చెన్నై సూపర్‌కింగ్స్ మెంటార్‌గా బాధ్యతలు
క్రికెట్ మైదానంలో ఆఖరి బంతి వరకు ఉత్కంఠను రేపిన ఆ ‘కూల్’ మంత్రం ఇక నిలిచిపోయింది. ఓటమి అంచున ఉన్న జట్టును సైతం విజయతీరాలకు చేర్చే ఆ అద్భుత శక్తి శకం ముగిసింది. తన బ్యాటింగ్ మెరుపులతో, చాణక్య వ్యూహాలతో దశాబ్దాల పాటు అలరించిన ‘మాహీ’ ఇంద్రజాలం మరి చూడలేం.. అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచుతూ, మైదానంలో తన సుదీర్ఘ ఇంద్రజాలానికి ‘తలా’ ముగింపు పలికాడు. కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడుగా మారిన ‘ధోని.. ధోని’ నినాదాన్ని మోస్తూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేదికపై తన సుదీర్ఘ ప్రయాణానికి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని వీడ్కోలు పలికాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు ట్రోఫీలను అందించి, చెపాక్ కోటకు తిరుగులేని రారాజుగా నిలిచి, చెపాక్ స్టేడియాన్ని పసుపు కాంతులతో నింపే ధోనీ క్రికెట్ శకానికి ఫుల్‌స్టాప్ పడింది.
చెన్నై : మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2027 సీజన్‌కు ముందు ధోనీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్లేయర్‌గా రిటైర్మెంట్ ధోనీ.. వచ్చే సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్‌కె) జట్టు మెంటర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్‌కింగ్స్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. ఐపిఎల్ 2027 సీజన్ నుంచి చెన్నై సూపర్‌కింగ్స్ మెంటర్‌గా ధోనీ కొత్త అధ్యాయం మొదలువుతుందని ఆ పోస్టులో తెలిపింది. ధోనీ లేకుండా సీఎస్కే లేదు అని, రెండు దశాబ్ధాలుగా.. ఒక్కటిగా ఎదిగామని, విజయాలు.. ఓటములు కలిగినా, అది మా మధ్య ఉందని సీఎస్కే యజమాని ఎన్ శ్రీనివాసన్ తెలిపారు. ధోనీ నేతృత్వంలోని సీఎస్కే జట్టు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. కెప్టెన్‌గానే కాకుండా ఆ లీగ్‌లోనే ఉత్తమ బ్యాటర్‌గా కూడా ధోనీ ప్రూవ్ చేసుకున్నాడు. సూపర్ కింగ్స్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. చెన్నై సూపర్‌కింగ్స్ తరపున 272 మ్యాచ్‌లు ఆడిన అతను 5314 పరుగులు చేశాడు. అద్భుత ఫినిషర్‌గా పేరుగాంచిన ధోనీ.. అనేక మ్యాచ్‌ల్లో చెన్నైను గెలుపు తీరాలకు చేర్చాడు. ఐపిఎల్ చరిత్రలో ఒక ఆటగాడు కేవలం ఒక ఫ్రాంచైజీకి ఆడిన ఘనత ధోనీదే. ఐపిఎల్ ప్రారంభ సీజన్ 2008 నుంచి 2026 వరకు 18 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణంలో.. ధోనీ కేవలం ఒక కెప్టెన్ లేదా వికెట్ కీపర్ మాత్రమే కాదు, లాయల్టీకి నిలువెత్తు రూపంగా నిలిచిన చెన్నై అసలు సిసలు గుర్తింపు సంపాదించాడు. తాజాగా ఆటగాడిగా వీడ్కోలు పలికి టీమ్ మెంటార్గా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నాడు.
రూ.18కోట్లతో ప్రస్థానం ప్రారంభం...
2008లో జరిగిన తొలి ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని రూ.14 కోట్లకు కొనుగోలు చేయడంతో ఈ జర్నీ మొదలైంది. భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా బరిలోకి దిగిన ధోనీ, క్షణాల వ్యవధిలోనే చెన్నైలో కీలకంగా మారిపోయాడు. 2010లో ముంబయి ఇండియన్స్‌ను ఓడించి తొలిసారి టైటిల్ గెలుచుకున్న చెన్నై.. ఆ మరుసటి ఏడాదే (2011) కప్‌ను డిఫెండ్ చేసుకుని టోర్నమెంట్‌లో తిరుగులేని శక్తిగా అవతరించింది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తలవంచని తత్వం, ఒత్తిడిని జయించే నైజం కారణంగానే అతనికి కెప్టెన్ కూల్ అనే పేరు వచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకెళ్లడం లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకొన్నాడు. అలాగే 2018, 2021, 2023లలో మరో మూడు ట్రోఫీలను సాధించి, చెన్నై ఖాతాలో మొత్తం 5 ఐపీఎల్ టైటిల్స్ చేర్చాడు. రోహిత్ శర్మతో సమానంగా అత్యధిక సార్లు ఐపీఎల్ గెలిచిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. 2023 ఫైనల్‌లో మోకాలి గాయంతో ఇబ్బంది పడుతూనే జట్టును గెలిపించి, జడేజాను ఆత్మీయంగా హత్తుకున్న క్షణం ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని గుండెల్లో నిలిచిపోయింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో పసుపు జెర్సీల సముద్రం మధ్య హోరెత్తే "ధోనీ.. ధోనీ" నినాదాలు కేవలం నినాదాలు కావు, అది ఒక భావోద్వేగం.. 2024లో రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి సరికొత్త తరానికి బాటలు వేసిన ధోనీ, 2025లో తాత్కాలికంగా మళ్లీ జట్టును ముందుండి నడిపించాడు. కానీ 2026 సీజన్ మొత్తం కండరాల గాయం కారణంగా మైదానానికి దూరంగా ఉన్నాడు.






కామెంట్‌లు (0)