నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో చివరి టి20
రాత్రి 7.30గం||లకు
న్యూఢిల్లీ: తొలి రెండు టి20ల్లో ఘన విజయం సాధించిన భారతజట్టు ఇక క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. ఆ రెండింటిలోనూ ఆఫ్ఘనిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతోనే చిత్తుచేయడం మరో విశేషం. మూడు టి20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజిక్కించు కున్న టీమిండియా.. అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం జరిగే మూడో, చివరి టి20లోనూ గెలిస్తే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకోవడం ఖాయం. ఈ క్రమంలోనే జట్టు మేనేజ్‌మెంట్ మూడో, చివరి టి20కి ప్రయోగాలకు తెరలేపే అవకాశముంది. ఇప్పటి వరకు బెంచ్‌కే పరిమితమైన కొందరు ఆటగాళ్లకు చోటు కల్పించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానంలో యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కి చోటు దక్కవచ్చు. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద ఈ మ్యాచ్‌లో రెస్ట్ దక్కే అవకాశం ఉంది. గతంలో ఇంగ్లండ్ పర్యటనలోని రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా మోకాలికి గాయమైంది. ఆ దెబ్బ కారణంగా ఆగస్టులో శ్రీలంక టూర్‌కు దూరమైన బుమ్రా, వేగంగా కోలుకుని ఈ సిరీస్ మొదటి రెండు మ్యాచ్‌లలోనూ పాల్గొన్నాడు. రాబోయే ఆసియన్ గేమ్స్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆయనకు విశ్రాంతినిచ్చి, పేసర్ యశ్ ఠాకూర్ కు తుది జట్టులో
చోటు కల్పించే అవకాశముంది. మరోవైపు తొలి రెండు టి20లో చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్ కనీసం మూడో మ్యాచ్‌లోనైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌తో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టి20లో ఆఫ్ఘన్ నిర్దేశించిన 157పరుగుల లక్షాన్ని 13.4ఓవర్లలో, మంగళవారం జరిగిన రెండో టి20 160 పరుగుల ఛేదనను 14.5ఓవర్లలోనే టీమిండియా ముగించి సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
జట్లు(అంచనా)...
ఇండియా: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్, దూబే, సుందర్, యశ్ ఠాకూర్, ఆర్ష్‌దీప్.
ఆఫ్ఘనిస్తాన్: ఇబ్రహీం జడ్రాన్(కెప్టెన్), గుర్బాజ్(వికెట్ కీపర్), సెద్ధిఖుల్లా, గుల్బద్దీన్, రసూలీ, అజ్మతుల్లా, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్, ఫారూఖీ.







కామెంట్‌లు (0)