంప్రదాయబద్ధంగా ఎండలో ఆరబెట్టాల్సి ఉంటుంది. అయితే, అక్కడ కురిసిన అకాల వర్షాల కారణంగా టపాసులు తడిసిపోవడం, సరిగ్గా ఆరకపోవడం జరుగుతోంది. దీనివల్ల తయారీ యూనిట్లలో పనులు మందగించాయి. దీపావళి సీజన్‌కు డిమాండ్‌ను తట్టుకునేలా గడువులోగా సరుకును మార్కెట్లోకి తరలించలేమనే ఆందోళన తయారీదారుల్లో వ్యక్తమవుతోంది. ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తయారీదారులు వర్షాల కారణంగా మరింత సంక్ష‍ోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రసాయనాలు, పేపర్‌ ట్యూబ్స్, అట్టపెట్టెలు, ఇతర ఇన్‌పుట్ ధరలు ఎగబాకడంతో తమ లాభాల మార్జిన్లు భారీగా పడిపోయాయని బాణాసంచా పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. శివకాశి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది కార్మికులు బాణా సంచా తయారీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. పండుగ సీజనే వీరికి ప్రధాన ఆదాయ వనరు. ఈ తరుణంలో వర్షాల వల్ల ఉత్పత్తికి అంతరాయం కలగడం కార్మికుల ఉపాధిపైనా, వేతనాలపైనా ప్రభావం చూపుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్